Search
Friday 20 April 2018
  • :
  • :

టిఆర్‌ఎస్ వారున్నా వెనుకాడొద్దు

డ్రగ్స్, కల్తీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
రాష్ట్రంలో అక్రమార్కులను ఏరివేయాలి : సిఎం

KCRహైదరాబాద్ : డ్రగ్స్, ఆహార పదార్థాల కల్తీ తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదివారం సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దర్యాప్తు తీరును సిఎం ప్రశంసించారు. ప్రమాదకరమైన ఇలాంటి విషయాలలో అత్యంత కఠినంగా వ్యవహరించాలి, ఇం దులో తర, తమ భేదాలు చూ పొద్దు, డ్రగ్స్ రవాణా, వినియో గం, విక్రయం తదితర విషయాలలో ఉన్న వారు ఎవరైనా సరే వదలొద్దు, టిఆర్‌ఎస్ పార్టీ వారున్నా వెనక్కు తగ్గద్దు, డ్రగ్స్ కు, కల్తీలకు రాష్ట్రంలో చోటుండొద్దు, ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని పని చేయండని ఆయన సూచించారు. డ్రగ్స్ వినియోగం అత్యంత ప్రమాదకరం, ఇది సమాజాన్ని నిర్వీర్యం చేస్తోంది, ఈ జాడ్యం ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది, ఈ దుర్మార్గాన్ని రూపుమాపండి, తెలంగాణలో ఇలాంటి అరాచకం అంతం చేయండన్నారు. దర్యాప్తును వేగవంతం చేయాలని, మూలాలను శోధించి నిర్మూలించాలని, ఇందుకు అవసరమైతే పోలీసు శాఖ సహాయాన్ని తీసుకోవాలని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌కు సిఎం సూచించారు. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను సరఫరా చేయలేం, వినియోగించలేం అనే విధంగా భయభ్రాంతులయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పదునైన చట్టాలను తీసుకు వద్దాం, ఇందుకోసం మీరు సలహాలు, సూచనలు ఇవ్వండి, హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేద్దామని అధికారులకు పిలుపు నిచ్చారు. ఈ కేసు పరిశోధనలో ఎక్కడా రాజకీయ జోక్యం ఉండదని, ఎవరినీ కాపాడాల్సిన ఆఘాయిత్యం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
వివరాలు వెల్లడించిన అకున్, అనురాగ్ శర్మ : డ్రగ్స్ కేసు దర్యాప్తులో ఇప్పటి వరకు లభించిన ఆధారాలు, వెలుగులోకి వచ్చిన పేర్లు, పట్టుకున్న డ్రగ్స్, వాటి తీవ్రత తదితర అంశాలను అకున్ సబర్వాల్ సిఎంకు నివేదించారు. కస్టడీలోకి తీసుకున్న నిందితుల నుంచి సేకరించిన వివరాలను కూడా నివేదికలో పొందుపరిచారు. ఆహార పదార్ధాల కల్తీ, కల్తీ విత్తనాల అమ్మకంపై రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న చర్యలను డిజిపి అనురాగ్‌శర్మ వివరించారు. కల్తీ విత్తనాల విషయంలో 56 బృందాలు, ఆహార కల్తీ విషయంలో14 బృందాలు పని చేస్తున్నాయని చెప్పా రు. కల్తీ విత్తనాలకు సంబంధించి ఇప్పటి వరకు 77 కేసులు నమోదు చేసి 72 మందిని అరెస్టు చేశామని, ఆహార కల్తీకి సంబంధించి 340 కేసులు నమోదు చేసి 562 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఆహార పదార్థాల నాణ్యతా ప్రమాణాలు పరీక్షించేందుకు అవసరమైన ఫుడ్ ఇన్‌స్పెక్టర్లను వెంటనే నియమించాలని, విత్తనాల నాణ్యత పరీక్షల ఫలితాలు వెంటనే వచ్చేలా చూడాలని వ్యవసాయ శాఖను సిఎం ఆదేశించారు. కల్తీలు, సంఘ విద్రోహకశక్తుల పట్ల చాకచక్యంగా పనిచేసే సిబ్బందికి ఆగస్టు 15న నా చేతుల మీదుగా రివార్డులు అందిస్తానని సిఎం అన్నారు.
ఉన్నతాధికారులకు బాధ్యతలు : కొత్తగా ఏర్పాటైన జిల్లాలు, పోలీసు కమిషనరేట్లకు అనుగుణంగా తలపెట్టిన పోలీసు కార్యాలయాల నిర్మాణాలను వేగవంతం చేయాలని సిఎం సూచించారు. ఈ సమీక్షలో అధికారుల వారిగా కొన్ని బాధ్యతలను సిఎం అప్పగించారు. గుడంబా తయారీదారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కోసం బ్యాంకులతో సంబంధం లేకుండా ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని పర్యవేక్షించే బాధ్యతను సిఎంఓ అధికారులు నర్సింగరావు, శాంతికుమారికి అప్పగించారు. కల్తీలు, డ్రగ్స్ తదితర వ్యవస్థీకృతనేరాల అదుపు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టాల్లో ఎలాంటి మార్పులు తేవాలన్న అంశంపై అధ్యయనం చేసి సిఫార్సు చేసే బాధ్యతను హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డికి ఇచ్చారు. ఇంటెలీజెన్స్ చీఫ్‌కు వ్యవస్థీకృత నేరాలను అదుపు చేసేందుకు కౌంటర్ ఇంటెలీజెన్స్ తరహాలో నిరంతర నిఘా కోసం ప్రత్యే క విభాగం ఏర్పాటు చేసే బాధ్యతను కట్టబెట్టారు. కల్తీ విత్తన తయారీ కేంద్రాలు, ఆహార పదార్థాలు జరిగే ప్రాంతాలపై ఆకస్మిక దాడులు చేయడంతో పాటు ఇతర వ్యూహాల అమలు పర్యవేక్షణ బాధ్యతను డిజిపి అనురాగ్‌శర్మకు ఇచ్చారు.

డ్రగ్స్ విషయంలో పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి భాగస్వామ్యం ఉన్న ప్రతి ఒక్కరికీ కఠిన శిక్షలు పడే దాకా చర్యలు తీసుకునే బాధ్యతను ఎక్సైజ్ కమిషనర్ ఆర్‌వి చంద్రవదన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌కు అప్పగించారు. హైదరాబాద్, వరంగల్ ఐజీలు స్టీఫెన్ రవీంధ్ర, నాగిరెడ్డిలకు హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో ఇలాంటి అక్రమ దందాలకు తావులేకుండా ఆదిలోనే అరికట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహం రూపొందించి అమలు చేసే బాధ్యతను ఇచ్చారు. కల్తీ విత్తనాలు, ఆహార పదార్థాలు జరిగే ప్రాంతాలను గుర్తించి జిల్లా కలెక్టర్ల సహాయంతో అరికట్టే బాధ్యతను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్‌కు, అక్రమాలకు పాల్పడే అధికారులను గుర్తించి, అవినీతి అధికారుల చిట్టా తయారు చేసే బాధ్యతను ఎసిబి డిజి జె. పూర్ణచందర్‌రావుకు, కొత్త పోలీ సు కార్యాలయాలు, పోలీసుస్టేషన్లు, ఎక్సైజ్ స్టేషన్లు, సిబ్బంది క్వార్టర్ల నిర్మాణ పనుల బాధ్యతను పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ దామోదర్ గుప్త, ఆ సంస్థ ఎం.డి మల్లారెడ్డిలకు ఇచ్చారు. ఎక్సైజ్ శాఖను బలోపేతం చేసే బాధ్యతను ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మకు, విత్తనాల నాణ్యత పరీక్షల ఫలితా లు వెంటనే వచ్చే విధంగా చర్యలు తీసుకునే బాధ్యతను వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్‌కు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లను నియమించి కేసుల్లో సహకరించే బాధ్యత ను జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డికి, ధూల్‌పేటలో గుడంబా నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, తయారీదారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించే బాధ్యతలను మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావులకు అప్పగించారు. ఈ సమావేశంలో మంత్రులు నాయినినర్సింహారెడ్డి, పద్మారావు పాల్గొన్నారు.

Comments

comments