Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

డాక్టర్స్ డాగ్

Smoky-Dog

డాగ్ సైకాలజీ: ఏప్రిల్ 16, 2013 ఉదయం మైక్ హర్లీ చిట్టి పొట్టి అడుగులు వేసే డెక్స్టర్ తో బోస్టన్ మెడికల్ సెంటర్ సర్జికల్ వార్డ్ లోకి ప్రవేశించాడు. ‘డెక్స్టర్ తో ఎవరన్నా కొంత సేపు ఆడుకుంటారా?‘ అనే హర్లీ  ప్రశ్నకు మొదట ఎవరూ స్పందించలేదు. వాతావరణం అంతా గందరగోళంగా ఉంద్రిక్తతతో ఉంది. ముందు రోజు అమెరికాలో బోస్టన్ నగరం నడి బొడ్డున మారథాన్ (50 km పరుగు పందెం) జరుగుతుండగా బాంబు పేలుడు సంభవించింది. ఆ సంఘటనలో ముగ్గురు మరణించగా, 264 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారందరిని సమీపంలో ఉన్న 27 హాస్పిటల్స్‌కు తరలించారు. వారిలో కొందరు డెక్స్టర్ వచ్చిన రోజు బోస్టన్  మెడికల్ సెంటర్‌లో శస్త్ర చికిత్సకు సిద్ధంగా  ఉన్నారు. చాల మంది కాళ్ళు పోగొట్టుకున్నారు. హర్లీ హాస్పిటల్ లో వైద్య పరికరాలు బాగు చేసే ఒక సాధారణ ఉద్యోగి. డెక్స్టర్ ఒక 9 ఏళ్ళ బాక్సర్ జాతికి చెందిన కుక్క. పేషెంట్స్ ఎవరూ  స్పందించకపోయేసరికి నిరాశపడ్డాడు. మధ్యాన్నం సమయంలో మళ్ళీ డెక్స్టర్‌ని తీసుకుని సర్జికల్ వార్డ్‌లో తిరగడం మొదలుపెట్టాడు.

ఈసారి ఒక మహిళ డెక్స్టర్ దగ్గరకి వచ్చి పలరించి కొంత సేపు ఆడుకుంది. అదే రోజు మూడోసారి డెక్స్టర్ తిరిగి వచ్చినప్పుడు పేషెంట్స్‌తో పాటు వారితో ఉన్న కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు తినే ఆహరంలో కొంత డెక్స్టర్ కోసం పక్కకి పెట్టారు. మరుసటి రోజు డెక్స్టర్ వార్డ్ లోకి వచ్చి మంచం మీద సర్జరీ కి సిద్ధంగా ఉన్న ఒకావిడ దగ్గరకు వెళ్లి పలకరించాడు. వెంటనే ఆ మహిళ ఎక్కడ లేని ఉత్సాహంతో లేచి కూర్చుని డెక్స్టర్‌ని నిమురుతూ చాలా సంతోషించింది. డెక్స్టర్ వాళ్ళతో ఉన్న ఆ కొద్ది నిముషాలలో ఒక్క సారి కూడా వాళ్ళ గాయాల గురించి గాని, బాంబింగ్ గురించి గాని మాట్లాడలేదు. నవ్వుకుంటూ డెక్స్టర్ ప్రేమను ఆస్వాదిస్తూ మాట్లాడుకున్నారు. వారిలో ఉన్న దిగులు, నిరుత్సాహం పోయి తిరిగి కోలుకోగలరని నమ్మకం కలిగింది. బాగా స్ట్రెస్‌తో పని చేస్తూ రాత్రి పగలు నిర్విరామంగా పేషెంట్స్‌ని చూసుకునే హాస్పిటల్ స్టాఫ్ కూడా డెక్స్టర్‌ని చూసి పరవశించిపోయారు. వారం తిరిగే లోపు డెక్స్టర్ బోస్టన్ మెడికల్ సెంటర్లో అందరికీ మనస్థాపం నుంచి విముక్తి కలిగించే తావీజు లా కనిపించాడు. డెక్స్టర్ ని హర్లీ కుక్కలా కాకుండా కొడుకులా భావించారు.

