Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

ఊరూరిలో… గంపలు గుల్లలు పెండతట్టలవ్వో….

Handi-Crafts

ఊల్లెకు పగటిపూట గంపలు, గుల్లలు పెండతట్టలు అమ్మెటోల్లు వస్తుంటిరి. ఈతగంపలు పెండతట్టలు ఎరుకలవాల్లు తయారుచేస్తరు. వాయిలి కట్టెలతోని చేసుడు ఉంటది. పెండతట్ట అంటే రోజు పొద్దుగల ఎడ్ల కాడ పెండ ఎత్తుకపోయేటిది. గంపలు రెండు మూడు రకాల సైజులు ఉంటయి. వీటిని సుత ఈత బరిగెలతోని చేస్తరు. వీటిని నెత్తిల ఒకదాని మీద ఒకటి పేర్చుకొని తెచ్చి అమ్ముతరు. ఆకాలంల అగ్గువకే అమ్మేది. కుంచెడు వడ్లు పోస్తే రెండు మూడు గంపలు ఇచ్చేటోల్లు గంపలు అల్లడం వాల్లు అలవోకగా చేస్తరు గని అది ఒక కళ. వాల్ల చేతుల్లనే ఆ కళ ఉంటది.

మొగోల్లు వాయిలి బరిగెలు తీసుకవస్తే చీరి ఆడోల్లు మొగోల్లు ఎవలకు వాల్లే యాప చెట్ల కింద కూసోని అల్లుతరు. అల్లికొని ఊర్లల్లకు తిరిగి అమ్ముతరు. అట్లనే మేదరివాల్లు కంకగంపలు తయారు చేస్తరు. కంక బొంగులను పుల్లలు పుల్లలుగా చీరి గంపలను, గుల్లలను తయారుచేస్తరు. వాటిని కూడా ఊరూరికి తిరిగి అమ్ముతరు. వీటికి గిరాకీ ఎక్కువ ఉంటది. తక్కువ తయారు అయితై. కని రేటు పెద్దగ పెట్టరు కష్టం ఎక్కువ ఉంటది చేతిల పైకం తక్కువ వస్తయి. కంకతోని ఇంటింటికి అవసరమైన చాటలు చేస్తరు. చాట ద్వారా బియ్యం చెరుగుడు ఉంటది. బియ్యంలో రాళ్ళు పురుగులు వేరు చేయడం చాట ద్వారానే అయితది. ఇంటింటికి రోజు అవసరం అయ్యే వస్తువు చాట. అట్లనే మొంటె ఉంటది అది చిన్న చాట. పప్పులు ఇతర అన్నింటిని చెరిగేందుకు వీటిని వాడుతరు.

మేదరివాల్లు ఊరూరికి ఉండరు ఐదు పది ఊర్లకు కొన్ని ఇండ్లు ఉంటయి. మేదరి కర్రతోని రకరకాల బుట్టలు చేస్తరు. ఇంకా పూర్వకాలంల తడకలు ఉండేటివి. ఇల్లు పెద్దగ ఉంటే ఇంట్ల అన్నదమ్ములు ఏరుపడితే ఇద్దరి సందుల తడుక పెట్టుకుంటరు. ఇది ఇప్పటి ముచ్చటకాదు. పేదరికం ఉన్న కాలంల ఇట్లనే ఉండేది. ఇప్పుడు తడకలు లేవు. ఆ అవసరం లేదనుకోవచ్చు. అట్లనే పొనుకలు చేసేవాలు ఉంటరు. పొనుకలు వడ్లు జార గొట్టేందుకు పనికి వస్తది. జొన్నలు కంకులు బాయి కాన్నుంచి ఇంటికి తెచ్చుడు. ఇంటి కాన్నుంచి అంగడికి పట్టకపోవుడు పని పొనుకల్లల్ల పట్టుకపోతరు.

పొనుకలు గాకుండా బోరెంలు కూడా ఉంటయి వీటిని జనుముతోని తయారుచేస్తరు. ఒక్క బోరెం కొనుక్కుంటే ఇరువై ఇరువై ఐదు ఏండ్లు ఉంటది. ఊర్లల్లకు ఎవసాయదారుని అవసరమైన అతేరాలు ఇసిరెలు అన్ని వచ్చేటివి వాటిని నగదుపైసల ద్వార కాదుగాని అదలబదలు కొనుక్కునేది మనం వడ్లు జొన్నలు ఇస్తే వాల్లు వస్తువులు ఇస్తరు. అట్లనే నడిచేది.

ఊర్లకు అమ్మెతందుకు వచ్చే కందగడ్డ, ఉప్పు, ఎర్రమన్ను, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ ఇసొంటి వస్తువులు కూడా ఎడ్లబండి మీద ఊల్లెకు తెద్దురు, వాటిని కూడా వడ్లు జొన్నలకు మార్పిడి చేసికుంటరు. అట్లనే బొంబాయి మిఠాయి, ఐసొక్రోట్ ఇట్ల ఎవ్వి ఊర్లర్లకు వచ్చినా అమ్ముడుకొనుడు జరిగేది. కొన్ని ఊర్లల్ల బండ్లను నాలుగుబాటల కాడ నిలబెట్టి ఒక మనిషి ఊరంత పోయి గవ్వి అమ్ముతన్నం అని దండోరా ఏసినట్టు చెప్పి వచ్చేది అటెన్క అవసరం ఉన్నవాల్లు చాట్ల వడ్లు పోసుకొని ఇవి వాల్లకు ఇచ్చి కావల్సిన వస్తువులు కొనుక్కవచ్చుకునేవాల్లు.

గంపలు, శాటలు, మెంటెలు, చీపుర్లు, పెండతట్టలతోపాటు కొడవండ్లు, గొడ్డండ్లు సుత బయట కమ్మర్లు వచ్చి అమ్మెటోల్లు. కత్తులకు కత్తెరలకు సానపెట్టెటోల్లు కూడా ఊర్లకు వస్తుంటారు. ఊరు ఒక అవసరాల కూడలి. అందరు ఊర్లోల్లకు అవసరం. ఊరు అందరికి అవసరం. కావాల్సిన వస్తువు ఊరిముంగిట్లకే వచ్చేది. ఇప్పుడైతే సూపర్ మార్కెట్లకు పోయి అవసరం ఉన్నా లేకున్నా కార్డ్ పెట్టి సరుకులు తెచ్చుకుంటున్నకాలం అయితె అదిగాని ఇది గానీ గొప్పదని చెప్పుడు కాదు అదొక చరిత్ర.

అన్నవరం దేవేందర్,
9440763479

Comments

comments