Search
Tuesday 26 September 2017
  • :
  • :
Latest News

రియల్ లైఫ్‌లో భానుమతిలాగే ఉంటా

చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్‌లీ వంటి యూత్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లను రూపొందించి దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్నారు జయ.బి. తాజాగా ఆమె దర్శకత్వంలో రూపొందిన లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘వైశాఖం’. హరీష్, అవంతిక జంటగా ఆర్.జె.సినిమాస్ పతాకంపై బి.ఎ.రాజు నిర్మించిన ఈ చిత్రాన్ని ఈనెల 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ అవంతికతో ఇంటర్వూ…

Avanthika

కుటుంబ నేపథ్యం
మా స్వస్థలం ఢిల్లీ. మా నాన్న ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్. అమ్మ గృహిణి. నాన్న ఉద్యోగరీత్యా ఇండియాలోని చాలా ప్రదేశాల్లో తిరిగారు.
రెండో సినిమా ఇది…
నేను చిన్నప్పుడు టామ్ బాయ్‌లా ఉండేదాన్ని. పైలట్ లేదా స్పోర్ట్ పర్సన్ కావాలనుకున్నాను. నేను స్టేట్ లెవెల్ బ్యాడ్మింటన్ కూడా ఆడాను. నేషనల్ లెవెల్‌కు ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. కానీ నెమ్మదిగా సినిమాల వైపు ఆకర్షితురాలినయ్యాను. తెలుగులో ముందుగా ‘మాయ’ సినిమాలో నటించాను. ఆతర్వాత చేసిన సినిమా ‘వైశాఖం’.
ఆవిధంగా అవకాశం…
నా ఫొటోలు చూసి నిర్మాత బి.ఎ.రాజు, దర్శకురాలు జయ నాకు ఫోన్ చేశారు. వాళ్లు నన్ను ఫొటో షూట్‌కు రమ్మని పిలిచారు. హీరో హరీష్‌తో కలిసి నేను ఫొటో షూట్‌లో పాల్గొన్నాను. షూట్ పూర్తయిన తర్వాత నాకు కథ చెప్పారు. కథ నచ్చి వెంటనే సినిమాకు సైన్ చేశాను.
మోడ్రన్ అమ్మాయిగా కనిపిస్తా…
సినిమాలో నేను భానుమతి అనే పాత్ర చేశాను. ఇందులో నేను మోడ్రన్ అమ్మాయిగా కనపడతాను. భానుమతి కుటుంబ విలువలకు ప్రాముఖ్యతనిచ్చే అమ్మాయి. తనకు ఖచ్చితమైన అభిప్రాయాలు ఉంటాయి. కాస్త బిడియం కూడా ఉంటుంది. దర్శకురాలు జయ… భానుమతి పాత్ర గురించి చెప్పగానే నాకు బాగా కనెక్ట్ అయ్యింది. ఎందుకంటే రియల్ లైఫ్‌లో కూడా నేను అలాగే ఉంటాను. భానుమతి క్యారెక్టర్‌లో నటించడం ఎంతో ఆనందంగా అనిపించింది.
రొమాంటిక్ లవ్‌స్టోరీ…
‘వైశాఖం’ తెలుగులో నాకు మంచి బ్రేక్‌నిస్తుంది. మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ ఇది. సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య చిన్న, చిన్న గొడవలు, ఆటపట్టించడాలు అన్నీ ఉంటాయి. యూత్‌ను ఎంతగానో అలరించే చిత్రమిది.
మ్యూజికల్ హిట్‌గా…
డి.జె.వసంత్ అందించిన పాటలకు చాలా మంచి స్పందన వస్తోంది. పాటలు మ్యూజికల్ హిట్‌గా నిలవడం ఆనందంగా ఉంది. భానుమతి… అనే పాటతో పాటు కంట్రి చిలకా… పాట కూడా నాకు బాగా నచ్చాయి. ఒక్కొక్క పాట ఒక్కో విధంగా ఉంటూ అందరినీ అలరిస్తున్నాయి.
