Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

అన్నగా ఆదుకుంటోండు..!

10వేలకు పైగా బతుకమ్మ చీరల పంపిణీకి శ్రీకారం
వందపడకల ఆసుపత్రి డిసెంబర్‌లోగా పూర్తి
కెసిఆర్ కిట్స్ ఆడబిడ్డల సంరక్షణకే
మంత్రి తన్నీరు హరీష్‌రావు

                          Harish-Rao

మనతెలంగాణ/వేములవాడ : అన్నా అని పిలిపించుకున్నట్లుగానే తాను తెలంగాణ ఆడబిడ్డలకు అండగా నిలుస్తూ కులమతాలకు అతీతంగా ఆదుకుంటొండు మన తెలంగాణ సిఎం కల్వకుంట చంద్రశేఖర్‌రావు అని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. మంగళవారం ఆయన గుడిచెరువులోని ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడకు వచ్చిన ఆడబిడ్డలకు చేనేత చీరల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఆడబిడ్డల సంరక్షణకై కళ్యాణలక్ష్మి పథకం, కెసిఆర్ కిట్టు వంటి పథకాలెన్నో చేపట్టి, వాటిని విజయవంతం చేశామని, ప్రస్తుతం బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు కానుకగా చీరల పంపిణీని చేస్తున్నామని, దీనితో చేనేత కార్మికులకు సైతం చీరల విక్రయం జోరందుకుని, వారి ఇళ్లలో కూడా పండుగ సంబురాలు నిర్వహించుకునేలా కెసిఆర్ ఈ పథకాన్ని రూపొందించారని అన్నారు.

వేములవాడ పట్టణంలో దాదాపు 10,434 మంది లబ్దిదారులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నామని తెలిపారు. అలాగే ఆడబిడ్డలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఆపరేషన్ల పేరుతో తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకున్న సిఎం వీరికోసం కెసిఆర్ కిట్టులను ప్రారంభించారని, దీనిని ప్రతీ గర్భీణీ స్త్రీ వినియోగించుకోవాలని కోరారు. వేములవాడలో వంద పడకల ఆసుపత్రి డిసెంబర్ వరకు పూర్తి చేస్తామని, అప్పటి వరకు వేములవాడ నియోజక వర్గ ప్రజలు సిరిసిల్లలోని జిల్లా ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని కోరారు.

ముంపు గ్రామాల సహకారం మరువలేనిది

అన్నీ కోల్పోతూ పక్కవారికి వెలుగు చూపే గుణం కొందరికే ఉంటుందని అలాంటి అవకాశం ముంపు గ్రామాల ప్రజలకు దక్కిందని, వారి సహకారం టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎప్పటికి మరువలేదని మంత్రి హరీష్‌రావు అన్నారు. రాజన్నగుడి చెరువులో భూమి పూజ సందర్భంగా ముంపు గ్రామాల ప్రజలను ఉద్దేశించి ప్రత్యేకంగా మాట్లాడారు. ముంపు గ్రామాల ప్రజలు దాదాపు తమ 10సంవత్సరాల పాటు ఎంతో మనోవేదనను అనుభవించారని దీనిని అర్ధం చేసుకున్న కెసిఆర్ వారి కోసం గతంలో ఎన్నో పోరాటాలను కూడా చేశారని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సిఎం ప్రత్యేకించి మధ్యమానేరుపైనే దృష్టి సారించి, ఈ పనులను కేవలం మూడు సంవత్సరాల్లోనే తుది దశకు తీసుకువచ్చారని, ఈ ప్రాజెక్ట్‌తో ముంపునకు గురవుతున్న బాధితు కోసం దాదాపు 850కోట్ల రూపాయలను ఇప్పటి వరకు వెచ్చించారని వెల్లడించారు. కాని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని 9ఏళ్ల పాటు ఊరించి కేవలం 120కోట్ల రూపాయలను మాత్రమే వెచ్చిందని అన్నారు.

దీనిని చూసి ఓర్వలేని నాయకులు ముంపు గ్రామాల ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు. ప్రాజెక్ట్ నిర్మా ణం పూర్తియిందని నష్టపరిహారం కోసం బాధితులు అధికారుల చుట్టు తిరగాల్సిన పనిలేదని, వివరాల సేకరణ కోసం అధికారులే వారి ఇంటిని వెదుకుంటూ వస్తారని అన్నారు. ఇంటికి వచ్చిన అధికారులు వారికి ఒక టోకెన్ అందజేస్తారని, ఈ టోకెన్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన వారంలోగ జిల్లా కలెక్టర్ నుండి ఒక మెస్‌జ్ వచ్చిన 24గంటల లోపు వారికి తమ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమవుతాయని అన్నారు. మధ్యమానేరులోకి 5టిఎంసిల నీటిని మాత్రమే నింపుతామని, అది డిసెంబర్ వరకు జరుగుతుందని, ఈలోగా నిర్వాసితులు తమ గృహ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కోరా రు.

అనంతరం ఎంపి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబులు మాట్లాడుతూ టిడిపి, కాంగ్రెస్ ప్రభుత్వాల సమయంలో ఏళ్ల పాటు నీటి కష్టాలను వేములవాడ ప్రజలు చవిచూశారని ఆ సమయంలో ఏ ప్రభుత్వం కూడా వీరిని పట్టించుకోలేదని, ఆంధ్ర ప్రాంతానికి నిధులను మంజూరు చేస్తూ తెలంగాణ ప్రజలను విస్మరించారని ఆరోపించారు. తాను గతంలో వేములవాడ నియోజక వర్గంపై ప్రేమతో జర్మనీలో ఉంటూ కోట్లాది రూపాయలను సేకరించి సేవ్స్ సంస్థ ద్వారా ప్రతీ గ్రామంలో 10నుండి 15వరకు బోరుబావులను వేయించానని అన్నారు. కాని ఈ నీటి కష్టాలు మాత్రం తీరలేదని దీనికి శాశ్వత పరిష్కారం కోసమే గోదావరి నీటిని నియోజక వర్గంలోని అన్ని చెరువులకు, రాజన్నగుడిచెరువులోకి సరఫరా చేసే విధంగా ప్రణాళికను రూపొందించి, ఆ పనులు కూడా త్వరితగతిన పూర్తవుతున్నాయని అన్నా రు. ఈ కార్యక్రమంలో జడ్పి చైర్మన్ తుల ఉమ, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, నగర పంచాయతీ చైర్‌పర్సన్ నామాల ఉమ, జడ్పిటిసి గుడిసె శ్రీకాంత్, ఆలయ ఇఓ దూస రాజేశ్వర్, టిఆర్‌ఎస్ నాయకులు ఎర్రం మహేష్, ముప్పిడి శ్రీనివాస్, నగర పంచాయతీ కౌన్సిలర్లు, సెస్‌డైరెక్టర్‌లు, అధికారులు, పట్టణ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.

Comments

comments