Search
Sunday 25 February 2018
  • :
  • :

క్లీన్‌స్వీపే లక్ష్యం

సమరోత్సాహంతో కోహ్లి సేన

పరువు కోసం లంక

నేటి నుంచి చివరి టెస్టు

INDIA

పల్లెకెలె: శ్రీలంకతో శనివారం ప్రారంభమయ్యే చివరి టెస్టుకు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనే పట్టుదలతో విరాట్ సేన ఉంది. 85 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ ఎప్పుడూ మూ డు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయలేదు. అయితే ఈసారి భారత్‌కు ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. పూర్తి సామర్థం మేరకు ఆడితే ఈ రికార్డును అందుకోవడం భారత్‌కు కష్టమేమి కాదని చెప్పవచ్చు. ఇదిలావుండగా ఆతిథ్య శ్రీలంక జట్టుకు ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయిన లంక కనీ సం చివరి టెస్టులోనైనా గెలిచి కాస్తయిన పరువు దక్కించుకోవాలనే లక్షంతో ఉంది. అయితే టీమిండియాను ఓడించడం లంకకు అంత సులువేమి కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అసాధారణ ఆటను కనబరిస్తే తప్ప ప్రస్తుతం కోహ్లి సేన జోరును ఆపడం లంకకు కష్టమేనని వారంటున్నారు. కాగా, రెండు జట్లు కూడా విజయమే లక్షంగా పెట్టుకోవడంతో పోరు హో రాహోరీగా సాగడం ఖాయం. కాగా, తొలి టెస్టును 304 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా రెండో టెస్టులో ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు భారత్ ఈ మ్యాచ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ రవీం ద్ర జడేజా లేకుండానే బరిలోకి దిగనుంది. లంక కూడా తమ కీలక బౌలర్ రంగనా హెరాత్ లేకుండానే పోరుకు సిద్ధమైంది.
బ్యాటింగే బలం..
మరోవైపు టీమిండియా ఈ మ్యాచ్‌లో కూడా బ్యాటింగ్‌పైనే నమ్మకం పెట్టుకుంది. తొలి రెండు మ్యాచుల్లో భారీ స్కోర్లు సాధించి మ్యాచ్‌పై పట్టు సాధించింది. చివరి టెస్టులో కూడా భారీ స్కోరుతో ప్రత్యర్థిని ఆత్మరక్షణలో పడేయాలనే లక్షంతో భారత్ ఉంది. ఓపెనర్లతో సహా చివరి వరుస బ్యాట్స్‌మన్ వరకు అద్భుత ఫాంలో ఉండడం టీమిండియాకు కలిసివచ్చే అంశం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాట్స్‌మెన్ కోహ్లికి అందుబాటులో ఉన్నారు. ఓపెనర్లు శిఖర్ ధావన్, కెఎల్.రాహుల్‌లు ఈ మ్యాచ్‌లో కూడా శుభారంభం అందించాలనే పట్టుదలతో కనిప్తిన్నారు. తొలి మ్యాచ్‌లో ధావన్ కళ్లు చెదిరే సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కూడా ధావన్ భారీ స్కోరుపై కన్నేశాడు. ఇక, రాహుల్ కూడా ఇదే ఉద్దేశంతో కనిపిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించడం ద్వారా జట్టులో స్థానాన్ని శాశ్వతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక, వన్‌డౌన్‌లో వస్తున్న చతేశ్వర్ పుజారాకు ఎదురేలేదు. తొలి రెండు మ్యాచుల్లో కూడా పుజారా కదం తొక్కాడు. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించేందుకు తహతహలాడుతున్నాడు. లంక బౌలర్లపై ఎదురు దాడి చేస్తూ జట్టుకు అండగా నిలుస్తున్నాడు. చివరి టెస్టులోనూ కోహ్లి పుజారాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. అతను చెలరేగితే ఈసారి కూడా టీమిండియా రికార్డు స్కోరును సాధించడం ఖాయం. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా భారీ ఇన్నింగ్స్ కోసం సిద్ధమయ్యాడు. ఈ మ్యాచ్‌లో రాణించడం ద్వారా వన్డే సిరీస్‌కు మరింత ఉత్సాహంతో సిద్ధం కావాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే ఓ సెంచరీ సాధించిన కోహ్లి మరో పెద్ద ఇన్నింగ్స్ కోసం పరితపిస్తున్నాడు. అజింక్య రహానె కూడా ఇదే ఉద్దేశంతో కనిపిస్తున్నాడు. రెండో టెస్టులో రహానె అద్భుత సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. నిలకడైన ఆటకు పెట్టింది పేరుగా చెప్పుకునే రహానె ఈ మ్యాచ్‌లో కూడా జట్టుకు కీలకంగా మారాడు. ఎటువంటి బౌ లింగ్ లైనప్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా రహానె సొంతం. కొంతకాలంగా అతను నిలకడైన ఆట తో ఆకట్టుకుంటున్నాడు. ఈసారి కూడా భారీ ఇన్నింగ్స్ కోసం సిద్ధమయ్యాడు. అతను కూడా విజృంభిస్తే ఈ మ్యాచ్‌లో కూడా లం క బౌలర్లకు కష్టాలు తప్పక పోవచ్చు. ఇక, రవిచంద్రన్ అశ్విన్, వృద్ధిమాన్ సాహా, హార్ధిక్ పాండ్యా, మహ్మద్ షమిలతో భా రత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది.
కుల్దీప్‌కు ఛాన్స్!
రవీంద్ర జడేజా మ్యాచ్‌కు దూరం కావడంతో అతనికి బదులు యువ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో కుల్దీప్ ఉన్నాడు. కిందటిసారి ఆస్ట్రేలియాతో ధర్మశాల వేదికగా జరిగిన టెస్టులో కుల్దీప్ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా మెరుగైన ఆటను కనబరచాలనే ఉద్దేశంతో కనిపిస్తున్నాడు. జడేజా అందుబాటులో లేక పోవడంతో జట్టు బౌలింగ్ భారమంతా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌పై పడనుంది. అశ్విన్ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించేందుకు సిద్ధమయ్యాడు. ఇక, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్, హార్ధిక్ పాండ్యాలతో ఫాస్ట్ బౌలింగ్ విభాగం బలంగా ఉంది. వీరంతా సమష్టిగా రాణిస్తే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం భారత్‌కు కష్టమేమి కాదు.
లంకకు సవాలు!
ఇక, ఆతిథ్య శ్రీలంక జట్టుకు చివరి టెస్టు మ్యాచ్ సవాలుగా మారింది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన లంక జట్టు చివరి మ్యాచ్‌లో మెరుగైన ఆటతో కాస్తయిన పరువును దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఉంది. అయితే సీనియర్ ఆటగాడు రంగనా హెరాత్ దూరం కావడం లంకకు పెద్ద ఎదురు దెబ్బగా చెప్పవచ్చు. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన హెరాత్ లేని లోటును పూడ్చడం అంత సులువుకాదు. నువాన్ ప్రదీప్ కూడా మూడో టెస్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. ఇది కూడా లంకను కలవర పరిచే అంశమే. అయితే సంచలనాలకు పెట్టింది పేరుగా చెప్పుకునే లంకను తక్కువ అంచనా వేయలేం. ఉపుల్ తరంగ, కుశాల్ మెండిస్, కరుణరత్నె, చండీమల్, తిరిమన్నే, డిక్వెల్లా తదితరులతో లంక బ్యాటింగ్ బలంగానే ఉంది. అయితే అనుభవలేమి ఒక్కటే జట్టుకు ప్రతికూలంగా మారింది. రెండో టెస్టులో కరుణరత్నె, డిక్వెల్లా, కుశాల్ మెండిస్ అసాధారణ పోరాట పటిమను కనబరిచినా విషయం తెలిసిందే. ఈసారి కూడా జట్టు వీరి నుంచి మెరుగైన ఆటను ఆశిస్తోంది. చివరి మ్యాచ్‌లో భారత్‌కు గట్టి పోటీ ఇవ్వడం ద్వారా వన్డే సిరీస్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలనే ఉద్దేశంతో శ్రీలంక ఉంది. అయితే దీనిలో ఎంత వరకు సఫలం అవుతుందో వేచి చూడక తప్పదు.

Comments

comments