Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

ఫెదరర్ @8

 చరిత్ర సృష్టించిన రోజర్
 ఫైనల్లో సిలిక్ చిత్తు
 స్విస్ స్టార్ ఖాతాలో 19వ గ్రాండ్‌స్లామ్

Federer

లండన్: వింబుల్డన్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్ టైటిల్ గెలుచుకున్నాడు. ఫెదరర్‌కు ఇది ఎనిమిదో వింబుల్డన్ టైటిల్ కావడం విశేషం. ఈ క్రమంలో ఇప్పటివరకు పీట్ సంప్రాస్ (అమెరికా) పేరిట ఉన్న ఏడు టైటిళ్ల రికార్డును ఫెదరర్ బద్దలు కొట్టాడు. అంతేగాక ఎనిమిదో వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో మూడో సీడ్ ఫెదరర్ 6-3, 6-1, 6-4 తేడాతో క్రోయేషియాకు చెందిన ఏడో సీడ్ మారిన్ సిలిక్‌ను చిత్తు చేశాడు. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో స్విస్ స్టార్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. చూడచక్కని షాట్లతో మారిన్ సిలిక్‌ను ముచ్చెమటలు పట్టించాడు. అతని ధాటికి సిలిక్ ఎదురు నిలువలేక పోయాడు. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన ఫెదరర్ ఏ దశలోనూ సిలిక్‌ను కోలుకోనివ్వలేదు. తనకు మాత్రమే సాధ్యమయ్యే షాట్లతో చెలరేగి పోయాడు. ఫైనల్‌కు చేరుకునే క్రమంలో అద్భుతంగా ఆడిన సిలిక్ ఇక్కడ మాత్రం ఫెదరర్‌కు కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయాడు. అద్భుత ఆటను కనబరిచిన ఫెదరర్ 6-3తో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్‌లో మరింత విజృంభించాడు. ఈసారి సిలిక్ మరింత పేలవంగా ఆడాడు. తీవ్ర ఒత్తిడికి గురైన సిలిక్ వరుస తప్పిదాలకు పాల్పడ్డాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న ఫెదరర్ మ్యాచ్‌పై పట్టు బిగించాడు. సిలిక్‌ను ముప్పుతిప్పలు పెడుతూ 6-2తో సెట్‌ను గెలుచుకున్నాడు. మూడో సెట్‌లో మాత్రం సిలిక్ కాస్త కుదురుగా ఆడాడు. ఫెదరర్‌కు ఈ సెట్‌లో కాస్త గట్టి పోటీనే ఇచ్చాడు. కళ్లు చెదిరే షాట్లతో ఫెదరర్‌ను కాస్త ఇబ్బంది పెట్టాడు. మరోవైపు స్విస్ స్టార్ కూడా పోరాటాన్ని వీడలేదు. తన మార్క్ షాట్లతో సిలిక్‌ను నిలువరించాడు. ఇదే క్రమంలో 6-4తో సెట్‌ను గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ గెలుపుతో వింబుల్డన్‌లో ఫెదరర్‌కు ఎనిమిదో టైటిల్ దక్కింది. ఫెదరర్ చివరిసారిగా 2012లో వింబుల్డన్ టైటిల్ సాధించాడు. 2014, 2015లలో రన్నరప్‌తో సరిపెట్టుకున్న స్విట్జర్లాండ్ యోధుడు ఈసారి ఛాంపియన్‌గా అవతరించాడు. కాగా, ఫెదరర్ కెరీర్‌లో ఇది 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. పురుషుల సింగిల్స్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరు కూడా ఇన్ని టైటిల్స్ సాధించలేదు. కాగా, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ 15 టైటిల్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. అమెరికా దిగ్గజం పీట్ సంప్రాస్ 14 టైటిల్స్‌తో తర్వాతి స్థానంలో నిలిచాడు.
ఓవరాల్‌గా 19వ టైటిల్
కాగా, ఫెదరర్ కెరీర్‌లో ఇది ఓవరాల్‌గా19వ వింబుల్డన్ టైటిల్ కావడం విశేషం. అత్యధికంగా 8 వింబుల్డన్ టైటిల్స్ సాధించిన ఫెదరర్ ఐదు సార్లు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ సాధించాడు. అంతేగాక ఒకసారి ఫ్రెంచ్ టైటిల్‌ను కూడా గెలుచుకున్నాడు. దీంతోపాటు మరో ఐదు సార్లు యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో కెరీర్ గ్రాండ్‌స్లామ్ సాధించిన అరుదైన క్రీడాకారుల సరసన నిలిచాడు. కాగా, ఫెదరర్ రికార్డు స్థాయిలో వరుస క్రమంలో ఐదేసి సార్లు వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ సాధించిన తొలి క్రీడాకారుడిగా గతంలో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. కొంతకాలంగా జొకోవిచ్ జోరుతో ఫెదరర్ వింబుల్డన్ ఓపెన్‌లో టైటిల్ సాధించలేక పోయాడు. అయితే ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను సాధించిన ఫెదరర్ తాజాగా వింబుల్డన్‌ను కూడా సొంతం చేసుకుని తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు.

Comments

comments