Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

యువ మానవ వనరులే ముప్పుగా మారేనా?!

Girls

నేడు అంతర్జాతీయ యువజన దినోత్సవం: అంతర్జాతీయ యువజన దినోత్సవం ఆగస్ట్ 12, 2000 సంవత్సరం నుంచి జరుపుతున్నారు. యువతకు సంబం ధించిన సాంస్కృతిక, న్యాయ  విషయాల్లో అవగాహన కల్పి స్తూ ప్రభుత్వం చొరవ తీసుకునేలా చేయడమే ఈ దినోత్సవం ముఖ్యోద్దేశ్యం. స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తులను కలుపుకుని వర్క్‌షాప్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, మీటింగులు ఏర్పాటుచేయడంలో యువజన సంఘాలు ప్రపంచవ్యాప్తంగా పనిచేయడం తద్వారా వారిలో యువతకు సంబంధించిన అంశాల పట్ల అవగాహన ఏర్పడాలన్నది లక్షం. ఇంటర్నేషనల్ యూత్ డే-2017 థీమ్ యూత్ బిల్డింగ్ పీస్  వైరుధ్యాలు రూపుమాపడంలో, సామాజిక న్యాయం, స్థిరమైన శాంతి కోసం ప్రయత్నించే యువతను గుర్తించడం ఈ దినోత్సవం ప్రత్యేకత.

వార్తా పత్రికల్లో ప్రతి రోజూ వచ్చే(20 వ శతాబ్దం తొలి దశలో) సక్సెస్ స్టోరీస్, నూతన ఆవిష్కరణల గురించి చదివిన యువత స్ఫూర్తి పొందింది. ఆ స్ఫూర్తి సమాజ పురోగతికి ఉపయోగపడింది. కాని నేడు ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యువత కలిగిఉన్న మన దేశంలో, వారికి సంబంధించిన అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. బుజ్జగిస్తే వినే వయసు కాదు అలాగని బాధ్యతలను భుజాన వేసుకునే వయసు అంతకంటే కాదన్న స్థితిలో నేటి యువత ఉన్నది. విద్యలో నాణ్యతాలోపం, విపరీతంగా పెరిగిన ఫీజులు వాటిని భరించే ఆర్థిక స్థోమతలేని కుటుంబాలు, గ్రామీణుల్లో అవగాహనా లోపం, వారి ప్రఙ్ఞకు సరిపడ అవకాశాలు రాకపోవడం, భవిష్యత్తులో ఏం కావాలో నిర్థారించుకోకుండా పోటీ పరీక్షలకు సిద్ధపడటం, గ్రామీణ యువతలో కమ్యూనికేషన్ స్కిల్స్ లోపించడం, ఎండమావుల్లాంటి అవకాశాలకోసం రాజకీయ పార్టీలవైపు ఆకర్షితమవడం(రాజకీయ నిరుద్యోగం) వంటివి నేటి యువత ఎదుర్కొంటున్న సవాళ్లు. వీటిని ఎదుర్కొనే మానసిక స్థైర్యం లోపించడంతో యువత డ్రగ్స్, మద్యం, స్మోకింగ్ లాంటి చెడు మార్గాలను ఎంచుకొని చివరకు ప్రాణాలను పణంగా పెడుతోంది. ఇటువంటి పరిస్థితులు మారాలంటే మార్పు రావాల్సింది యువతలోనా, సమాజంలోనా, విద్యావ్యవస్థలోనా అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగానే మిగులుతోంది. యువతను ప్రభావితం చేస్తున్న కొన్ని అంశాలీవిధంగా ఉన్నాయి…

రాజకీయాల ప్రభావం: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యువత రాజకీయాలవైపు త్వరగా ఆకర్షితమవుతున్నారు. రాజకీయ నాయకుల ఆదేశాలకనుగుణంగా నడుస్తూ, రాజకీయ స్వార్థానికి బలవుతున్నారు. నాయకుల ‘విభజించి పాలించే’ సంస్కృతికి యువతను పావులుగా వాడుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. జాతి, మత, కుల, భాషలపరంగా యువతను విడదీసే ప్రయత్నం రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. ఈ రకమైన క్రీడలో బలమైన వర్గంగా ఉన్న యువత నలిగి బలహీనమవుతోంది.

