Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

ఉప రాష్ట్రపతిగా వెంకయ్య పదవీ స్వీకారం

 ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తానని రాజ్యసభ చైర్మన్‌గా హామీ

Venkaiah

న్యూఢిల్లీ : భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు (68) శుక్రవారం ప్రమాణం చేశారు. ఇక్కడ రాష్ట్రపతిభవన్‌లోని దర్బార్ హాలులో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెంకయ్య సతీమణి ఉష సహా పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు హాజరయ్యారు. తెల్లని చొక్కా, పంచెకట్టుతో ఆయన శాంతికపోతంలా ఈ కార్యక్రమానికి హాజరై హిందీ భాషలో ప్రమాణం చేశారు. వెంకయ్య 15వ ఉప రాష్ట్రపతి కాగా, ఈ పదవిని అలంకరించిన వ్యక్తుల్లో 13వ వ్యక్తి కావడం గమనార్హం. అంతకుముందు ఈ పదవిని హమీద్ అన్సారీ, ఎస్.రాధాకృ-ష్ణన్ వరుసగా రెండేసి పర్యాయాలు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ఉప రాష్ట్రపతి అన్సారీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్, బిజెపి కురువృద్ధ నేత లాల్‌కృష్ణ పలువురు కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులతో పాటు ఎస్‌పి నేత ములాయం, ఎన్‌సిపి నేత తారీఖ్ అన్వర్, సిపిఐ నేత డి.రాజా, టిఎంసి నేతలు సుదీప్ బందోపాధ్యాయ్, డిరెక్ ఓబ్రీన్, అన్నాడిఎంకె నేత ఒ.పన్నీర్‌సెల్వం కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఢిల్లీ సిఎం కేజ్రీవాల్, బీహార్ సిఎం నితీశ్ కుమార్ కూడా హాజరయ్యారు. మరోవైపు రాజ్యసభ ఛైర్మన్‌గా కూడా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వెంకయ్య తనదైన శైలిలో సభ్యులనుద్దేశించి ప్రసంగించారు. సభలో ప్రజా సమస్యలపై చర్చించాలని, సంప్రదింపులు జరపాలని, నిర్ణయాలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా సభ్యులను కోరారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసినపుడు ఆయన ఈ మాట తనకు చెప్పారని వెంకయ్య అన్నారు. గందరగోళ పరిస్థితులను సృష్టించరాదని ఆయన హితవు పలికారు. సభలో గందరగోళ పరిస్థితుల నడుమ చట్టాలను తాను ఆమోదించనని ఆయన స్పష్టం చేశారు. పలువురు సభ్యులు చేసిన వినతుల మేరకు ఆయన ఇలా హామీ ఇవ్వడం గమనార్హం. ప్రశాంత పరిస్థితుల్లోనే బిల్లులు ఆమోదం పొందాలని ఆయన అన్నారు. వివిధ పార్టీలకు చెందిన సభ్యులు రాజకీయ ప్రత్యర్థులే గానీ శత్రువులు కారని ఆయన చెప్పారు. సభ్యులంతా తమ ఆలోచనలు, సిద్ధాంతాలకు అనుగుణంగా దేశ పురోగతికి కృషి చేయాలని ఆయన కోరారు. తాను ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చానని, తనకు ఎలాంటి రాజవంశం మద్దతు లేదని ఆయన వ్యాఖ్యానించారు. తానిపుడు పార్టీలకు అతీతంగా అందరివాడినని ఆయన చెప్పుకొచ్చారు. సంఖ్యాబలంతో పనిలేకుండా రాజ్యసభలో అన్ని పార్టీలకు ముఖ్యమైన సమస్యలపై మాట్లాడే అవకాశం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో విపక్షానికి గొంతుక ఉండితీరాలని ఆయన చెప్పుకొచ్చారు. విపక్షంలో ఉన్నప్పుడు రోజులను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తాను విమర్శకుడిగా ఉన్నప్పటికీ, హద్దులు మీరలేదని ఆయన అన్నారు. కీలక సమస్యలపై మాట్లాడే అవకాశం తమకూ కల్పించాలంటూ చిన్న పార్టీలు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
సంచలనాత్మకతను వీడండి
రాజ్యసభ ఛైర్మన్ హోదాలో ఉప రాష్ట్రపతి వెంకయ్య సంచలనాత్మకతను వీడాలని, సభలో నిర్మాణాత్మక చర్చలపై మరింత దృష్టి సారించాలని మీడియాకి సూచించారు. తాను ఎంపిగా ఉన్న రోజుల్లో దేశంలో వ్యవసాయ సంబంధిత సమస్యలపై చేసిన ప్రసంగానికి ఇతర సభ్యులు తనను మెచ్చుకున్నారని, అయితే మరుసటి రోజు ఒక్క వార్తా పత్రిక మినహా మిగిలినవన్నీ తనను విస్మరించాయన్న సంగతి తెలిసి ఆశ్చర్యానికి గురయ్యానని ఆయన చెప్పుకొచ్చారు. ఆ ఒక్క పత్రిక కూడా వ్యవసాయ సమస్యలపై వెంకయ్య వాగ్ధాటితో మాట్లాడారంటూ ఒక్క పంక్తిలోనే ముగిసించి వేసిందని ఆయన విమర్శించారు.
వెంకయ్య ఎదుగుదల ప్రజాస్వామ్యానికే గౌరవం : మోడీ
నిరాడంబరమైన, గ్రామీణ నేపథ్యాల నుండి ఉన్నత శిఖరాలను వ్యక్తులు అధిరోహించడం భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు దక్కిన గౌరవమని ప్రధాని మోడీ అన్నారు. వెంకయ్య నాయుడు వ్యవసాయ కుటుంబం నుండి అంచెలంచెలుగా ఎదిగి ఉప రాష్ట్రపతి పదవితో పాటు రాజ్యసభ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన ఈ రకంగా ప్రశంసించడం గమనార్హం.

Comments

comments