Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

వర్షానికి నానడం వల్లే రాజగోపుర రాయి విరిగింది

Bhadrachalam-Temple

పురావస్తు శాఖ నిర్దారణ, ఇనుప మెస్‌లతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచన

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ఆలయంలోని రాజగోపురపు రాయి విరిగిపడటంతో ఆదివారం పురావస్తు శాఖకు చెందిన అధికారులు రాజగోపురం స్థితి గతులను పరిశీలించారు. వర్షానికి నానడం వల్లే ఆ రాజగోపురపు రాయి విరిగిపడిందని నిర్థారించారు. శనివారం తెల్లవారు ఝామున రాజగోపురానికి చెందిన ఓ రాయి విరిగి పడటంతో భద్రాచలంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మేరకు రామాలయం ఇఓ శ్రీనివాసప్రభాకర్ ఎండోమెట్‌శాఖకు సమాచారాన్ని అందించడంతో వారు హైదరాబాద్‌లోని పురవాస్తు శాఖ అధికారులకు విన్నవించి ఆదివారం భద్రాచలం పంపారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న వారు రాయి విరిగి పడిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. రాయి పరిమాణాన్ని పడిని తీరును, ఎక్కడ్నుంచి విరిగి పండిందో వారు నమోదు చేసుకున్నారు. అనంతరం రాజగోపురం పటిష్టతను చూశారు. ఈ సందర్భంగా పురావస్తు శాఖ ప్రొఫెసర్
పాండురంగారావు మాట్లడుతూ రాజగోపురం పై భాగం బాగానే ఉన్నప్పటికీ కొద్దిపాటి వర్షంపు నీరు లోనికి చేరుతోందని చెప్పారు.

తద్వారా వర్షపు నీరు గోపురపుంలోని ఇతర భాగాలపైకి చేరడం వల్ల ఇసుకరాతి పలకలు వర్షపు నీటితో నానిపోయాయని, తద్వారా ఆ రాయి తన స్థితిని కోల్పోయి మెత్తబడి విరిగి పడిందని తెలిపారు. ఆ రాయి పడిన సమయంలో భక్తులు ఎవ్వరూ అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అయిందని చెప్పారు. ఇలాంటి సఘటనలు పునరావృతం కాకుండా ఇనుపమెష్‌లు రెండు పొరల లా ఏర్పాటు చేయాలని, మరో ఏదైనా రాయి ఉడిపడ్డా అది క్రింద పడకుండా ఆ మెష్‌లోనే ఉండిపోతుందని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయాధికారులకు సూచించారు. మరమ్మత్తు పనులు పూర్తయ్యేంత వరకు ప్రధాన రాజగోపురం నుండి భక్తులకు ఆలయ ప్రవేశాలు కల్పించరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థపతి వల్లి నాయగం, ఎస్‌ఇ వెంకట్రావు, ఏడిసి శ్రీనివాస్, ఇఇ నర్సింగ రావు, రామాలయం ఇఓ ప్రభాకర్ శ్రీనివాస్ తదితరులున్నారు.

పునరావృతం కానివ్వం…
రాజగోపురానికి మరమత్తులు నిర్వహించి మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆయల ఎఒ ప్రభాకర్ శ్రీనివాస్ చెప్పారు. ఎంతో కాలం క్రితం రాజగోపురం నిర్మాణం కావడం వల్ల వర్షానికి బీటలు వారిందని, తద్వారా వర్షంపు నీరు గోపురపు లోపలి భాగంలోనికి చేరిందని చెప్పారు. ఆగమశాస్త్రాను సారం మరమ్మత్తులు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. స్థపతి ద్వారా పూర్తి వివరాలు తీసుకుని మరమ్మత్తులు ఎప్పట్నుంచి చేపట్టేది త్వరలో వెల్లడిస్తామని అన్నారు.

ఘనంగా స్వాగతం…
రామాలయానికి విచ్చేసిన స్థపతి, ఎస్‌ఇ,ఏడిసి, ఇఇ, పురావస్తు శాఖ ప్రొఫెసర్‌కు దేవస్థానం ఇఓ ప్రభాకర్ శ్రీనివాస్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు గర్భగుడిలోని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం ప్రాంగణంలో దసరాశరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నందున లక్ష్మీతాయారమ్మ వారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని అభయాంజనేయ స్వామికి రుద్రాభిషేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈసందర్భంగా వారిని ఆలయం తరుపున షాలువాలతో సత్కరించి స్వామి వారి ప్రసాదాలు అందజేశారు.

Comments

comments