Search
Friday 24 November 2017
  • :
  • :
Latest News

రైతులకు నాసిరకం విత్తనాలు

వేరుశనగ విత్తనాల్లో నాణ్యతలోపం
శాంపిల్‌గా విత్తనాలను పరిశీలించిన వనపర్తి జిల్లా కలెక్టర్
సరైన నాణ్యతలు లేవని నిర్ధారణ

Farmer

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రైవేట్ విత్తన కంపెనీలే కాదు… ప్రభుత్వ సంస్థల నుంచి సరఫరా అవుతున్న విత్తనాల్లోనూ నాణ్యత ఉండటం లేదు. వచ్చే యాసంగికి రైతులకు సబ్సిడీపై పంపిణీ చేసే వేరుశనగ విత్తనాలు నాసిరకంగా ఉన్నట్లు తెలిసింది. ఈ విత్తనాలను తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ (టిఎస్‌ఎస్‌డిసి) సబ్సిడీపై పంపిణీ చేస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాలలకు వేరుశనగ విత్తనాలను సరఫరా కూడా చేసింది. ఇందులో వనపర్తి జిల్లాకు సరఫరా చేసిన విత్తనాలు నాసిరకంగా ఉన్నాయి. వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేత మోహంతి విత్తనాలను శాంపిల్‌గా పరిశీలించి నాసిరకంగా ఉన్నాయని తేల్చినట్లు తెలిసింది. టిఎస్‌ఎస్‌డిసి సరఫరా చేసిన వేరుశనగ విత్తనాలలో పొట్టు, రాళ్లు, చెత్తతో పాటు చితికిన గింజలుగా ఉండటంతో పా టు వాటి సైజు చిన్నదిగా ఉందని మొత్తంగా నాణ్యత ప్రమాణాలు సరిగ్గా లేవని గుర్తించారు. ఈ విషయమై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు నాణ్యత కలిగిన మంచి విత్తనాలను పంపాలని కోరుతూ లేఖ రాయనున్నట్లు తెలిసింది.

వనపర్తి జిల్లాకు 40 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనం సరఫరా చేయాల్సి ఉండగా ఇందులో 2 వేల క్విం టాళ్లు వరకు సరఫరా చేసారు. ఇంత తక్కువ మొత్తం సరఫరా చేస్తేనే విత్తనాలు నాణ్యత లేకుండా ఉంటే, 40 వేల క్వింటాళ్లు ఏ రకంగా ఉంటాయోనని రైతులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే నాసిరకం సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేస్తే, ప్రైవేట్ వ్యవస్థ రెచ్చిపోదా ఇలాంటి వాటితోనే అన్నదాతకు నష్టం వాటిల్లుతోందని రైతు సం ఘాలు మండిపడుతున్నాయి. అధికారులు అక్రమాలకు పాల్పడుతూ నాసిరకం విత్తనాలను సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. వానకాలంలో సాగు కే తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ నుంచి పంపిణీ చేసిన విత్తనాల్లో మొలకెత్తే లక్షణం తగిన స్థాయిలో లేనట్లు డిఎన్‌ఎ ల్యాబ్ రిపోర్ట్‌లో తేలిన విషయం తెలిసిందే.

వికారాబాద్ జిల్లాలో సేకరించిన విత్తన నమూనాల్లో సోయాబీన్ అం కురోత్పత్తి శాతం 55 శాతం, జిలుగ 46 శాతమే ఉన్నట్లు ఆ పరీక్షల్లో వెల్లడైంది. ఇప్పుడు వేరుశనగ విత్తనాలు నాసిరకంగా ఉండటం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే వానకాలం సాగులో అన్నదాతలు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. వరి ఈసారి తక్కువగా నమోదైంది. ఈ క్రమంలో వానకాలంలో సాగు చేయని భూమిలో యాసంగి పంటలు కొంచెం ముందుగానే వేయాలనే యోచనలో రైతులు ఉన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో వేరుశనగనే సాగు చేస్తారు. ప్రభుత్వం యాసంగిలో 5.82 లక్షల క్వింటాళ్లు వివిధ పంటల విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో 1.64 లక్షల క్వింటాళ్లు వేరుశనగగ విత్తనమే ఉంది. ధరల విషయంలోనూ ఇతర రాష్ట్రాలలో, బహిరంగ మార్కెట్‌లో ఉన్నదానికంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. క్వింటాలు రూ. 7600గా ఉంది. ఇందులో 40 శాతం సబ్సిడీ రూ.3040 పోను మిగతా మొత్తం రూ. 4560 రైతు చెల్లించాల్సి ఉంటుంది.

Comments

comments