Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

రామ.. రామా!

Temple

విరిగిపడిన రామాలయ రాజగోపుర రాయి
భక్తులు లేకపోవడంతో తప్పిన పెనుప్రమాదం
దర్శనాలకు దారి మళ్లించిన ఇఒ

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్ర స్వామివారి ఆలయ రాజగోపురపు రాయి శనివారం తెల్లవారుజామున విరిగి పడింది. ఆ సమయంలో భక్తుల దర్శన
సమయం కాకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. రామాలయ ప్రధాన ద్వారం నుంచి లోనికి ప్రవేశించే క్రమంలో పై భాగాన రాజగోపురం ఉంది. ఈ రాజగోపురాన్ని 1982వ సంవత్సరంలో జూన్ 2వ తేదీన అప్పటి దేవాదాయ శాఖ మంత్రి హైగ్రీవాచారి కలష ప్రతిష్ఠ, కుంబాభిషేకం చేసి రాజగోపురాన్ని ప్రారంభించారు. గర్భగుడిలోని సుమారు 350 ఏళ్ల క్రితం రామదాసు నిర్మించినప్పటికీ రాజగోపురాన్ని మాత్రం నిర్మించి సుమారు 30 ఏళ్లు అవుతోంది. అయితే దానిలో రాయి ఊడి పడటం పట్ల దాని మన్నికపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజగోపురపు రాయి ఊడిపడిన ప్రదేశం నుంచే భక్తులు ఆలయ క్యూ లైన్లో నిల్చుని దర్శనం కోసం వేచి చూస్తుంటారు. ఈ సంఘటన తెల్లవారుజామున జరగడంతో భక్తులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రాయి ఊడిన ప్రదేశంలో రాజగోపురం స్వల్పంగా బీటలు వచ్చినట్టు తెలుస్తోంది.

దర్శనాలకు దారి మళ్లింపు..
ఆలయ ప్రధాన ద్వారం నుంచి భక్తులు వెళ్లకుండా ఆలయ ఇఒ ప్రభాకర్ శ్రీనివాస్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధాన ద్వారాన్ని మూసివేసి ఉత్తర ద్వారం గుండా భక్తులు రామున్ని దర్శించుకునేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఉత్తర ద్వారా ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే తెరుస్తుంటారు. ఇప్పుడు ప్రధాన ద్వారాన్ని మూసివేయడంతో ఉత్తర ద్వారాన్ని తెరవాల్సి వచ్చింది.

ఆగమ శాస్త్రం ప్రకారం…
ఆగమ శాస్త్రం ప్రకారం ఏం చేయాలనే దానిపై వేదిక కమిటీతోపాటు ఆలయ ఇఒ సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే ఎండోన్‌మెంట్ శాఖకు సమాచారాన్ని అందజేశారు. నేడో, రేపు స్తపతితోపాటు ఆర్కిటెక్ట్ కూడా రానున్నట్లు తెలుస్తోంది. వారు వచ్చిన తర్వాత రాజగోపురం పరిస్థితి. దాని బలం, మన్నికపై పూర్తిగా పరిశీలించి ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై ఆలోచన చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా భద్రాచలం రామాలయంలో చోటు చేసుకున్న సంఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. భక్తుల ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, వారి మనో భావాలు దెబ్బతిన కుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయాధికారులకు సూచించినట్టు సమాచారం.

Comments

comments