Search
Wednesday 18 October 2017
  • :
  • :
Latest News

గేమ్ స్టార్ట్ చేసిన ‘ఆటగాళ్లు’

Aatagallu

ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై నారా రోహిత్, జగపతిబాబులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆటగాళ్లు’. ఈ ఇంటెలిజెంట్ థ్రిల్లర్‌కు ‘గేమ్ విత్ లైఫ్’ అనేది ట్యాగ్‌లైన్.  పరుచూరి మురళి దర్శకత్వంలో వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్రలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. నారా రోహిత్, జగపతిబాబులపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి శేఖర్ కమ్ముల క్లాప్‌నివ్వగా… దిల్‌రాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ “తొలిసారి జగపతిబాబుతో కలిసి చేస్తున్న చిత్రమిది. కెమెరామెన్ విజయ్ సి.కుమార్‌తో నేను చేస్తున్న రెండో చిత్రమిది. సాయికార్తీక్‌తో కలిసి చేస్తున్న ఏడవ సినిమా ఇది. ఇదొక విభిన్న, ప్రయోగాత్మక కమర్షియల్ సినిమా. ఇద్దరు తెలివైన వాళ్ల మధ్య జరిగే కథ ఇది”అని అన్నారు. జగపతిబాబు మాట్లాడుతూ “టైటిల్ చాలా బాగుంది. పెదబాబు చిత్రం నుంచి నాకు మురళి అంటే ఇష్టం. ఆ సినిమాలో పాటలు, కామెడీ, సీరియస్‌నెస్ అన్నీ బాగుంటాయి. ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా దానిని మించిన సినిమా అవుతుంది. నేను, రోహిత్‌తో పాటు మరో ఇద్దరు కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తారు”అని చెప్పారు. దర్శకుడు పరుచూరి మురళి మాట్లాడుతూ “కథ నచ్చి ఇద్దరు హీరోలు నటించడానికి అంగీకరించారు. వారిద్దరి గొంతులు చాలా బావుంటాయి. నారా రోహిత్ ఇలాంటి కథను ఒప్పుకోవడం వల్ల అతనికి భవిష్యత్తులో మరిన్ని కొత్త కథలు వస్తాయి. చాలా వైవిధ్యమైన సినిమా ఇది. రెండు షెడ్యూళ్లలో పూర్తిచేస్తాం. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. ఇందులో కామెడీతో పాటు అన్ని అంశాలు పుష్కలంగా ఉంటాయి”అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలుః గోపీ, కెమెరాః విజయ్ సి.కుమార్, మ్యూజిక్‌ః సాయికార్తీక్, ఎడిటర్‌ః మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్‌ః ఆర్.కె.రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ః ఎం.సీతారామరాజు.

Comments

comments