మరచిపోలేని అనుభూతి…
ఈ సినిమాలో సాయికుమార్, రమాప్రభ, కాశీవిశ్వనాథ్ సహా చాలా మంది సీనియర్ నటీనటులు నటించారు. వారితో కలిసి నటించడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. భావోద్వేగాలతో కూడిన సినిమా ఇది. ముఖ్యంగా సాయికుమార్‌తో చాలా ముఖ్యమైన సీన్లు ఉంటాయి నాకు. అలాగే పృథ్వీతో మంచి కామెడీ సన్నివేశాలున్నాయి. హీరోయిన్‌గా నాకు మంచి పేరు తెచ్చే చిత్రమిది.
డ్యాన్స్‌లో కొత్త అనుభవం…
నేను కథక్ నేర్చుకున్నాను. కానీ సినిమాల్లో డ్యాన్స్ చేయడమనేది కొత్త అనుభవాన్నిచ్చింది. ఈ సినిమాలో కంట్రి చిలకా సాంగ్ కోసం 15 రోజుల పాటు కష్టపడి డ్యాన్స్ కూడా నేర్చుకున్నాను. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ సాంగ్‌ను కజకిస్తాన్‌లో మైనస్ ఆరు డిగ్రీల చలిలో చిత్రీకరించారు. అయితే ఈ సినిమాకు చేసిన డ్యాన్స్ ప్రాక్టీస్ వల్ల భవిష్యత్‌లో చేయబోయే సినిమాల్లో బాగా డ్యాన్స్ చేయగలుగుతాననే నమ్మకం కలిగింది.
ఆమె వర్కింగ్ స్టైల్ ఆకట్టుకుంది…
జయ.బి చాలా క్లారిటీ ఉన్న దర్శకురాలు. నటీనటుల నుండి ఏం కావాలో ఆమెకు బాగా తెలుసు. మంచి నటనను ఎలా రాబట్టుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి. ఒక హీరోయిన్ అందంగా కనపడటమే కాదు… చక్కటి పర్‌ఫార్మెన్స్ కూడా చేయాలని ఆమె కోరుకుంటారు. షూటింగ్‌కు ముందు నటనలో నాతో ప్రాక్టీస్ చేయించారు. జయ.బి వర్కింగ్ స్టైల్ నన్నెంతగానో ఆకట్టుకుంది. నిర్మాత బి.ఎ.రాజు పక్కా ప్రొఫెషనల్. సినిమాలో ఎవరికి ఏం కావాలో అన్నీ సమకూర్చారు. ఇక హీరో హరీష్ చాలా మంచి వ్యక్తి. ఎనర్జిటిక్‌గా ఉంటాడు. తనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది.
ఆ సీన్‌కు నాలుగైదు పేజీల డైలాగులు…
సినిమాలో క్లైమాక్స్ సీన్ కోసం చాలా కష్టపడ్డాను. ఈ సన్నివేశం కోసం నాలుగైదు పేజీల డైలాగ్‌లను చెప్పాల్సి వచ్చింది. తెలుగు అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి అంత పెద్ద సీన్ చేయడం చాలా కష్టమైంది. కానీ జయ సహకారంతో ఆ సీన్‌ను చాలా బాగా చేశాను. మంచి ఎమోషనల్ సీన్ ఇది. ప్రేక్షకులందరికీ బాగా కనెక్ట్ అవుతుంది.
ఆ సినిమాలు నచ్చాయి…
తెలుగు సినిమాలను చూస్తుంటాను. ఇటీవల బాహుబలి-2, డీజే.. దువ్వాడ జగన్నాథమ్ సినిమాలను చూశాను. ఇవి బాగా నచ్చాయి. తెలుగులో ప్రభాస్, బన్నీ, అనుష్క వంటి ఎంతో మంది టాలెంటెడ్ ఆర్టిస్టులున్నారు.
వారియర్ ప్రిన్స్ పాత్ర చేయాలనుంది…
ప్రస్తుతం తమిళంలో అశోక్ సెల్వన్‌తో ‘నెంజమెల్ల కాదల్’ సినిమా చేస్తున్నాను. కొన్ని సినిమా అవకాశాలు వస్తున్నాయి. అయితే పీరియాడిక్ మూవీలో నాకు వారి యర్ ప్రిన్స్ పాత్ర చేయా లనే కోరిక ఉంది.

Comments

comments