Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

సర్వం.. చెత్తమయం!

Garbage

గూడెంలో పడకేసిన పారిశుద్ధ్యం
ఆస్పత్రుల బాట పడుతున్న ప్రజలు
చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు

కొత్తగూడెం: పట్టణంలో ఏ వీధి చూసినా చెత్తే దర్శనమిస్తోంది. ఒక పక్క దేశం ప్రధాని స్వచ్ఛ భారత్ పేరిట యుద్ధం చేస్తుంటే… రాష్ట్రంలో ముఖ్యమంత్రి  సైతం స్వచ్ఛతకు పెద్దపీట వేస్తుంటే.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. ప్రజలను చైతన్య వంతులను చేసేక్రమంలో పాలన
ఏమాత్రం సాగడం లేదు. ఫలితంగా చెత్త రాజ్యమేలుతోంది. మున్సిపాలిటీ, పంచాయతీల్లో పారిశుద్ధ సమస్య కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. రోజుల తరబడి చెత్తను తొలగించకపోవడంతో చెత్తకుప్పలు గుట్టలను తలపిస్తున్నాయి. దీనికి తోడు చిన్నపాటి వర్షం పడితే చాలు విషవాయువులు వెదజల్లడంతో ప్రజలు శ్వాస తీసుకోవడానికి కూడా అవస్థలు పడుతున్నారు. పందులు చెత్త కుప్పలను నివాస స్థలాలుగా ఏర్పాటు చేసుకోవడంతో ప్రజలు వాటి మధ్యే జీవితం గడపాల్సి వస్తోంది. కాల్వలు శుభ్రం చేసే దిక్కు లేక వ్యర్థాల నిల్వలతో మురుగు నీరుతో కూడిన కాల్వలే దోమలకు నిలయాలుగా మారుతున్నాయి. ఫలితంగా ఈగలు, దోమలు, పందుల భారీ నుంచి తప్పించుకోలేక ప్రజలు రోగాల భారిన పడుతున్నారు. ప్రజలు శ్వాసకోస సంబంధిత వ్యాధితోపాటు మలేరియా, టైపాయిడ్, డెంగ్యూ జ్వరాలతో ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. లక్షలాది రూపాయలు ఆస్పత్రిలో చెల్లించినప్పటికీ పరిస్థితి విషమించి అనేక మంది మృత్యువాత పడిన సంఘటనలూ ఉన్నాయి. పారిశుద్ధ్య నియంత్రణ కోసం ప్రభుత్వం ఏటా లక్షలు ఖర్చు చేస్తున్నా ప్రభుత్వ ఆదేశాలను అధికారులు పెడచెవిన పెడుతున్నారు. గుర్తొచ్చినప్పుడు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ అంటున్నారే తప్ప.. ఆ తర్వాత దీని గురించి పట్టించుకున్న పాపాన పోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

నిర్లక్ష్యం.. రాజ్యమేలుతోంది!
పారిశుద్ధ సమస్య వేధించడంతో ఎక్కువగా వ్యాధులు సంక్రమిస్తున్నాయి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు ఎప్పటి చెత్తను అప్పుడే తొలగించాలి. దోమలు వ్యాప్తి చెందకుండా ఫాగింగ్ చేయాలి. మురుగు నీటిలో దోమలు వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వేయాలి. కానీ కొత్తగూడెంలో
ఇవేమీ చెసిన దాఖలాలు కనిపించడం లేదు. ఫాగింగ్ చేసే పనిముట్లు మూలన పడేసి.. అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వార్డుల్లో తిరిగి పర్యవేక్షించడం లేదని కిందిస్థాయి సిబ్బందికి చెప్తే పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. వీధుల్లో కనీసం చెత్త వేయడానికి అవసరమైన కుండీలు ఏర్పాటు చేయకపోవడంతో కుండిలు స్థిరంగా లేకపోవడం చూస్తే అధికారుల పని తీరు అర్థమవుతోంది తడి, పొడి చెత్తను వేరుగా సేకరించడానికి ఇంటికి రెండు చెత్త కుండీలు, దోమల భారీ నుంచి కాపాడేందుకు దోమ తెరలు పంపిణీ చేసే కార్యక్రమం మొక్కుబడిగా సాగిందనే ఆరోపణ ఉంది. చైతన్యం పేరుతో తూతూమంత్రంగా పారిశుద్ధ సదస్సు నిర్వహించేసి అధికారులు చేతులు దులిపేసుకున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ప్రజల్లోనూ చైతన్యం పెరగాలి… పారిశుద్ధ సమస్యను పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నప్పటికీ.. ప్రజల్లోనూ చైతన్యం పెరగాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు పాటించాలి. పరిసరాల్లో పాత పాత్రల్లో, తొట్టిలు, టైర్లు, తాగి పడేసిన కొబ్బడి బోండాలు తదితరాలు దోమల వృద్ధికి ప్రధాన కారణాలు. కాబట్టి వీటిని లేకుండా చూసుకోవాలి. బ్లీచింగ్ చల్లుకోవడం వంటివి అలవాటు చేసుకోవాలి.

Comments

comments