Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

మార్కెట్ యార్డును ముట్టడించిన రైతులు..

తడిసినధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని
గంటన్నర పాటు కొనసాగిన ధర్నా…మార్కెట్ యార్డును ముట్టడించిన రైతులు
ఏర్పాట్లపై మార్కెట్ అధికారులపై రైతుల ఆగ్రహం…
మంత్రి హరీష్‌రావు జోక్యంతో ధర్నా విరమించిన రైతులు..

28wnp41

మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి : వనపర్తి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధ,గురువారాల్లో తడిసిన 3 వేల బస్తాల మొక్కజొన్న ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తు రైతులు గురువారం వనపర్తి వ్యవసాయ మార్కెట్‌యార్డు కార్యాలయాన్నిముట్టడించారు. దాదాపు గంటన్నర పాటు 150 మంది రైతులు మార్కెట్‌యార్డు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి , మార్కెట్ శాఖాధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులు చేస్తున్న ధర్నాకు కాంగ్రెస్,టిడిపి ,సిపిఎం,సిపిఐ నాయకులు మద్దతు పలికారు. బుధవారం వ్యవసాయ మార్కెట్ యార్డులో విక్రయానికి వచ్చిన మూడు వేల బస్తాల మొక్కజొన్న ధాన్యాన్ని రైతులు ప్లాట్‌ఫాంపై ఆరబెట్టుకున్నారు. వ్యాపారస్తులు దాదాపు రెండువేల బస్తాలకు టెండర్లు వేసి క్వింటాల్‌కు రూ. 800 , రూ. 900 లకు ధర నిర్ణయించారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అకస్మాత్తుగా భారీ వర్షం రావడంతో మూడు వేల బస్తాల ధాన్యం పూర్తిగా తడిసి పోవడంతో పాటు దాదాపు 200 బస్తాల మొక్కజొన్న ధాన్యం వరద నీటిలో కొట్టుకు పోయింది. రైతుల ధాన్యం తడవకుండా వ్యవసాయ మార్కెట్ అధికారులు ఎలాంటి జాగ్రత్తలు పాటించలేదని గత రెండు రోజులుగా మార్కెట్ యార్డు బంద్ ఉన్నప్పటికి రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో వేలాది క్వింటాళ్ల మొక్కజొన్న ధాన్యాన్ని మార్కెట్‌యార్డుకు తీసుకురావడం జరిగిందని అధికారులు ముందస్తుగా రైతులకు సమచారం ఇవ్వడంలో పూర్తిగా నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని వ్యవసాయ మార్కెట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి నాయకులు జడ్పిటిసి వెంకటయ్యయాదవ్, కాంగ్రెస్ నాయకులు తిరుపతయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జబ్బార్, రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు.

28wnp41 28wnp39మంత్రి హరీష్‌రావు జోక్యంతో ధర్నా విరమించిన రైతులు..
వనపర్తి మార్కెట్ యార్డు దగ్గర తడిసిన మొక్కజొన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు చేస్తున్న ఆందోళనను తెలుసుకున్న మార్కెటింగ్, భారీ నీటిపారుదల శాఖా మంత్రి హరీష్రావు వనపర్తి జిల్లా జాయింట్ కలెక్టర్ నిరంజన్‌రావుతో ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే రైతుల
సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని ఆదేశించడంతో ఆయన మార్కెట్ యార్డు దగ్గరికి చేరుకొని రైతులతో మాట్లాడారు. తమకు రూ.1420 లు క్వింటాల్‌కు చెల్లించాలని రైతులు కోరడంతో వ్యాపారస్తులతో మాట్లాడిన జెసి నిరంజన్‌రావు బుధ,గురువారాల్లో వ్యాపారస్తులు క్వింటాల్‌కు
రూ.800,రూ.900 లకు వేసిన ధరకు అదనంగా రూ.150 ఎక్కువ ధర రైతులకు చెల్లించాలని ఆదేశించడం తో రైతులు ధర్నాను విరమించారు. మార్కెట్‌చైర్మన్ రవి, ఎంపిపి శంకర్‌నాయక్, వైస్‌చైర్మన్ కుమార్‌యాదవ్, తదితరులు మంత్రి హరీష్‌రావు దృష్టికి సమస్యను తీసుకెళ్లడంపై
రైతులు హర్షం వ్యక్తం చేశారు.

Farmers who invaded the market yard at Vanaparthi In Telangana

Comments

comments