Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

స్ఫూర్తి యాత్ర భగ్నం

కోదండరామ్ అరెస్టు
హైదరాబాద్‌కు తరలింపు
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
జెఎసికి, పోలీసులకు మధ్య తోపులాట
యాత్రను అడ్డుకొని కామారెడ్డి సభా వేదికను కూల్చివేసిన టిఆర్‌ఎస్ కార్యకర్తలు
దాడిలో జెఎసి విద్యార్థి నాయకులకు గాయాలు, ఒకరిని గాంధీకి తరలింపు

Kodanda-ram

కామారెడ్డి: జెఎసి ఆధ్వర్యంలో తలపెట్టిన 4వ విడత అమరుల స్ఫూర్తి యాత్రకు కామారెడ్డి జిల్లాలో అడుగడుగునా ఆటంకాలు ఏర్పడ్డాయి. కామారెడ్డిలో ఏర్పాటు చేసి న బహిరంగ సభా వేదికను టిఆర్‌ఎస్ కార్యకర్తలు కూల్చివేశారు. యాత్రను బిక్కనూర్‌లో టిఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో పోలీసులు జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌తో సహా యాత్రలో పాల్గొన్న పలువురు నేతలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జెఎసి కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో కొంతసేపు బిక్కనూర్ పోలీసుస్టేషేన్ ఎదుట ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కోదండరామ్‌ను అరెస్టు చేసిన పోలీసులు ఆయనను డిఎస్‌పి ఆధ్వర్యంలో హైదరాబాద్ తరలించారు. ఒకవైపు టిఆర్‌ఎస్ కార్యకర్తలు.. మరోవైపు పోలీసులు యాత్రను నిలువరించే ప్రయత్నం చేశారు. యాత్ర కామారెడ్డి జిల్లాలోని బస్వాపూర్‌కు చేరుకోగా టిఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకొని జెఎసికి, కోదండరామ్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం యాత్ర బిక్కనూర్, దోమకొండ, తదితర పట్టణాల గుండా కామారెడ్డికి చేరుకుంది. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట జెఎసి సభా స్థలిని ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూలల నుండి సభకు జనం తరలివచ్చారు. అదే సమయంలో తెలంగాణ వ్యతిరేకి కోదండరామ్ గోబ్యాక్ అంటూ టిఆర్‌ఎస్ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభా స్థలికి చేరుకున్నారు. దీంతో జెఎసి నేతలు కూడా టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇరువర్గాలను పోలీసులు శాంతింపజేసే ప్రయత్నం చేసినప్పటికీ టిఆర్‌ఎస్ కార్యకర్తలు మూకుమ్మడిగా జెఎసి నేతలపై, విద్యార్థులపై దాడికి పూనుకోవడంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ప్రజలు ఈ సంఘటనతో భయభ్రాంతులై పరుగులు తీశారు. మరోవైపు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇరువర్గాలు కుర్చీలు, కోడిగుడ్లు, టమాటోలతో దాడి చేసుకున్నారు. టిఆర్‌ఎస్ నాయకులు చేసిన దాడిలో ముగ్గురు జెఎసి విద్యార్థి సంఘాల నాయకులు పృధ్వీరాజ్ (28), ప్రకాశ్‌నాయక్ (32), సందీప్ (36)లకు తీవ్ర గాయాలు కాగా వారిలో పృధ్వీరాజ్ పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి అదుపులో లేదని చెప్పడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రకాశ్‌నాయక్, సందీప్‌లను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగానే సభా స్థలిని టిఆర్‌ఎస్ వర్గాలు కూలదోశాయి. ఈ సంఘటనతో టిఆర్‌ఎస్ నాయకులపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడవలు మరింత పెరగకుండా ఎస్‌ఐలు రాజాగౌడ్, సంతోష్, డివిజన్ పరిధిలోని పలు మండలాలకు చెందిన ఎస్‌ఐలు అడ్డుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అనంతరం మరికొంత సేపు దాడులు కొనసాగాయి. కొంతసేపటి అనంతరం గొడవ సద్దుమణగగా జెఎసి నాయకులు సభా స్థలి వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతు సంఘం జెఎసి నాయకుడు రవి మాట్లాడుతూ సభా స్థలిపై దాడి చేసి కూల్చివేయడం హేయమైన చర్య అన్నారు. జెఎసి కార్యకర్తలు మున్సిపల్ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు నల్లగుడ్డలు ధరించి మౌన దీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేతలను పరామర్శించారు. తమపై దాడికి పూనుకున్న నిందితులను రేపటిలోగా అదుపులోకి తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

