Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

రేప్ తిరకేసు

జరగలేదంటున్న ‘బాధితు’రాలు, చేశానంటున్న నిందితుడు
బ్యూటీషియన్‌పై అత్యాచారం కేసులో విచిత్రమైన మలుపు

Rape-Caseహైదరాబాద్ సిటీబ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన బ్యూటీషియన్ అత్యాచారం కేసు కొత్త మలుపు తిరిగింది. పేట్‌బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో గత నెల 6వ తేదీన పెళ్లి విషయం మాట్లాడుకుందామని యువతిని ఇంటికి పిలిపించి అత్యాచారం చేసి.. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి అత్యాచార యత్నానికి ఒడిగట్టిన దారుణ సంఘటన తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు నిందితుల్లో ఒకరు అరెస్టు కాగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వీరిలో ఒకరు ఎమ్మెల్సీ కుమారుడు కాగా మరో ఇద్దరు కూడా బడాబాబుల కుమారులే కావడం గమనార్హం. ఇప్పుడు ఈ కేసు అడ్డం తిరిగింది. అసలు తనపై అత్యాచారమే జరగలేదని, కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకే భయపడి నిందితులపై తప్పుడు ఫిర్యాదు ఇచ్చానని బాధితురాలు స్వయంగా న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇచ్చింది. దీంతో దర్యాప్తు అధికారు లు తలలు పట్టుకున్నారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు ఏ విధంగా చేయాలో న్యాయ సలహా ఇవ్వాలంటూ పేట్ బషీరాబాద్ పోలీసులు హైకోర్టులో తాజాగా పిటిషన్ వేశారు.

బాధితురాలిపై అత్యాచారం చేశానని, అంతటితో ఆగకుండా తన ఇద్దరు స్నేహితులతో కలిసి మరోసారి అఘాయిత్యానికి యత్నించామని స్వయంగా నిందితుడు కోర్టులో వాంగ్మూలం ఇచ్చాడు. నిందితుడు, బాధితురాలి వాంగ్మూలాలు పరస్పర విరుద్ధ్దంగా ఉండడంతో హైకోర్టు ఈ కేసులో ఎలాంటి తీర్పు ఇస్తుందోనని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్‌కు చెందిన బ్యూటీషియన్ (23), కొంపల్లికి చెందిన పారిశ్రామికవేత్త కుమారుడు బిబిఎ ఫస్టియర్ విద్యార్థి ప్రీతంరెడ్డి (21)లు ప్రేమించకుంటున్నారు. అయితే పెళ్లి విషయం మాట్లాడుకుందాని ఆమెను తన ఇంటికి పిలిపించుకున్న ప్రీతంరెడ్డి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తరువాత ఆమెను బెడ్‌రూంలో నిర్భంధించి తన ఇద్దరు స్నేహితులు స్నేహిత్‌రెడ్డి, అరఫ్‌రెడ్డిలను పిలిపించి మరోసారి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. చివరకు బాధితురాలిని ఈ ముగ్గురు కలిసి ప్రీతంరెడ్డి కారు (ఎపి 28బిఎక్స్ 3888)లో బలవంతంగా తీసుకెళ్లి ఆమెపై మరోసారి అత్యాచార యత్నానికి ఒడిగట్టారు. ఇదంతా బాధితురాలు మరుసటి రోజు పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఉంది. ఈ కేసులో ప్రీతంరెడ్డిని అదే సమయంలో అరెస్టు చేసి జైలుకు పంపించారు. స్నేహిత్‌రెడ్డి, అరఫ్‌రెడ్డిలు పరారీలో ఉన్నారు. వీరిలో ఒకరు ఎమ్మెల్సీ కుమారుడు కావడం గమనార్హం.

ఈ కేసు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. బాధితురాలు నిందితుడి ఇంటికి వచ్చినట్లు సిసిటివిలో ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపించాయి. అంతేకాకుండా 13 మంది నుంచి సాక్షాధారాలు పోలీసులు సేకరించారు. నిందితులు ముగ్గురు విఐపిల కుమారులే కావడంతో కేసులోంచి బయటపడేందుకు పథకం పన్నారు. చట్టంలో ఉన్న కొన్ని లొసుగులు వీరు ఆయుధంగా చేసుకున్నారు. తాజాగా బాధితురాలు న్యాయమూర్తి వద్దకు వచ్చి తనపై అసలు అత్యాచారమే జరగలేదని, కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు భయపడి నిందితులపై తప్పుడు ఫిర్యాదు ఇచ్చానని వాంగ్మూలం ఇచ్చింది. నిజంగా ఆమెపై అఘాయిత్యమే జరగలేదా..లేదా బడాబాబులు తమ కుమారులను తప్పించేందుకు పన్నిన కుట్రలో భాగంగానే ఆమె ఈ విధంగా మాట మార్చిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. లేక నిందితులకు భయపడి బాధితురాలు మాట మార్చిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బాధితురాలు ఇప్పుడు అడ్డం తిరగడంతో కేసు తదుపరి దర్యాప్తు ఎలా చేయాలో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఈ కేసులో తమకు న్యాయ సలహా ఇవ్వాలంటూ పేట్‌బషీరాబాద్ పోలీసులు వారం రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం హైకోర్టు పరిశీలనలో ఉంది. హైకోర్టు కేసు దర్యాప్తు చేయాల్సిందేనని ఆదేశిస్తే పరారీలో ఉన్న ఎమ్మెల్సీ కుమారుడ్ని అరెస్టు చేయాల్సిందే.
అత్యాచారం చేశాను : ‘ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాను. ఆ తరవాత మూడు గంటల పాటు బెడ్‌రూంలో బంధించి స్నేహితులు స్నేహిత్‌రెడ్డి, అరఫ్‌రెడ్డిలను ఇంటికి పిలిపించాను. ముగ్గురం మరోసారి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాము. చివరకు ఆమెను కారులో ఎక్కించుకుని కొంపల్లిలో దించేసి వచ్చాము’ అని అరెస్టు సమయంలో ప్రీతంరెడ్డి కోర్టుకిచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు.

Comments

comments