Search
Wednesday 20 June 2018
  • :
  • :

బడుగు లక్ష్మికి బాసటగా నిలుద్దాం

poliogirl

మన తెలంగాణ/ధర్మారం (పెద్దపల్లి జిల్లా) : బుడిబుడి నడకలనాడే పోలియో బారిన పడింది. పదహారేళ్లలో 14 శస్త్ర చికిత్సలను తట్టుకొని నిలబడింది. అయినా నడవలేని అశక్తత. వెన్నాడుతున్న పేదరికం. ఇవేవీ తన చదువులకు అడ్డంకులు కావనుకుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతూ ఇంటర్ చదువుతున్న విజయలక్ష్మి గాధ మనసున్న మారాజులను కదిలిస్తే రేపు ఆమె పలువురికి సేవలందించే ప్రతిభావంతురాలు కాగలుగుతుంది. ఆమె కుటుంబ నేపథ్యాన్ని తరచిచూస్తే… పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పైడిచింతలపల్లి గ్రామంలో కూలీనాలీ చేసుకుని జీవించే భూమమ్మ రాజయ్యల ఏకైక సంతానం విజయలక్ష్మి. పుట్టిన నాటి నుండి కష్టాలకే అంకితమైంది. రెండేళ్లకు పోలియో మహమ్మారి కాళ్లను మెలితిప్పింది. తన ఒక్కగానొక్క కూతురు నడుస్తుం చూడాలన్న కోరికతో ఏకంగా 14 సార్లు శస్త్ర చికిత్సలు చేయించారు తల్లిదండ్రులు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఇక తాను నిలకడగా నిలబడి నడవలేనని తెలుసుకున్న విజయలక్ష్మి చదువుల తల్లిని నమ్ముకుంది. గ్రామంలో ఉన్న చదువును పూర్తి చేసి ఆరవ తరగతి కస్తూర్భా విద్యాలయంలో చేరింది. పదవ తరగతి వరకు అక్కడే చదివిన విజయలక్ష్మికి “ఇంటర్‌” కష్టాలు మొదలయ్యాయి. తానింకా చదువుకుంటానని తల్లిదండ్రులతో మారాం చేసింది. తల్లీ నిన్ను చదివించే శక్తి నాకు లేదని తండ్రి వాపోయాడు. అయినా పట్టు వదలక పోవడంతో ధర్మారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్పించారు.poliogirl3

ఇంతవరకు బాగానే ఉన్నా పైడిచింతలపల్లి గ్రామం నుండి రోజూ కళాశాలకు వచ్చేదెలా? ఇదే వారికి పెద్ద సమస్యగా మారింది. తాను పని చేయాలి, కూతురు చదువుకోవాలి. దీని కోసం తమ గ్రామాన్ని వదిలి ధర్మారం చేరుకుంది రాజయ్య కుటుంబం. కనీసం ఉండేందుకు చిన్న ఆసరా కావాలి. అద్దె భరించలేరు, ఊరంతా గాలించారు. చివరకు పాడుబడిన పోలీసు గౄహాలు దర్శనమిచ్చాయి. చీకటి పడితే పాములు, తేళ్లు చుట్టూ చిట్టడవి, విద్యుత్ లేని దురవస్థ. అయినా అక్కడే తల దాచుకున్నారు. బుడ్డి దీపమే విజయలక్ష్మి చదువుకు దిక్కయింది. కూలీనాలీ చేసి రాజయ్య తెచ్చిన డబ్బు ముప్పూటలా తిండికి సరిపోకున్నా సర్ధుకుంటుండగా తల్లి భూమమ్మ భూదేవంత ఓపికతో విజయలక్ష్మికి పొద్దున్న లేచింది మొదలు రాత్రి వరకు సపర్యలు అందిస్తూ చదువుకోమని తానున్నాని ప్రోత్సహించింది. విజయలక్ష్మిని ప్రతిరోజూ సంకకెత్తుకుని కాలేజీ వరకు తీసుకెళ్లడం, తిరిగి తీసుకురావడం ఆ తల్లి పడుతున్న కష్టానికి కొసమెరుపు. విజయలక్ష్మికి సహాయం అందించి ఆమె జీవితాన్ని మలుపు తిప్పగలిగితే సమాజానిదే గెలుపవుతుంది.

poliogirl2

దాతలు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు..  9989920534, 8367243864

Let’s stand up for help to a poor Polio girl’s education

Comments

comments