Search
Tuesday 12 December 2017
  • :
  • :
Latest News

అరబ్‌షేక్‌ల ఆగడాలను ఆపాలి

షేక్‌లతో పేద ముస్లిం పిల్లల చట్టవ్యతిరేక పెళ్ళిళ్లను  అరికట్టేందుకు ఏమి చేస్తున్నారో తెలపాలని  తెలుగు రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశం

                       High-Court

మన తెలంగాణ/హైదరాబాద్ : పేద ముస్లిం ఆడపిల్లల్ని పెళ్లిళ్లు చేసుకునే అరబ్‌షేక్‌ల ఆగడాల్ని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఖాజీల పాత్ర కీలకమని,వారి స్వార్ధప్రయోజనాలు, దుర్వినియోగాలను నిరోధించాలని అన్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టా లు చేయాల్సిన అవసరం ఉందని  హైకోర్టు న్యాయమూర్తి ఎస్. వి.భట్ పేర్కొన్నారు. వృద్ధ అరబ్‌షేక్‌లు ముస్లిం పిల్లల్ని చట్ట వ్యతిరేకంగా వివాహాలు చేసుకునే దారుణాలను అడ్డుకునేందుకు ఏం చర్యలు  తీసుకుంటున్నారో తెలియజేయాలని కేంద్రంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలను ఆదేశించారు. వెనుకబాటుతనాలను అడ్డం పెట్టుకుని ముస్లిం ఆడపిల్లల్ని అరబ్‌షేక్‌లు పెళ్లి చేసుకునే పద్ధతిపై విధానం ఏమిటో తెలియజేయాలని ప్రభుత్వాలను ఆదేశించారు.

కేంద్ర మహిళాశిశు సంక్షేమ శాఖతో పాటు తెలంగాణ మైనారిటీ సంక్షేమశాఖ, తెలంగాణ వక్ఫ్ బోర్డులను హైకోర్టు సుమోటోగా ప్రతివాదులను చేసి నోటీసులు జారీ చేసింది. ప్రకాశం జిల్లా ఉలవపాడు, సింగరాయకొండ మండలాలకు ఖాజీగా షేక్ అబ్దుల్ ఖరీం, దర్శి పట్టణం, ముండ్లమూరు, కురిచేడు మండలాలకు ఖాజీగా షేక్ బాషాలను నియమిస్తూ గత సంవత్సరం జారీ అయిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ షేక్ చాంద్ బాషా హైకోర్టును ఆశ్రయించిన కేసులో న్యాయమూర్తిపై విధంగా ఇటీవల స్పందించారు. ఖాజీ చట్టం 1880లోని సెక్షన్ 2 ద్వారా జరిగే ఖాజీల నియామకాల తీరుపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని, దీనిపై చర్యలకు 2005లో హైకోర్టు ఆదేశించినా నేటికీ ప్రభుత్వం అమలు చేయకపోవడంపై న్యాయమూర్తి అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఖాజీల చట్టం 1880 ప్రకారం నియమితులయ్యే ఖాజీలకు అధికారాలు, హక్కులు లేవని, ముస్లిం లు వివాహ సమయంలో ప్రభుత్వ ఖాజీనే కాకుండా తమకు నచ్చిన వ్యక్తిని ఎంచుకోవచ్చునని 2005లో బిలాల్ నజ్కీ సారధ్యంలోని బెంచ్ ఇచ్చిన తీర్పును న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో ఉదహరించారు. యాప్‌ల ద్వారా వివాహాల్ని నమోదు చేసి వాటిని ప్రభుత్వాలు రికార్డు చేయాలని, అరబ్‌షేక్‌ల ఆగడాల్ని అరికట్టవచ్చునని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. పిటిషనర్ వాదనలు, ఇటీవల వృద్ధ అరబ్ షేక్‌లు పేద ముస్లింలను పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చిన వాటిని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో ఉదహరించారు. ఈ కీలక కేసు విచారణ సమయంలో హైకోర్టుకు సహకరించాలని తెలంగాణ అడ్వకేట్ జనరల్ డి. ప్రకాశ్‌రెడ్డి న్యాయమూర్తి కోరారు.

Comments

comments