Search
Wednesday 21 February 2018
  • :
  • :
Latest News

కొత్త కాన్సెప్ట్ సినిమాలు చేయాలకుంటా

‘బాహుబలి’లో భల్లాలదేవగా తన అద్భుతమైన నటనతో దేశ, విదేశాల్లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు రానా దగ్గుబాటి. ‘లీడర్’ సినిమాతో హీరోగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన కృష్ణం వందే జగద్గురుమ్, ఘాజీ వంటి డిఫరెంట్ చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశారు. ఇప్పుడు తేజ దర్శకత్వంలో రానా నటించిన డిఫరెంట్ ఎంటర్‌టైనర్ ‘నేనే రాజు నేనే మంత్రి’. డా. డి.రామానాయుడు సమర్పణలో బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.సురేష్‌బాబు, కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.  ఈ చిత్రం శుక్రవారం విడుదలకాబోతున్న సందర్భంగా రానాతో జరిపిన ఇంటర్వూ విశేషాలు…

Rana

ఈ ఏడాది మూడు సినిమాలు
ఈ ఏడాది ఇప్పటికే నేను చేసిన బాహుబలి-2, ఘాజీ చిత్రాలు విడుదలయ్యాయి. ఇప్పుడు నా మూడవ చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవన్నీ డిఫరెంట్ జోనర్ సినిమాలు. బాహుబలి-2 బిగ్గెస్ట్ హిట్ అయి తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. ఘాజీ కూడా సూపర్ హిట్ అయి విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఇక ‘నేనే రాజు నేనే మంత్రి’ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్.
పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో
దర్శకుడు తేజ ఈ కథ చెప్పగానే వెంటనే నేను, మా నాన్న ఓకే చేశాం. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగే జోగేంద్ర, రాధ లవ్ స్టోరీ ఈ చిత్రం. మాస్ డైలాగ్స్, యాక్షన్, ఎమోషన్ సీన్స్ అన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. రియలిస్టిక్‌గా సాగే ఫుల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది.
ఓ కొత్త జోనర్‌లో
సినిమాలో నేను రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న జోగేంద్ర క్యారెక్టర్‌లో నటించాను. తొలిసారి ఓ కొత్త జోనర్‌ను టచ్ చేశాను. అందరికీ నచ్చుతుందనే ఈ సినిమా చేశాను.
ముగ్గురికి కథ నచ్చింది
తొలిసారి మా సురేష్ ప్రొడక్షన్‌లో ఈ సినిమా చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఎప్పటినుండో మా బ్యానర్‌లో సినిమా చేద్దామని అనుకుంటున్నాను. కానీ కుదరలేదు. చివరికి ఇప్పటికి ఈ సినిమాతో కుదిరింది. ఇక నా సినిమాలన్నీ రెగ్యులర్‌గా కాకుండా కొంచెం రొటీన్‌కు భిన్నంగా ఉంటాయి. నాన్న పెద్ద స్టార్ ప్రొడ్యూసర్.
మా చిన్నాన్న బిగ్ యాక్టర్. ఇద్దరూ మా బ్యానర్‌లో ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలు చేశారు. అయితే మొదటిసారి మా నాన్నకు, చిన్నాన్న వెంకటేష్‌కు, నాకు కథ నచ్చింది. తేజతో కూర్చొని చర్చించి ఈ సినిమాను వెంటనే ప్రారంభించేశాం.
చిన్న అంశంగానే పాలిటిక్స్
