Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

దురాశకు పోయి నగరాన్ని పాడు చేయొద్దు

KTR

బిల్డర్లకు కెటిఆర్ హెచ్చరిక, నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టీకరణ

హైదరాబాద్: బిల్డర్లు దురాశకు పోయి హైదరాబాద్ నగరాన్ని పాడు చేయకూడదని, నిబంధనలను పాటించాలని మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు సూచించారు. తమకు తాముగా స్వియనియంత్రణ చేసుకోవాలని, నిబంధనలు అతిక్రమించిన నిర్మాణాలపై చర్యలకు పూనుకుంటే ప్రభుత్వాన్ని తప్పుపట్టొద్దని హెచ్చరించారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కొందరు బిల్డర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు దురాశతో నిబంధనలకు పాతరపెట్టి మరీ నిర్మాణాలను కొనసాగిస్తున్నారన్నారు. సమగ్ర ప్రణాళికలతో హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని పంచాయతీల కాలపరిమితి పూర్తి కాగానే జిహెచ్‌ఎంసిలో విలీనం చేస్తామని వెల్లడించారు. భూ రికార్డులను త్వరలోనే ప్రక్షాళన చేస్తామన్నారు.

హైదరాబాద్‌లో శుక్రవారం “ తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ 3వ వార్షికోత్సవ కార్యక్రమానికి మంత్రి కెటిఆర్ ముఖ్యఅతిథిగాహాజరై మాట్లాడుతూ కొన్ని ప్రాంతాల్లో బిల్డర్లు మినహాయింపులను కోరితే పరిశీలిస్తామని, అంతే కాని నిబంధనలను మాత్రం తుంగలో తొక్కితే చర్యలు తప్పవన్నారు.వచ్చే ఆగస్టు వరకు లక్ష డబుల్ బెడ్‌రూములను నిర్మించాలనే లక్షంతో పనిచేస్తున్నామన్నారు. ప్రభుత్వంలో ఘననీయమైన అనినీతి తగ్గిందన్నారు. ఈ ఏడాది నవంబర్ చివరి నాటికి హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశలో భాగంగా నాగోల్ నుంచి మియాపూర్ లైన్‌ను ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. హైదరాబాద్‌లో 290 కిలోమీటర్ల వరకు వైట్‌ట్యాపింగ్ రహదారుల ఏర్పాటు ప్రక్రియను 12 మాసాల్లో పూర్తి చేస్తామని, వర్షకాలం పూర్తి కాగానే పనులను మొదలు పెడుతామన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుందని విషప్రచారం చేశారని, సిఎం కెసిఆర్ మూడేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టారని, ఇతర రాష్ట్రాలకు తెలంగాణ పాఠాలు నేర్పిస్తుందన్నారు. డిపిఎంఎస్ తరహాలో బిల్డర్లకు అన్ని అనుమతులతో సింగిల్ విండో విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్ని స్తున్నామన్నారు. రూ.1600 కోట్లతో 33 కిలోమీటర్ల వరకు మూసీ సుందరీకరణ పనులను ప్రారంభించబోతున్నామన్నారు. బిల్డర్ల పరిస్థితులు ఎలా ఉన్నాయో తమ రాజకీయ పరిస్థితులు అలాగే ఉన్నాయని, “ఉప్పర్ షేర్వానీ, అందర్ పరేషానీ” అన్నచందంగా ఉన్నయని ఆయన వ్యాఖ్యానించారు.

మళ్లీ మాదే అధికారం
ఎనిమిదేండ్లలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని, ఇది టిఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో కూడా అధికారం మనదేనని(టిఆర్‌ఎస్) మంత్రి తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోనికి రాలేమనే విషయం ప్రతిపక్షాలకూ తెలుసన్నారు. ఎనిమిదేండ్లలో హైదరాబాద్ నగరాన్ని అంత ర్జాతీయ ప్రమాణాలతో అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. రాత్రికి రాత్రి విశ్వనగరాలు తయారుకావని, విశ్వనగరం ఇదే నా అంటూ ప్రతిపక్షాలు వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని, వారి హయాంలో ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో మేయర్ బొంతురామ్మోహన్, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి సోమేష్‌కుమార్, జిహెచ్‌ఎంసి కమిషనర్ బి.జనార్దన్ రెడ్డి, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు సి.ప్రభాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి జె. వెంకట్ రెడ్డితో పాటు వివిధ జిల్లాల నుంచి బిల్డర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

comments