ఆరోజు మొద లు ప్రతి బుధవారం డెక్స్టర్ వార్డ్‌లో తిరుగుతూ పేషెంట్స్ దగ్గరకి వెళ్లి తలతో వాళ్ళను కొద్దిగా నెట్టి నిమరమని సైగలు చేసేవాడు.  తన ప్రేమతో వందల కొద్దీ పేషెంట్స్ మూడ్‌ని మార్చేసేవాడు. మంత్రాలు, మూలికలు, తాయత్తులతో  జబ్బులు నయం చేసే స్వాములు ఉన్నారో లేదో తెలీదు గాని శారీరక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడానికి మాత్రం డెక్స్టర్ లాంటి కుక్కలు ఉన్నాయి. అవే థెరపీ డాగ్స్. పేలుడు జరిగే వారం రోజుల క్రితం హాస్పిటల్ సిబ్బంది  ఒక ప్రయోగాన్ని ప్రతిపాదించింది. హాస్పిటల్ లో గాయాలతో, రోగాలతో బాధ పడే వారికి కుక్కల ద్వారా ఊరడింపు కలిగించడానికి చేసిన ఈ ప్రయత్నం పేరు ‘హీలింగ్ పాస్‘ ప్రోగ్రాం. హాస్పిటల్ సిబ్బందిలో ఎవరికన్నా కుక్కలు ఉం వాళ్ళని పేషెంట్స్ వద్దకు తీసుకురమ్మని అందరికీ ఈ-మెయిల్ పంపించారు. అది చుసిన హర్లీ తన కుక్క డెక్స్టర్‌ని తీసుకువచ్చాడు. మూడు రోజుల తరువాత ‘లూథర్‘,‘రూథీ‘ అనే గోల్డెన్ రిట్రీవర్ జాతి కుక్కలతో పాటు మొత్తంగా 67 కుక్కలు ‘లూథరన్ చర్చి చారిటీస్‘ వారి ద్వారా బోస్టన్ నగరానికి తరలింపబడ్డాయి. లూథర్, రూథీ లను పేలుడు జరిగిన సమీపం లో ఉన్న లూథరన్ చర్చి వద్ద ఉంచారు. గాయపడిన వారే కాకుండా ఆ సంఘటన వలన భయంతో మనసు చెదిరిన వారు ఎవరైనా ఆ కుక్కలతో కొంత సేపు గడిపి వాటిని నిమురుతూ బాధను పంచుకోవచ్చు.

ఈ కార్యక్రమంలో పాపులర్ ఐన కొన్ని కుక్కలకు ఫేస్ బుక్ అకౌంట్లు కూడా ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాలు ఒక్క పేషెంట్స్‌కే కాదు. ఎం.ఐ.టి, హార్వర్డ్ లాంటి  విశ్వ విఖ్యాతి చెందిన యూనివర్సిటీలలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. నెలలో ప్రతి మొదటి శుక్రవారం ‘డాగ్ బోన్స్‘ అనే సంస్థ కుక్కలను ఎం.ఐ.టిలో ఉన్న లైబ్రరీ వద్దకు తీసుకువస్తుంది. చదువుల వల్ల బాగా స్ట్రెస్‌కు గురైన విద్యార్థులు ఈ కుక్కల దగ్గరకు వచ్చి కొంత సేపు ముద్దు చెయ్యచ్చు. ఫైనల్ పరీక్షల సమయంలో చదువుల ఒత్తిడి  నుంచి ఉపశమనం కోసం ఎం.ఐ.టి యాజమాన్యం విద్యార్థులను ఈ థెరపీ కుక్కలతో కొంత సేపు గడపమని ప్రోత్సహిస్తుంది. దీని వలన చాల మంది విద్యార్థులు మేలు పొందారు. హార్వర్డ్ యూనివర్సిటీలో కూడా ప్రతి మంగళవారం ఇలాంటి కార్యక్రమం ఉంది. యార్క్ షైర్ టెరియర్ జాతి కి చెందిన స్మోకీ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో  ఆస్ట్రేలియాకు ఉత్తరం లో ఉన్న న్యూ గినియా ద్వీపం లో ఒక సైనికుడికి చిన్న గుంటలో దొరికింది. ఆ సైనికుడు బిల్ విన్ అనే అమెరికన్ ఫోటో జర్నలిస్ట్ తో పేకాట లో ఓడిపోయి 6.44 డాలర్లకు బదులు స్మోకీ ని బిల్ కి ఇవ్వడం జరిగింది. స్మోకీ దాదాపుగా 7 అంగుళాలు పొడవు, 2 kg కన్నా తక్కువ బరువు ఉండేది.