అప్రజాస్వామికం : సిపిఐ
మన తెలంగాణ / హైదరాబాద్ : అమరుల స్ఫూర్తియాత్ర చేస్తున్న జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌ను టిఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడం, పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. కామారెడ్డిలో జెఎసి బహిరంగసభకు హాజరైన ఎఐఎస్‌ఎఫ్, తదితర విద్యార్థి సం ఘాల నాయకులు, విద్యార్థులపై టిఆర్‌ఎస్ కార్యకర్తలు రాళ్ళతో దాడిచేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బహిరంగసభ వేదిక ,టెంట్లను టిఆర్‌ఎస్ కార్యకర్తలు కూల్చివేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడమంటే స్వామిభక్తిని ప్రదర్శించడమేనని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలపై అధికార పార్టీ కార్యకర్తలు దాడి చేయడం హింసను ప్రోత్సహించడమే అవుతుందన్నారు. కెసిఆర్ ఒకవైపు బంగారు తెలంగాణ అంటూ మరోవైపు ‘గాయాల తెలంగాణ’గా మార్చడం నియంతృత్వ పోకడలకు అద్దం పడుతుందని విమర్శించారు.
ప్రజాస్వామిక స్ఫూర్తికి విఘాతం : సిపిఐ(ఎం)
టిజెఎసి ఛైర్మన్ కోదండరామ్ ‘అమరవీరుల స్ఫూర్తి యాత్ర’ను టిఆర్‌ఎస్ కార్యకర్తలు బస్వాపూర్‌లో అడ్డుకుని దాడి చేయడాన్ని సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రంగా ఖండించారు. యాత్రకు సంఘీభావం పలికిన విద్యార్థులను కూడా వదలకుండా పోలీసులు లాఠీఛార్జి చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించడంతో పాటు, ప్రజా ఉద్యమాల పట్ల ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తెలియజేస్తుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యమాల పట్ల ప్రభుత్వ నిరంకుశ వైఖరిని విడనాడనట్లయితే ప్రజలనుండి ప్రతిఘటన తప్పదని ఆయన హెచ్చరించారు.
ప్రజాస్వామ్యం ఖూనీ
టిజెఎసి చైర్మన్ కోదండరామ్ నిర్వహిస్తున్న స్ఫూర్తియాత్రపై దాడిని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. దోషులను తక్షణమే అరెస్టు చేయాలని ఆ పార్టీ తెలంగాణ విభాగం రాష్ట్ర కార్యదర్శి డివి కృష్ణ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మూడు దఫాలుగా విజయవంతంగా స్ఫూర్తి యా త్రలు పూర్తిచేసి, నాలుగో విడత యాత్రను కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో చేపట్టారని కృష్ణ అన్నారు.ఈ యాత్రను కామారెడ్డి జిల్లా బసవాపూర్ వద్ద టిఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డగించారని, ఆ తర్వాత బిక్‌నూర్‌లో దాడి చేసి టెంట్‌ను చించివేశారని, కార్యకర్తలపై దాడి చేశారని, పూర్తిస్థాయి అనుమతులు తీసుకొని యాత్ర చేస్తుంటే, రక్షణ ఇవ్వలేమని చెబుతూ పోలీసులు అడ్డుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.దాడి చేసిన వారిని కాకుండా, యాత్రలో ఉండి దాడికి గురైన వారిని అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, ప్రభుత్వం నిరంకుశ వైఖరిని ప్రదర్శిస్తోందని, స్వేచ్చను హరిస్తోందని కృష్ణ విమర్శించారు.

Comments

comments