Search
Tuesday 17 October 2017
  • :
  • :
Latest News

సహారాకు ఎదురుదెబ్బ

 ఆంబీ వ్యాలీపై పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

Sahara

న్యూఢిల్లీ: ఆంబీ వ్యాలీ వేలాన్ని ఆపాలంటూ పిటిషన్ దాఖలు చేసిన సహారా గ్రూప్‌నకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వేలాన్ని నిలుపుదల చేసేందుకు కోర్టు తిరస్కరించింది. మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఉన్న సహారా సంస్థకు చెందిన ఆంబీ వ్యాలీని వేలం వేయాలంటూ ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలు చేసిన విషయం తెలిసిందే. ఇన్వెస్టర్ల నుంచి నిధులు సేకరించి తిరిగి చెల్లించడంలో విఫలమైన కేసులో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ వద్ద సహారా సంస్థ రూ.1500 కోట్లు డిపాజిట్ చేయాల్సి ఉంది. గడువులోగా డిపాజిట్ చేయకపోవడంతో కోర్టు ఆంబీ వ్యాలీ వేలం ప్రక్రియ ప్రారంభించాలని ఇటీవల ఆదేశించింది. దీనిని ఆపాలంటూ బుధవారంనాడు సహారా సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సెబీకి నిధులను అందించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడినందువల్ల ఆంబీ వ్యాలీ వేలం ఆపాలని సహారా సంస్థ కోర్టును కోరింది. అయితే గురువారం ఈ పిటిషన్‌ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం సహారా అభ్యర్థనను తోసిపుచ్చింది. 8900 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆంబీ వ్యాలీ ఆస్తి విలువ రూ.34వేల కోట్లు ఉంటుందని అంచనా. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే తొలుత ఆంబీ వ్యాలీ ప్రాజెక్టును అమ్మాలని కోర్టు ఆదేశించింది. గతనెల జూలై 25న జరిగిన విచారణలో వేలం ప్రక్రియను సహారా తరఫు న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించారు. బ్యాలెన్స్ రూ.9000 కోట్లను చెల్లించడానికి 18 నెలల సమయం కోరారు. ఇన్వెస్టర్లకు రూ.24వేల కోట్లు చెల్లించడంలో సహారా గ్రూప్‌కు చెందిన సంస్థలు విఫలమైన కేసులో 2014 మార్చిలో సహారా గ్రూప్ అధినేత సుబ్రతారాయ్ అరెస్టు అయ్యారు. గతేడాది మే నెలలో రాయ్ తల్లి మరణించడంతో ఆయన పెరోల్‌పై బయటికి వచ్చారు. అనంతరం పెరోల్ గడువును ఇప్పటివరకు పొడిగిస్తూ వస్తున్నారు.

Comments

comments