చాల రోజులుగా తిండి లేక బక్కపలచని చర్మంతో నీరసంగా ఉంది స్మోకీ. ఆ క్షణం నుంచి స్మోకీ మరణించేవరకు బిల్ పెంచుకున్నాడు. యుద్ధం సమయంలో ఒక సారి బిల్ కు డెంగ్యూ జ్వరం వచ్చి 5 రోజులు మంచాన పడ్డాడు. అతనికి నయం అయ్యేవరకు స్మోకీ బిల్‌ను అనుకునే పడుకునేది. ఇది గమనించిన నర్సులు స్మోకీని ఇతర పేషెంట్స్ వద్దకు తీసుకువెళ్లి ఊరడించేవారు. యుద్ధం ముగిసాక స్మోకీ ని బిల్ తో పాటు అమెరికాకు తెచ్చుకుని దేశం మొత్తం తిరుగుతూ గాయపడిన సైనికులు కోలుకోడానికి సహాయపడ్డాడు. ఈ థెరపీ బాగా పాపులర్ అయ్యేసరికి అదే సమయంలో అమెరికన్స్ సుమారుగా 700 కుక్కలను అమెరికా ఆర్మీ వారికి విరాళంగా ఇచ్చారు. స్మోకీ తన ప్రత్యేక విన్యాసాలతో అందరి మనసులు ఆకట్టుకుంది. యుద్ధంలో సహచరుల శవాలు చూసి డిప్రెషన్ కు గురైన సైనికులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. స్మోకీ 14 ఏళ్ళకి మరణించిన తరువాత అమెరికా ప్రభుత్వం ఒహాయో రాష్ట్రంలో స్మోకీని గౌరవిస్తూ తన సమాధి పై కాంస్య ప్రతిమను చెక్కించింది. స్మోకీ ని ప్రపంచంలో మొట్ట మొదటి థెరపీ డాగ్‌గా గుర్తించారు. కుక్కలే కాదు. పందులు, గుర్రాలు, పిల్లులు, సీమ ఎలుకలు ఇలా చాల రకాల జంతువులను థెరపీ కోసం వినియోగిస్తారు. డాగ్ థెరపీ మాత్రం బాగా ప్రాముఖ్యత చెందింది.

సుమారు 150 ఏళ్ళ క్రితం ప్రఖ్యాత సామజిక సంస్కర్త, ఆధునిక నర్సింగ్ పద్ధతులు కనుగొన్న ఫ్లోరెన్స్ నైటింగేల్ జంతువుల ద్వారా థెరపీ కల్పించవచ్చు అని గుర్తించింది. కుక్కతో కొంత సమయం గడిపితే జబ్బులు నయం అయిపోవడం ఆశ్చర్యంగా అనిపించచ్చు. కానీ దాని వెనుక ఉన్న కారణం తెలుసుకోవడం అవసరం. డాగ్ థెరపీ మీద  సుమారుగా 1970 లో శాస్త్రజ్ఞులు పరిశోధన ప్రారంభించారు. 1980లో ఒక పరిశోధనలో కుక్కలు ఉన్న వారు గుండె జబ్బు వచ్చిన తరువాత కుక్కలు లేని వారి కన్నా ఎక్కువ రోజులు బ్రతికారు అని నిర్ధారించారు. మరొక పరిశోధనలో కుక్కలు ఉన్న వారిలో బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుంది అని తేలింది. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్, మనోవైకల్యం, ఆందోళన లాంటి చాలా రకాల మానసిక రుగ్మతలు నయం చేయడానికి ఆక్సిటోసిన్ (ఓటీ) అనే పెప్టైడ్ హార్మోన్ ఉపయోగపడుతుందని ప్రచురణలు ఉన్నాయి. ఓటీని మన శరీరం లో ఉన్న పీయూష గ్రంధి రక్త ప్రవాహంలోకి విడుదల చేసి మనుషుల మధ్య అనుబంధాలు దృఢపరచడం లో తోడ్పడుతుంది. దీన్ని ‘లవ్‘ హార్మోన్ అని పిలుస్తారు. స్త్రీలలో ఇది ఉద్దీపనం కలిగించి, శిశువుతో బంధం దృఢపరిచి, తల్లిపాల ఉత్పత్తిని  సులువు చేస్తుంది. సమాజం పట్ల మన నిత్యకృతయమైన నడవడికలో ఓటీ కీలక పాత్ర వహిస్తుంది. మనకు నచ్చిన మనుషులను గాని, జంతువులను గాని కలిసినప్పుడు మన రక్త స్రావం లో ఉన్న ఓటీ శాతం కొన్ని రెట్లు పెరిగి మనలోని సానుకూల వైఖరిని పెంపొందిస్తుంది. కుక్కల్లో కూడా ఇంతే అని కొన్ని పరిశోధనల్లో రుజువు అయ్యింది.

