Search
Tuesday 12 December 2017
  • :
  • :
Latest News

ఫేస్ బుక్ పంచాయితీ

 కాగజ్‌నగర్‌లో కొనసాగుతున్న పోలీస్ పహారా  144 సెక్షన్ విధింపు… అడుగడుగునా పోలీస్ నిఘా  పలువురిపై కేసుల నమోదు  అల్లరి మూకలపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ఎస్పీ , మత సామరస్యాన్ని కాపాడాలని పిలుపు,… విచారణ ప్రారంభం

                        Police

మన తెలంగాణ/ కాగజ్‌నగర్ టౌన్/కాగజ్‌నగర్ : కాగజ్‌నగర్ పట్టణంలోని శుక్రవారం రాత్రి ఓ యువకుడు ఫేస్‌బుక్‌లో ఒక అసభ్యకరమైన పోస్ట్ పెట్టడంతో ప్రా రంభమైన ఆందోళనలు తారా స్థా యికి చేరుకోవడంతో అర్ధరాత్రి జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ కాగజ్‌నగర్‌కు చేరుకున్నారు. ఒక వర్గానికి చెందిన యువకుడు మరో వర్గానికి చెందిన వారికి ఛాలెంజ్ చేస్తూ చేసిన పోస్టు ఫేస్ బుక్‌లో వైరల్ కావడంతో యువకులు రాత్రి రాజీవ్ చౌక్‌కు చేరుకొని ధర్నా చేసిన విషయం తెలిసిందే. అయితే పరిస్థితులు చేజారే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి పట్టణంలో పోలీ స్ బలగాలను మోహరింపజేశారు.

అర్ధరాత్రి అల్లరిమూకలు 14 నెంబర్ వార్డు, నవగాంబస్తీలలో ఇళ్లపై రాళ్లు రువ్వడంతో ఇరు వర్గాల వారు ఆందోళనకు దిగారు. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన యువకుని ఇంటిపై కొందరు దాడి చేసి సామగ్రిని ధ్వంసం చే యడమే కాకుండా మోటర్‌సైకిల్‌ను తగలబెట్టారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అన్ని వార్డుల్లో పోలీస్ ఫోర్స్‌ను రంగంలో దింపి పరిస్థితులను అదుపులో ఉంచారు. స్వయంగా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ కాగజ్‌నగర్‌కు చేరుకొని పలు కాలనీలలో పర్యటించారు. 14వ వార్డులోని మాజీ కౌన్సిలర్ సుభాన్ ఇంటిపై అల్లరిమూకలు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో ఎస్పీ ఆ ప్రాంతానికి వెళ్లి అల్లరిమూకలను చెదరగొట్టారు.

శనివారం ఉదయం కూడా పట్టణమంతా పోలీస్ బందోబస్తు ఉండటంతో పరిస్థితులు సాదారణంగా మారాయి. మరో వైపు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్‌లో ఇరు వర్గాల వారితో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించి, పరిస్థితులను అదుపులో పెట్టడానికి సహకరించాలని కోరారు. ఇరు వర్గాల పెద్దలు సహకరిస్తామని హామీ ఇవ్వడంతో పట్టణంలో సాయంత్రం సామాన్య పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా, డిఎస్పీ ఎండీ. హబీబ్ ఖాన్ ఆధ్వర్యంలో పట్టణ సిఐ ఆరె వెంకటేశ్వర్ విచారణ ప్రారంభించారు. ఆరుగురిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Comments

comments