Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

లెక్క తప్పింది

7.5% వృద్ధిరేటు అసాధ్యమని ఆర్థికసర్వే వెల్లడి

దేశ ప్రగతిబాటలో తీవ్ర సవాళ్లు పొంచి ఉన్నట్లు స్పష్టీకరణ

వడ్డీ రేట్లు మరింత తగ్గాలని సూచన

arun-jatiley

న్యూఢిల్లీ : దేశ ఆర్థిక పరిస్థితిలో అనిశ్చి తి నెలకొని ఉంది. ఇంతకు ముందు అనుకున్న 7.5 శాతం వృద్ధి రేటును సాధించడం కష్టమని ఆర్థిక సర్వేలో వెల్లడైంది. ఆర్థిక వ్యవస్థకు పలు సవాళ్లు పొంచి ఉన్నాయని ఈ కీలక ఆర్థిక సమీక్షలో స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సం వత్సరానికి రూపొందించిన ఆర్థిక సర్వే రెండవ (తుది) భాగాన్ని శుక్రవారం ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ ముందుంచారు. ఈ ఆర్థిక సర్వేలోని అంశాలలో దేశ ప్రగతి క్లిష్టతరంగానే ఉందని వెల్లడైంది. ప్రభుత్వం అంచనా వేసుకుంటూ వస్తున్న అత్యున్నత స్థాయి జిడిపి వృద్ధి రేటు 6.75 శాతం 7.5 శాతం సాధించడం కష్టమే అని ఈ నివేదికలో తేల్చిచెప్పారు. ఈ ఆర్థిక సర్వేను ప్రభుత్వ ఆర్థిక ప్రధాన సలహాదారుడు అరవింద్ సుబ్రమణియన్ రూపొందించారు. అనుకున్న విధంగా ఆర్థిక ప్రగతి ఉండే అవకాశాలు లేవని, ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మరింతగా వడ్డీరేట్ల తగ్గింపు అవసరం అని సూచించారు. ఆర్థిక రంగ సవాళ్లను ఈ సర్వే ప త్రంలో ఉటంకించారు. రూపాయి విలువ పెరగడంతో ఉత్పన్నమవుతోన్న సమస్యలు, వ్యవసాయ రుణాల మాఫీ, విద్యుత్, టెలీకాంలో బ్యాలెన్స్ ఒత్తిళ్లు, జిఎస్‌టి అమలుతో తలెత్తుతున్న పరిణామదశ అంశాలు అనేవి పలు విధాలుగా సవాళ్లకు దారితీస్తున్నాయి. ప్రత్యేకించి వ్యవసాయ రుణాల మాఫీ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై భారీగా పడుతోందని విశ్లేషించారు. జడిపి వృద్ధిరేటు లక్షంపై దీని ప్రభావం కనీసం ౦.7 శాతం మేర గండికొడుతుందని తెలిపారు.ఇప్పటికి ఇంకా పుంజుకోని దశలోనే ఉన్న ఆర్థిక, ద్రవ్య వ్యవస్థపై పలు విధాలుగా తిరోగమన ప్రభావాలు పడనున్నాయని సర్వేలో హెచ్చరించా రు. పలు ఆర్థిక తప్పిదాలు ఇందుకు కారణంగా నిలిచాయని విశ్లేషించారు.
రుణమాఫీల మొత్తం రూ 2.7 లక్షల కోట్లు
రాష్ట్రాలకు సంబంధించి పంట రుణాలు, ఇతరత్రా వ్యవసాయ రుణాల మాఫీ మొత్తం కలిపితే రూ 2.7 లక్షల కోట్లకు చేరింది. అయితే ద్రవ్బోల్బణం రిజర్వ్ బ్యాంక్ అంచనాల మేరకు మధ్యస్థంగా 4 శాతానికి తక్కువగానే ఉంటుందని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరపు ద్రవ్యలోటు 3.5 శాతంతో పోలిస్తే 2౦1718 ఆర్థిక సంవత్సరంలో జిడిపిలో ద్రవ్యలోటు 3.2 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. రెపోరేటు తటస్థ స్థాయి కన్నా ఎక్కువగా 2575 ప్రాతిపదికన ఉంది. దీనితో ద్రవ్య విధానం సరళీకృతం అయ్యేందుకు వీలేర్పడుతుంది. గత వారం ఆర్‌బిఐ తమ ప్రధాన పాలసీ రేట్లను తగ్గించింది. 