బహుశా కుక్కలు, మనుషుల లక్షల సంవత్సరాల సహజీవనం దీనికి కారణం కావచ్చు అంటున్నారు అనుభవజ్ఞులు. గత 15 సంవత్సరాలుగా జరిగే పరిశోధనల్లో మనుషులు కుక్కలకు దగ్గరైనప్పుడు ఇద్దరిలో ఈ ఓటీ శాతం బాగా ఎక్కువవుతుంది అని రుజువయ్యింది. పోస్ట్-ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్, కొత్త మనుషుల భయం, ఆందోళన లాంటి వైకల్యాలు ఉన్న వారికి చికిత్స చెయ్యడానికి ప్రధానమైన మందులతో పాటు ఓటీ ని ముక్కు ద్వారా ఇవ్వడం వల్ల పాజిటివ్ రిసల్ట్ వచ్చిందని ప్రచురణలు ఉన్నాయి. కుక్కలం ఇష్టం ఉన్నవారు వాటికి దగ్గరైనప్పుడు శరీరం లో ఓటీ ఉత్పత్తి సహజంగా కలుగుతుంది కనుక బాహ్యంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటి ప్రభావం ఉండడం వల్ల కుక్కలను థెరపీ కోసం వాడుతున్నారు.  ఇతర దేశాల్లో థెరపీ డాగ్స్ వాడుక ఇటీవల కాలం లో చాల పెరిగింది. మన దేశం లో ఇప్పుడిప్పుడే డాగ్ థెరపీ పుంజుకుంటుంది.  మహారాష్ట్ర లోని ‘అనిమల్ ఏంజెల్స్‘ నాన్-ప్రాఫిట్ ఫౌండేషన్ పిల్లలు, పెద్దల కోసం చాల రకాల థెరపీ కార్యక్రమాలు అమలుపరుస్తుంది.

కుక్కలు పిల్లలు పుణ్యం పాపం ఎరుగని జీవాలు. వారి మనసులు స్వచ్చమైనవి కనుక వారి మధ్య సఖ్యత తొందరగా కలుగుతుంది. మానసిక వైకల్యాలు ఉన్న పిల్లలు తమ తల్లిదండ్రులు, స్నేహితులతో కన్నా కుక్కలతో వాళ్ళ బాధలను పంచుకోడానికి ఇష్టపడుతున్నారు. సరైన శిక్షణ పొందిన కుక్కలు పిల్లల వద్దకు వచ్చి వారి వొడిలో తల పెట్టుకుని వాళ్ళు చెప్పే కబుర్లు వింటూ మనసును తేలిక చేస్తాయి. ఈ మధ్య మన దేశంలో కార్పొరేట్ మరియు స్టార్ట్ అప్ సంస్థలు పెట్ థెరపీని అనుసరిస్తున్నాయి. ‘మేక్ మై ట్రిప్‘ అనే ట్రావెల్ వ్బ్సైటు వాళ్ళు ఈ కార్యక్రమం చేపట్టారు. బాగా ఒత్తిడిలో పని చేసే ఉద్యోగులకు స్ట్రెస్ రిలీఫ్ కలిగించడానికి మఫిన్ (లాబ్రడార్ రిట్రీవర్), ఏంజెల్ (గోల్డెన్ రిట్రీవర్), కోకో (షిట్జు జాతి) కుక్కలను తెచ్చి వాటితో కొంత సమయం గడపాలని ప్రోత్సహిస్తున్నారు. ఐటీ కంపెనీలలో ఉద్యోగులు రాత్రియంబవళ్ళు పని చేస్తూ శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురై ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారు. కనుక మన దేశంలో మరిన్ని సంస్థలు ఇలాంటి థెరపీ కార్యక్రమాలు చేపట్టాలి. స్ట్రెస్ నుంచి విముక్తి కలగడానికి కృతిమ ఔషదాలకన్నా సహజమైన సాధనాలను ఎంచుకోవాలి. థెరపీ డాగ్స్ శిక్షణ ఇచ్చే సంస్థలు మరిన్ని రావాలి.

-వినీత్ కుర్నాల, కేంబ్రిడ్జ్
13182783699

Comments

comments