కెరీర్ ప్రారంభంలో చేసిన ‘లీడర్’ పూర్తిగా పొలిటికల్ సినిమా. కానీ ఈ సినిమాలో పాలిటిక్స్ అనేది చిన్న అంశం మాత్రమే. భర్త, భార్య మధ్య జరిగే కథ ఇది. అనంతపురం, కారైకుడి ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారం చేసే వ్యక్తి జోగేంద్ర. అలాంటి వ్యక్తికి కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. అవేమిటనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్రధాన కారణం అదే
దర్శకుడు తేజతో పనిచేయడం మరచిపోలేని అనుభవాన్నిచ్చింది. ఈ చిత్రంలో ఆయన రాజకీయాలను చాలా అద్భుతంగా చూపించారు. ఈ కథ నాకు నచ్చడానికి ప్రధాన కారణం కూడా అదే. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల గురించి వివరంగా ఈ చిత్రంలో చూపించారు.
తమిళ్‌లో మార్పులు చేశాం
ఈ సినిమా చూశాక తమిళ రాజకీయాలకు ఇది బాగా కనెక్ట్ అవుతుందని అనిపించింది. నేను పొలిటికల్ సినిమా చేసినప్పుడు ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతూనే ఉంది. ఈ సినిమాను తమిళ్‌లో చాలా మార్పులు చేసి చేశాం.
నా క్యారెక్టర్‌లో ఎక్కువ వేరియేషన్స్
‘నేనే రాజు నేనే మంత్రి’ కోసం ఫిజికల్‌గా చాలా కష్టపడ్డాను. ఆరు, ఏడు సంవత్సరాల్లో జరిగే కథ ఇది. నా క్యారెక్టర్‌ను తేజ అద్భుతంగా డిజైన్ చేశారు. వడ్డీ వ్యాపారి ఎలా ఉంటాడో అలాగే నా శరీరాన్ని మలుచుకున్నాను. అలాగే ఒక సాధారణ వ్యక్తి దురహంకారిగా మారితే ఎలా ఉంటాడో ఆవిధంగా నా క్యారెక్టర్ మారుతుంది. సినిమాలో మార్పులనేవి చాలా సెటిల్డ్‌గా ఉంటాయి.
ఫిట్‌నెస్ విషయంలో శ్రద్ధ
నా క్యారెక్టర్‌లో ఎక్కువ వేరియేషన్స్ ఉంటాయి. ఇక నా జిమ్ ట్రైనర్ కునాల్ నాతో ఏడు సంవత్సరాలుగా ప్రయాణిస్తున్నాడు. నా శరీరాన్ని క్యారెక్టర్‌కు అనుగుణంగా అద్భుతంగా మలుస్తాడు. ఈ సినిమా కోసం ఫిట్‌నెస్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకున్నాను.
లక్కీగా అన్నీ మంచి సబ్జెక్ట్
నాకు సినిమాలు అంటే ఇష్టం. యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టం. మా కుటుంబమంతా సినిమా ఇండస్ట్రీలోనే ఉంది. లక్కీగా నాకు అన్నీ మంచి సబ్జెక్ట్ వస్తున్నాయి.ఏదైనా కొత్తగా చేయాలనే తాపత్రయం నాలో ఉంది. కొత్త ఆలోచనలతో వస్తున్న దర్శకులను ప్రోత్సహించాలి. అప్పుడే మంచి సినిమాలు బయటకు వస్తాయి.
పూర్తి సంతృప్తినిచ్చాయి
కొత్త కాన్సెప్ట్ సినిమాలు చేయాలని నేను కోరుకుంటాను. సినిమా చేసే ప్రతిసారి ఆ క్యారెక్టర్ ద్వారా నేను ఏం నేర్చుకోవచ్చు అని ఆలోచిస్తాను. ప్రతిసారి చేసిన సినిమానే చేస్తే ప్రేక్షకులు, నాకు బోర్ కొడుతుంది. ఏడు సంవత్సరాల్లో నేను చేసిన అన్ని సినిమాలు నాకు పూర్తి సంతృప్తినిచ్చాయి.
నాకు ఎలాంటి భయం లేదు
ఖచ్చితంగా ‘నేనే రాజు నేనే మంత్రి’ వంటి సినిమా అయితే ఎవరూ తీయరు. కాబట్టి నాకు ఎలాంటి భయం లేదు. శుక్రవారం వస్తున్న మూడు సినిమాలు భిన్నమైన జోనర్స్‌కు చెందినవి. కాబట్టి అన్నీ బాగా ఆడుతాయి. పైగా లాంగ్ వీకెండ్ కూడా ఉంది. కాబట్టి వసూళ్లు కూడా బాగుంటాయి.

Comments

comments