2౦1౦ నవంబర్ నుంచి చూస్తే ఇది అత్యంత తక్కువ. ద్రవ్య సరళీకృతం చాలా కీలకమైన పరిణామం అవుతుందని తెలిపారు. ఇక ప్రతికూల పరిస్థితుల గురించి ఇందులో విశ్లేషించారు. పంట రుణాల రద్దుతో పాటు వ్యవసాయపరంగా ఆదాయం పడిపోవడం , తృణేతర ధాన్యాల ధరలు పడిపోవడం, ద్రవ్య కటుతర విధానాలు, విద్యుత్, టెలీకాం రంగాలలో లాభాలు తగ్గడం వంటివి ఆర్థిక ప్రగతికి ప్రమాద సంకేతాలు అని విశ్లేషించారు. ఇప్పటికీ ఆర్థిక పరిస్థితి కోలుకోలేదని స్పష్టం చేశారు. జిడిపి, ఐఐపి, క్రెడిట్ ఆఫ్‌టేక్, పెట్టుబడులు, సామర్థ వినియోగం వంటి పలు సూచీకలు ఆర్థిక సంవత్సరంలో వాస్తవిక పురోగతి క్షీణతను తెలియచేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జనవరి 31న ఆర్థిక సర్వే తొలి విడతను ప్రవేశపెట్టారు. రెండు భాగాలుగా ఆర్థిక సర్వే నివేదికను పార్లమెంట్‌కు సమర్పించడం ఇదే తొలిసారి. అప్పటి నివేదికలో జిడిపి వృద్ధిరేటు 6.75 శాతం 7.5 శాతం మధ్యలో ఉంటుందని అంచనా వేశారు. ఆ తరువాత అంటే ఫిబ్రవరి తరువాత జరిగిన పరిణామాలు ఆర్థిక రంగంపై ప్రభావం చూపాయని పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రూపాయి విలువ పెరుగుతూ వచ్చింది. ఇది దాదాపు ఒకటిన్నర శాతం పెరిగింది. దీని ప్రభావం పెట్టుబడుల రాకపై పడిందని విశ్లేషించారు.
జిఎస్‌టి అమలు అనంతర పరిస్థితి
ప్రభుత్వం చేపట్టిన వ్యవస్థీకృత సంస్కరణల అంశాలను కూడా సర్వేలో ప్రస్తావించారు. . జిఎస్‌టి అమలు, ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ, ఇంధన సబ్సిడీల క్రమబద్ధీకరణం, బ్యాంక్‌లు ఎదుర్కొంటున్న ట్విన్ బ్యాలెన్స్ సమస్య పరిష్కార చర్యలువంటివి కీలక సంస్కరణలు అని పేర్కొన్నారు. కాలక్రమంలో పాతనోట్ల రద్దు ప్రయోజనాలు కొనసాగుతూ వస్తున్నాయని, నామమాత్రపు జిడిపి వృద్ధిరేటు పెద్ద నోట్లరద్దు తరువాతనే నమోదు అయిందని తెలిపారు. జిఎస్‌టి అమలు తరువాత పన్నుల వ్యవస్థ బలోపేతం అవుతోన్నదాఖలాలు కన్పిస్తున్నాయి. నోట్ల రద్దు ప్రక్రియతో తీసుకున్న చర్యలతో దాదాపు 5.4 లక్షల మంది కొత్త పన్ను చెల్లింపుదార్లు పన్నుల వ్యవస్థలో ఇమిడిపొయ్యారని వెల్లడించారు. చెక్‌పోస్టుల తొలిగింపు , సరుకుల రవాణా అవరోధాల నిర్మూలన వంటి చర్యలు ఆర్థిక వ్యవస్థకు తాత్కాలిక పోషకాలుగా మారుతాయని నివేదికలో తెలిపారు.
ఆరోగ్య, విద్యారంగాలపై వ్యయం పెంచాలి
దేశంలో సామాజిక సేవలకు వ్యయం రూ 11,18,౦94 కోట్లకు చేరుకుని 11 శాతం మేర గతంతో పోలిస్తే హెచ్చింపు ఉంది. అయితే సామాజిక మౌలికవ్యవస్థకు కేటాయింపులు పెరగాల్సి ఉందని, ప్రత్యేకించి వైద్య, ఆరోగ్య, విద్యా సేవలకు పెట్టుబడులు పెంచాల్సి ఉందని సర్వేలో తెలిపారు. విజ్ఞాన ప్రాతిపదిక ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే ఆయా రంగాలకు పెట్టుబడుల పెంపు అవసరం అని సూచించారు. దేశ సామాజిక విధానాలు సంక్షేమ దిశలోనే ఉన్నాయని అయితే ఇప్పటికీ సామాజిక, ఆర్థిక అసమానతలను అధిగమించాల్సి ఉందని స్పష్టం చేశారు. అణగారిన వర్గాలు, మహిళలు, సమాజంలోని ఇతర వెనుకబడిన వర్గాల వారికి తగు విధంగా పరిపుష్టిని కల్పించాల్సి ఉందని , ఈ క్రమంలో చర్యలు తీసుకోవాలని సూచించారు. రెండంకెల జిడిపి వృద్ధిరేటును చేరుకున్న విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ తగు విధంగా అన్ని లక్షణాలను సంతరించుకోవల్సి ఉందని, ఇందుకు కీలకమైనది విద్యా, వైద్య రంగాలకు ఎక్కువ కేటాయింపులు జరపడం అని తెలిపారు.

Comments

comments