Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

మకరొవా-వెస్నినా జోడీకీ టైటిల్

Tennis-Doubles

లండన్ : వింబుల్డన్ ఓపెన్‌లో మహిళల డబుల్స్ టైటిల్‌ను రష్యాకు చెందిన రెండో సీడ్ మకరొవా-వెస్నినా జోడీ గెలుచుకుంది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో రష్యా జంట 6-0, 6-0 తేడాతో హావ్ చింగ్ చాన్ (తైవాన్), మోనికా నికులెస్కా (రుమేనియా) జోడీని చిత్తు చేసింది. ప్రారంభం నుంచే చెలరేగి ఆడిన మకరొవా జోడీ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. వీరి ధాటికి ప్రత్యర్థి జంట కనీస ప్రతిఘటన కూడా ఇవ్వలేక పోయింది. అసాధారణ ఆటతో చెలరేగిన రష్యా జంట ప్రత్యర్థి జోడీకి కనీసం ఒక్క గేమ్‌ను కూడా గెలుచుకునే అవకాశం ఇవ్వకుండానే తొలి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్‌లో కూడా ఇదే ఫలితం పునరావృతం అయ్యింది. చెలరేగి ఆడిన రష్యా జోడీ 6-0తో సెట్‌ను గెలిచి వింబుల్డన్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
డబుల్స్ విజేత లుకాస్ జంట
పురుషుల డబుల్స్ టైటిల్‌ను లుకాస్ కుబొట్(పోలండ్), మార్సెలొ మెలొ (బ్రెజిల్) కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన మారథాన్ ఫైనల్లో నాలుగో సీడ్ లుకాస్ జంట 5-7, 7-5, 7-6, 3-6, 13-11 తేడాతో మార్ష్ (ఆస్ట్రియా), పొవిక్ (క్రోయేషియా) జోడీని ఓడించింది. ప్రారంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇరు జంటలు కూడా ఫలితం కోసం సర్వం ఒడ్డాయి. దీంతో తొలి మూడు సెట్లు టైబ్రేకర్ వరకు వెళ్లాయి. తొలి, నాలుగో సెట్‌లో మార్ష్ జంట విజయం సాధించగా, రెండు, మూడు, చివరి సెట్లలో లుకాస్ జోడీ విజయం సాధించింది. చివరి సెట్ మాత్రం యుద్ధాన్ని తలపించింది. ఇరు జోడీలు కూడా విజయం కోసం నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి. అయితే చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడంలో సఫలమైన లుకాస్ జోడీ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

Comments

comments