Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

పేరు కమ్మన.. పెయ్యంతా తియ్యన…

custard-apple

సీతాఫల్, సీతాఫలం, సీతా ఫజమ్, షరీఫా… ఎన్ని పేర్లతో పిలిచినా ఆ పండు తియ్యగానే పలుకుతుంది. దక్షిణ అమెరికా, ఆసియాలోని కొన్ని ప్రాంతాలు సీతాఫలం జన్మస్థానాలైనా కస్టర్డ్ యాపిల్, స్వీట్ యాపిల్ పేర ఇది అన్ని దేశాల పండ్ల ప్రేమికులను అలరిస్తోంది. సీజనల్‌గా వచ్చే ఈ పండు ‘డిజెర్’్టగా మారి  భోజనాల బల్ల ఎక్కి కూర్చుంటుంది. భోజనానంతరం స్వీట్ తినేవారి జిహ్వను మాయ చేసి జివ్వున తనవైపు లాక్కుంటుంది. ఒళ్లంతా కళ్లతో ఉండే ఈ పండు ఔషధ గుణాలతో ప్యాక్ అయింది. ఆకులు, చెట్టు, గింజలు… ఏవీ వృథా చేయడానికి వీల్లేకుండా నిలువెల్లా ఔషధాలను నింపుకొన్నాయి. యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరళ్లు, ఫైబర్ పుష్కలంగా అందించే సీతాఫలాలను సీజన్‌కోసారైనా తినకపోతే జన్మ సార్థకమెలా అవుతుంది చెప్పండి? అందుకే ఆలస్యం చేయకుండా ఓ పండు చేతిలోకి తీసుకొని సుతారంగా విప్పి నొటికందించి, నోటిని తీపి చేసుకుంటే పోలా…!?

ఒళ్లంతా కళ్లుండే ఈ పండును విప్పితే కమ్మని వాసన కట్టిపడేస్తుంది. నల్లని గింజలపై ఉండే తెల్లని కండ తీయగా తినాలన్పించేలా ఉంటుంది. పైకి గట్టిగా కనిపించే పండు, విప్పి నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా ఉంటుంది. మనసు వెన్నే కదా అని అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తే కరుకైన గింజ పంటికింద కసుక్కుమంటుంది. ఈ గింజతో కొంత జాగ్రత్తగా వ్యవహరించకపోతే విషమై ప్రాణాలమీదకు తెస్తుంది. ఏదేమైనా అధిక కెలోరీలు, సహజ చక్కెరలు ఉన్న సీతాఫలాన్ని డెజర్ట్‌గా, ఈవెనింగ్ స్నాక్‌గా తీసుకోవచ్చు. నేరుగా, షేక్స్, స్మూతీస్, ఐస్ క్రీమ్స్ ఇలా రకరకాల ఆహారపదార్థాల రూపంలో ఈ పండును వాడుకోవచ్చు. ముఖ్యంగా పాల పదార్థాలంటే ఎలర్జీ ఉన్నవారు వాటికి ప్రత్యామ్నాయంగా పాలతో సమానంగా పోషకాలున్న ఈ పండును తీసుకోవచ్చు.

ఆరోగ్య ప్రదాయని :
విటమిన్ ‘ఎ’ అధికంగా లభించే ఈ పండు చర్మ, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సీజన్‌లో పండు దొరికినన్నాళ్లు తింటూంటే కంటిచూపు మెరుగవుతుంది. చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. సీతాఫలం గుజ్జును పుండ్లు, సెగ్గడ్డలపై రాస్తే ఫలితం ఉంటుంది. సీతాఫలం పైన ఉండే తొక్క దంత సమస్యలను దూరం చేస్తుంది.
* బరువు పెరగాలనుకునేవారు ఈ పండు గుజ్జులో తేనె వేసుకొని తీసుకుంటే ఫలితం ఉంటుంది, ఈ రకంగా బరువు పెరగడం ఆరోగ్యకరం కూడా.
* గర్భిణిలు సీతాఫలం తింటే పుట్టబోయే బిడ్డల మెదడు బాగా ఎదుగుతుంది. పుట్టే బిడ్డల నాడీ వ్యవస్థ బలంగా మారేందుకు దోహదపడుతుంది. రోగ నిరోధక వ్యవస్థ మెరుగవుతుంది. పండును రోజూ తీసుకోవడం వల్ల మిస్‌క్యారేజ్ రిస్క్ దూరమవుతుంది. మార్నింగ్ సిక్‌నెస్ తగ్గి డెలివరీ సమయంలో లేబర్ పెయిన్స్ ను తగ్గిస్తుంది. ఈ పండును ప్రతిరోజూ తీసుకోవడం వల్ల బాలింతల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది.
* వీటిలో ఉండే విటమిన్ బి6 బ్రాంకియల్ వాపును తగ్గించి ఆస్తాను నివారిస్తుంది.
* సీతాఫలంలో ఉండే మెగ్నీషియం గుండె నొప్పి రాకుండా చేస్తుంది. కండరాలు రిలాక్స్ అయ్యేలా చేస్తుంది.
* దీన్లో ఉండే కాపర్(రాగి), డయటరీ ఫైబర్ జీర్ణక్రియకు సహకరిస్తుంది. బవెల్ మూమెంట్‌ను తేలికచేసి మలబద్ధకాన్ని నివారిస్తుంది. అతిసారం వేధిస్తూంటే సీతాఫలంపండు గుజ్జును ఎండలో ఎండబెట్టి పొడిచేసుకుని తాగాలి, ఇది త్వరగా తేరుకునేలా చేస్తుంది.
* సీతాఫలాల్లో ఉండే డయటరీ ఫైబర్ మధుమేహులకు మేలు చేస్తుంది, ఇది షుగర్ అబ్సార్పన్ రేటును తగ్గించి టైప్-2 మధుమేహం బారిన పడకుండా కాపాడుతుంది.
* సీతాఫలంలో అధికంగా ఉండే పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటును నియంత్రిస్తాయి. రక్తపోటు స్థాయిల్లో ఫ్లక్చువేషన్స్ ఉండేవారు ఈ పండును రోజూ తీసుకుంటే బిపిని నియంత్రించవచ్చు.
* కొలెస్ట్రాల్ తగ్గించడంలో దీన్లో ఉండే నియాసిన్, డయటరీ ఫైబర్లు ఉపయోగపడతాయి.
* స్టిమ్యులెంట్, కూలెంట్‌గా పనిచేసే సీతాఫలంలో ఉండే ఐరన్ రక్తహీనతను తరిమేస్తుంది. శక్తినిచ్చి కండరాల బలహీనతను నివారిస్తుంది.
* ఈ చెట్టు బెరడులో ఉండే ఆస్ట్రింజెంట్ నిల్వలు క్యాన్సర్ కారకాలను నిలువరిస్తాయి. అలాగే పండులో ఉండే అసిటోజెనిన్, ఆల్కలాయిడ్స్ క్యాన్సర్ రిస్క్‌ను, రీనల్ ఫెయిల్యూర్ రేట్‌ను తగ్గిస్తాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ పనితీరుపై వ్యతిరేక ప్రభావం చూపి వాటిని న్యూట్రల్ చేస్తాయి.
* బి కాంప్లెక్స్ విటమిన్లు పొందాలంటే సీతాఫలాన్ని మించిన పండు లేదు. బ్రెయిన్‌లో జిఎబిఎ న్యూరాన్ కెమికల్ లెవెల్స్‌ను నియంత్రించి స్ట్రెస్ బారిన పడకుండా కాపాడుతుంది. డిప్రెషన్ దరిచేరకుండా చేస్తుందిది. పార్కిన్సన్స్ జబ్బు రాకుండా కాపాడుతుంది. వంద గ్రాముల సీతాఫలంలో 0.6 గ్రాముల విటమిన్ బి6 లభిస్తుంది.

