Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

ఉద్యమ ఆకాంక్షలు ఆవిరి

మాయమాటలతో ఎల్లకాలం మభ్యపెట్టలేరు
జనగామ నుంచి సిపిఐ పోరుబాట

CPI

జనగామ : ఉద్యమ సమయంలో ప్రజలలో వ్యక్తమైన ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పని చేయడం లేదని, మాయమాటలతో ఎల్లకాలం మభ్యపెట్టలేరని సిపిఐ పోరుబాట ప్రారంభ వేదిక నుంచి పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని సిఎం కెసిఆర్‌ను ఉద్దేశించి సూటిగా ప్రశ్నించారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ‘సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి’ కోసం చేపట్టిన ‘పోరు బాట’ శుక్రవారం జనగామ జిల్లా కేంద్రంలో ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమైంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి నేతృత్వంలో పది మంది ప్రజాసంఘాల నాయకులు అరవై రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ బస్సు యాత్రలో పాల్గొంటున్నారు. పోరుబాట ప్రారంభం సందర్భంగా జనగామలో శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరావ్‌ు, కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపి రవీంద్ర నాయక్, ప్ర జా యుద్ధనౌక గద్దర్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ విమలక్క, కె. గోవర్ధన్ (న్యూడెమోక్రసీ), జానకిరాములు(ఆర్‌ఎస్‌పి), బండా సురేందర్‌రెడ్డి(ఫార్వర్డ్ బ్లాక్), నాయక్(ఎంసిపిఐ(యు), తదితరులు పాల్గొన్నారు. నారాయణ మాట్లాడుతూ అందరి కలిసి ఉద్యమి స్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, కాని కెసిఆర్ ఆ ఘనతను దక్కించుకొని ఎన్నికల్లో గెలిచారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలను కెసిఆర్ జమ్మిచెట్టు ఎక్కించారని విమర్శించారు. జనగామ ఎంఎల్‌ఎ యాదగిరిరెడ్డి చెరువు భూమి కబ్జా చేశారని స్వయంగా జిల్లా కలెక్టర్ నిర్ధారించినా చర్యలు తీసుకోవడం లేదన్నారు. కలెక్టర్‌ది తప్పైతే ఆమెను సస్పెండ్ చేయాలని, లేదంటే ఎంఎల్‌ఏలను జైళ్ళో పెట్టాలన్నారు. సబ్బండ వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణను సాధించుకున్నామని, 40 నెలల కెసిఆర్ పాలనలో సామాజిక న్యాయం జరగలేదని ఎల్.రమణ విమర్శించారు. బతుకమ్మ చీరల కుంభకోణంలో వచ్చిన డబ్బులను సింగరేణి ఎన్నికల్లో గుప్పించి కెసిఆర్ గెలిచారన్నారు. కోదండరావ్‌ు మాట్లాడుతూ స్వరాష్ట్రంలో కేవలం కొంత మంది ప్రయోజనాలకు అనుగుణంగానే అభివృద్ధి జరుగుతున్నదన్నారు. అభివృద్ధి పేరుతో కొంత మంది కాంట్రాక్టర్లు, కార్పొరేట్ శక్తులు, రియల్ ఎస్టేట్ ఏజెంట్‌లకు లబ్ది చేకూరుస్తున్నారన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజాస్వామిక, సామాజిక తెలంగాణ కోసం ఉద్యమ బాట తప్పదని, సమష్టిగా, సమైక్యంగా ప్రయత్నం సాగాలన్నారు. తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ప్రజలు కోరుకున్నది బంగారు తెలంగాణ కాదు బతుకు తెలంగాణ అని అన్నారు. అభివృద్ధి అంటే రోడ్లు వేయడం, బిల్డింగ్‌లు కట్టడం కాదన్నారు. కెసిఆర్ ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా అప్రజాస్వామికంగా, అబద్ధాలతో పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. గద్దర్ మాట్లాడుతూ అభివృద్ధి అంటే పై నుండి కాకుండా కింది నుండి సాగాలని, గ్రామాలు పునాదులుగా సర్పంచ్‌లకు నిధులు ఇవ్వాని డిమాండ్ చేశారు. మాజీ సర్పంచ్, ఎంపిటిసి, జెడ్‌పిటిసిలకు పెన్షన్‌లు ఇవ్వాలన్నారు. జర్నలిజాన్ని ప్రభుత్వ రంగంగా గుర్తిం చి, వారికి రూ.30వేలు ఇవ్వాలన్నారు. విమలక్క మాట్లాడుతూ సింగరేణి ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఏ స్థాయికి దిగజారారో చూశామని, రాబోయే ప్రమాదపరిస్థితులను ఎదుర్కోవాలంటే అందరూ ఐక్యంగా పోరాడాలన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సామాజిక న్యా యం జరగాలని గోవర్ధన్ అన్నారు
ప్రజల జీవితాల్లో వెలుగు నింపేందుకే పోరుబాట : చాడ
భవిష్యత్తులో తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగు నిం పేందుకే పోరు బాట చేపట్టామని చాడ వెంకట్‌రెడ్డి చెప్పా రు. కెసిఆర్ దుష్టపాలనను ప్రజల్లో ఎండగడతామని, హామీలు మరిచిన ముఖ్యమంత్రి కళ్లు తెరిపించేందుకు పోరాటం ఉధృతం చేస్తామన్నారు. గొర్రెలపంపణీలో పెద్ద ఎత్తున గోల్‌మాల్ జరిగిందని, త్వరలో లెక్కలతో సహా బైట పెడతామని చెప్పారు. ఇప్పటి వరకు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఎంఎల్‌ఏలు, ఎంపిలను కొనుగోలు చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ చివరకు దిగజారి సింగరేణిలో కూడా కార్మికుల తలలకు వెలగట్టారని మండిపడ్డారు. తెలంగాణ వచ్చాక బతుకులు మారుతాయనుకుంటే భూ ములు మళ్ళీ దొరల చేతుల్లోకే వెళ్తున్నాయన్నారు. జనగామ జిల్లా సిపిఐ కార్యదర్శి, మాజీ ఎంఎల్‌ఏల సి.హెచ్. రాజారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో సిపిఐ నాయకులు సయ్యద్ అజీజ్‌పాషా, పల్లా వెంకట్‌రెడ్డి, టి.శ్రీనివాసరావు, పశ్య పద్మ, ఈర్ల నర్సింహా, పోరు బాట బృందం బాల మల్లేశ్, ఎం.డి.యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments