Search
Thursday 27 July 2017
  • :
  • :
Latest News

టిఆర్‌ఎస్‌ను బొందపెట్టి ఘోరీ కడుతాం

2019లో అధికారంలోకి రావడం ఖాయం
ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ
కెసిఆర్‌ది అంతా అవినీతి పాలనే
టిపిసిసి ఛీఫ్ ఉత్తం కుమార్‌రెడ్డి

                       Uttam-kumar-Reddy

మానకొండూర్: టిఆర్‌ఎస్ పాలనలో అవినీతి పెరిగిపోయిందని, రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను బొందపెట్టి ఘోరీ కట్టడం ఖాయమని టిపిసిసి అధ్యక్షులు ఉత్తం కుమార్‌రెడ్డి టీఆర్‌ఎస్‌పై ధ్వజమెత్తారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ముంజంపల్లి కెఎస్‌ఆర్ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ నందగిరి రవీంద్రాచారి అభినందన సభకు ఉత్తం కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభకు రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సభలో ఉత్తమ్ మాట్లాడుతూ తెలంగాణలో 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ పాలనలో రైతులు, విద్యార్థులు, దళితులు, మహిళలు అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. రైతులకు మద్దతు ధర కల్పిస్తామని, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నారు. వరికి రూ.2 వేల మద్ధతు ధర చెల్లిస్తామని, ఇందిరమ్మ ఇళ్లకు తిరిగి బిల్లులు చెల్లిస్తామని తెలిపారు. మహిళా సంఘాలకు రాయితీలు ఇస్తామని అన్నారు.

ఇప్పటి ప్రభుత్వం ఇస్తున్న ఫింఛన్‌లను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెంచుతామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హమీ ఇచ్చారు. డిసిసి అధ్యక్షులు కటకం మృత్యుంజయం మాట్లాడుతూ తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. కెసిఆర్ సర్కార్ సొమ్మును లూటీ చేస్తున్నాడని ఆరోపించారు. కెసిఆర్ దివాలాకోరు, అబద్ధాలకోరు అని మండిపడ్డారు. కరీంనగర్‌ను లండన్ చేస్తానని తుపాకి రాముని మాటలు మాట్లాడుతూ దిగజారుతున్నాడని విమర్శించారు.

మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌లు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలన్నారు. కార్యకర్తలు కష్టపడి పనిచేసి యాభై శాతం ఓట్లు తీసుకురావాలని సూచించారు. కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి, ఏ సమస్య వచ్చినా వారి వెన్నంటే ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఉత్తం కుమార్‌రెడ్డిని నాయకులు, కార్యకర్తలు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అంతకు ముందు ఉత్తం కుమార్‌రెడ్డికి ఆరెపల్లి మోహన్ ఆధ్వర్యంలో అన్నారం రోడ్డులో ఘన స్వాగతం పలికి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశంలో పిసిసి అధికార ప్రతినిధి ప్యాట రమేశ్, చల్మెడ లక్ష్మినర్సింహారావు, సీనియర్ నాయకులు పెండ్యాల రాంరెడ్డి, పడాల శంకరయ్య, డిండిగాల మధు, యాళ్ల వెంకట్‌రెడ్డి, కోండ్ర శంకర్, పిట్టల మధు, గసిగంటి సంపత్, మర్రి ఓదెలు, నెల్లి మురళి, జిల్లెల్ల సంపత్, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటీసి సభ్యులు,  కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

comments