ఇతర లాభాలు :
* మహిళలు నెలసరి సమయంలో సీతాఫలం చెట్టు ఆకులతో ఇంటిని డెకొరేట్ చేస్తే, ఆరోగ్యకర రక్తసరఫరాకు దోహదం చేస్తుందిది.
* పచ్చి సీతాఫలం కాయ రసం పురుగు కుట్టిన విషానికి విరుగుడుగా పనిచేస్తుంది.
* సీతాఫలం ఆకుల పేస్ట్‌ను పుండ్ల దగ్గర కట్టుగా వేస్తే వెటనే ఉపశమనం లభిస్తుంది.
* రుమాటిక్ నొప్పులనుంచి ఉపశమనం పొందాలంటే సీతాఫలం ఆకులను వేడి నీళ్లలో వేసుకుని స్నానం చేయాలి.
సీతాఫలంతో స్వీట్లు –

సీతాఫల్ ఫిర్ని :
కావల్సిన పదార్థాలు : పాలు ఒకటిన్నర కప్పులు, రెండు టేబుల్ స్పూన్ల బాస్మతి రైస్, చక్కెర 4 టేబుల్‌స్పూన్లు(పొడి చేసింది), సీతాఫలం పండు గుజ్జు(గింజలు లేకుండా) పెద్ద కప్పు. డ్రై ఫ్రూట్స్ గార్నిషింగ్ కోసం, ఇలాచీ పొడి కొద్దిగ.
తయారుచేసే విధానం : బియ్యాన్ని మిక్సీలో వేసి పొడిచేసుకోవాలి. పాలల్లో బియ్యంపిండి పొడిని వేసి అడుగంటకుండా కలుపుతూ మరిగించి దాన్లో చక్కెర కలపాలి. చక్కెర పూర్తిగా కరిగాక పొయ్యి మీద నుంచి దించి కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారింతర్వాత సీతాఫలం గుజ్జును పాలలో కలిపి, ఇలాచీ పొడి వేసి పైన డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేయాలి. దీన్ని చల్లగా సర్వ్ చేస్తే బాగుంటుంది.

సీతాఫలంలో ఉండే పోషక విలువలు: 

పోషకాలు                                 స్థాయిలు

ప్రోటీన్లు                                    5.2గ్రాములు
నీటిశాతం                                 183గ్రాములు
బూడిద                                    1.9గ్రాములు
కెలోరీలు                                  235 గ్రాములు
కార్బోహైడ్రేట్స్                           59 గ్రాములు
ఫైబర్                                       11 గ్రాములు
ఫ్యాట్                                       725 మిల్లీగ్రాములు
విటమిన్ ఎ                               15ఐయు
విటమిన్ సి                              91 మిల్లీగ్రాములు
థయామిన్                               275 ఎంసిజి
రిబోఫ్లెవిన్                                 283 ఎంసిజి
నియాసిన్                                 2.2 ఎంజి
విటమిన్ బి6                             500 ఎంసిజి
పోలేట్                                       35 ఎంసిజి
కాల్షియం                                   60 మిల్లీగ్రాములు
ఐరన్                                         1.5మిల్లీగ్రాములు
మెగ్నీషియం                              53 మిల్లీగ్రాములు
ఫాస్పరస్                                   80 మిల్లీగ్రాములు
పొటాషియం                               618 మిల్లీగ్రాములు
సోడియం                                    23 మిల్లీగ్రాములు
జింక్                                           250ఎంసిజి
కాపర్                                          215 ఎంసిజి
సెలీనియన్                                  1.5 ఎంసిజి

Comments

comments