Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

కడుపులో దూది

 ఆపరేషన్ దూదిని లోపలే ఉంచి కుట్లు వేసిన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు

Doc

జగిత్యాల: ఆపరేషన్ చేసే సమయంలో  రక్తాన్ని శుభ్రం చేసేందుకు వాడిన దూదిని కడుపులోనే మరిచిపోయి కుట్లు వేయడంతో ఓ గర్బిణీ తీవ్ర అస్వస్థతకు గురైంది.  తిరిగి ఆస్పత్రికి వచ్చి తన బాధను వ్యక్తం చేసినా పట్టించుకోకపోవడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవే ట్ ఆస్పత్రిలో చేరి  ఆమె పరీక్షలు చేయించుకోగా కడుపులో దూది ఉన్నట్లు తేలింది. దాంతో అక్కడి వైద్యులు ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న దూదిని బయటకు తీశారు. వైద్యుల నిర్లక్షం వల్ల ప్రాణం పోయే పరిస్థితి ఏర్పడిందంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు మంగళవారం జిల్లా ప్రధాన ఆస్పత్రికి చేరుకొని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్  అశోక్‌కుమార్‌ను నిలదీశారు. సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కోరుట్లకు చెందిన సుమ అనే గర్భిణి ప్రసవం కోసం తన తల్లిగారి ఇల్లు అయిన మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చేరుకుంది. ప్రసవ సమయం దగ్గర పడడంతో గత నెల 7న జగిత్యాల ఆస్పత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు 8న ఆపరేషన్ చేశారు. 13న ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్ళిన సుమకు కడుపులో నొప్పిగా ఉండడంతో పాటు వాంతులు కావడంతో ఆందోళనకు గురై తిరిగి ఆస్పత్రికి చేరుకుంది. తనకు కడుపులో నొప్పి తీవ్రంగా ఉందని, తరుచూ వాంతులు అవుతున్నాయని వైద్యులకు చెప్పినా ఏమి కాదు, అలాగే ఉంటుంది అంటూ మందులు రాసి పంపించారు. కాగా  నొప్పి రోజు రోజుకు ఎక్కువ కావడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సుమను కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్ళారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు కడుపులో దూది ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న దూదిని వారు తొలగించారు. కాగా వైద్యురాలు, సిబ్బంది నిర్లక్షం వల్లే తాము తీవ్ర ఇబ్బందులు పడ్డామని, సమస్య వివరించినా వైద్యులు, సిబ్బంది పట్టించుకోలేదంటూ సుమ బంధువులు సూపరింటెండెంట్ ఎదుట వాపోయారు. జరగరానిది ఏదైనా జరిగితే బాధ్యులెవరంటూ, నిర్లక్షంగా వ్యవహరించిన వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఆ రోజు సుమకు ఆపరేషన్ చేసిన డాక్టర్ ఎవరనేది గుర్తించి, తగు చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.

Comments

comments