ఒత్తిడి, బాధ్యతలు: సామాజిక, ఆర్థిక పరమైన అంశాలే కాకుండా మానసిక స్థితిని కూడా ప్రభావితం చేసే అంశాలు నేటి యువతను నిర్వీర్యం చేస్తు న్నాయి. ఒంటరితనం, బయటకు రాలేని బంధాల్లో ఇరుక్కుపోవడం, ప్రేమ పేరుతో వంచన, బెదిరింపులు వంటివి వారిని డ్రగ్స్, మద్యం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేలా ఉసిగొల్పుతున్నాయి. పెరిగిన పని ఒత్తిడి, తోటివారి ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు లాంటివి వారిని ఆత్మహత్యలవైపు ప్రేరేపిస్తున్నాయి. సరైన ఆదరణ, సమయానుకూల కౌన్సెలింగ్ యువతలో స్థైర్యాన్ని నింపి శక్తివంతులుగా చేస్తాయి. ఈ రకమైన ప్రతికూల పరిస్థితుల ప్రభావం యువతమీద పడకుండా ఉండడానికి ప్రభుత్వాలు కూడా పాటుపడాలి. అప్పుడే యువ భారత్ దేశాన్ని నడిపే శక్తిగా ఎదుగుతుంది.

విద్యావ్యవస్థలో మార్పు రావాలి: ప్రతి విద్యాసంస్థలో మంచి, చెడు అనే విభాగాలుంటాయి. అయితే 60 మంది ఉన్న క్లాస్‌రూంలో పది శాతం మంది చెడువారున్నా, వారి ప్రభావం మిగతా 50% మంది మీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉంటుంది. అయితే ఏ తల్లిదండ్రి డ్రగ్స్, లిక్కర్ తీసుకోమనో, స్మోకింగ్ చేయమనో చెప్పరు. ఎవరికి వారే వారి భవిష్యత్తును నిర్మించుకోవాలి. మొదట ఒక గోల్ నిర్ణయించుకుంటే దానిప్రకారం పనిచేస్తూ వెళ్లవచ్చు, దురదృష్టవశాత్తు చాలామంది యువత వారేం చేయాలో నిర్ణయించుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతూంటారు, ఇదే వారిని ఇతరత్రా వ్యాపకాలవైపు మళ్లిస్తుంది. యువతను మానసికంగా శక్తివంతంగా తయారుచేసే విద్యావ్యవస్థ ఏర్పడాలి. – ఆకాంక్ష జాజు, ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్, గీతం యునివర్సిటీ.

విదేశీ వలసలు ఆగాలి: ప్రాథమిక విద్యలో మార్పు చాలా వచ్చినా, యునివర్సిటీ స్థాయిలో విద్యాప్రమాణాలు పడిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా ఉద్యోగావకాశాలు తక్కువగానే ఉన్నాయి. మేం డిగ్రీ తీసుకుని బయటకు వచ్చే సమయంలో మన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగావకాశాలుంటాయని భావిస్తున్నాం. దేశం బాగుపడాలనే భావనకంటే వ్యక్తిగా బాగుండాలనే భావన పెరిగిపోయింది, దానికి తోడు ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. దాంతో డిగ్రీ తీసుకున్న ప్రతి విద్యార్థి విదేశాలకు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నాడు, ఇది దేశాభివృద్ధికి ఆటంకమే. ఉద్యోగావకాశాలు లేక యువత నిరాశా నిస్పృహలకు లోనై అసాంఘిక కార్యకలాపాలవైపు మళ్లుతున్నది. ప్రభుత్వం దీనిపై దృష్టిపెట్టాలి. – రసఙ్ఞ రంగ, ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్, స్టాన్లీ కాలేజీ.

Comments

comments