Search
Wednesday 20 June 2018
  • :
  • :

రైతును ముంచిన వర్షాలు

1.63లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
81953 మంది రైతులకు దుఃఖం
పత్తి, వరి పంటలకు తీవ్ర నష్టం
కొనేనాథులు లేని తడిసిన పంటలు

Loss-to-Farmer

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు 1.63 లక్షల ఎకరాల్లో పంటలు నీటి పాలయ్యాయి. ప్రధానంగా పత్తి, వరి, మొక్కజొన్న పంట లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీని ఫలితం పంట దిగుబడితో పాటు మద్దతు ధరపై చూపనుంది. అత్యధికంగా 1.33 లక్షల ఎకరాలలో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. వరి 26410 ఎకరాల్లో నీట మునిగింది. ఈ మేరకు పంట నష్టంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రాథమికంగా నివేదించింది. భారీ వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 866 గ్రా మాలలోని 81953 మంది రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. అత్యధికం గా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, పెద్దపల్లి, కరీంనగర్, కామారెడ్డి జిల్లాలోని పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ తన నివేదికలో పేర్కొంది. ఒకప్పుడు వానలు ఏ సమయంలో పడుతాయి.. ఎండ ల తీవ్రత ఎలా ఉండనుందని తమకు తా ము అంచనాకు వచ్చే అన్నదాతలు ఇప్పుడు వాతావరణాన్ని పసిగట్టలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం కాలుష్య ప్రభావంతో చోటు చేసుకుంటున్న మార్పులేనని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
పత్తి ఏడిపిస్తోంది : ప్రస్తుతం కురుస్తున్న వానలకు అధికంగా నష్టం వాటిల్లిన పంట పత్తి. రాష్ట్రంలో అత్యధికంగా 47.17 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇందులో 1.33 లక్షల ఎకరాల్లో పత్తి నీటి పాలైంది. పత్తి రంగు కూడా మారుతోంది. తెల్లబంగారాన్ని చూసి మురవాల్సిన  రైతు… వానలతో చేనులో తడిసి ముద్దైపోతున్న దూదిని చూసి కన్నీళ్లు పెట్టుకుం టున్నారు. ఇప్పటికే పత్తికి మద్దతు ధర రాక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు చెట్ల మీద ఉన్న పత్తి వానలకు తడిచి మొత్తానికే చేతికి రాకుండా పోతుంది.
వరి దిగుదుడుపే ..! : భారీ వర్షాలతో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికే వరి పైర్లు నెలకోరగా, మారిన వాతావరణ పరిస్థితులతో పంటలకు తెగుళ్లు ఆశిస్తున్నయి. ఇది వరి దిగుబడులపై తీవ్రమైన ప్రభావం చూపనుంది. ఈ మేరకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ఇప్పటికే రైతుల దగ్గర నుంచి వందల సంఖ్యలో పోన్‌లు వస్తున్నట్లు వరి పరిశోధన ప్రధాన శాస్త్రవేత్త ఆర్ జగదీశ్వర్ మన తెలంగాణకు తెలిపారు. సుడి దోమ, కాండం తొలిచే పురుగు వరికి సమస్యాత్మకంగా మారాయని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గింజ రంగు మారుతోంది. ఈ ఏడాది వానకాలంలో 18.85 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. సాధారణ సాగు అంచనాకు 4.22 లక్షల ఎకరాలు తక్కువగా సాగు నమోదైంది. ఇప్పుడు వానలతో వరి పైర్లు నెలకోరుగుతుండగా, తెగుళ్లు కూడా పంటను నాశనం చేస్తున్నాయి.
లెక్కలోకి రాదాయే !: వానకాలంలో ముందస్తు విత్తిన పంటల ఉత్పత్తులు అమ్ముకునేందుకు రైతులు మార్కెట్‌కు తీసుకోస్తున్నారు. ఈ క్రమంలో తడిసినవి అసలు లెక్కలోకి రావడం లేదు. పంట తడిచి పాడైందని నాణ్యతకు కొర్రీలు పెడుతూ ఎంతో కొంత సొమ్ము ఇచ్చి కొనుగోళ్లు చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మొక్కజొన్నలది అదే పరిస్థితి.
ఈసారీ సోయా విత్తనం ముంచుతుందా..
సోయా విత్తన పంటపై ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. ఈ ఏడాది పంట బాగుడటంతో లక్ష క్వింటాళ్లలో సోయా విత్తన దిగుబడి వస్తుందని రాష్ట్ర విత్తన కార్పొరేషన్, ధ్రువీకరణ అథారిటీ అంచనా వేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో రైతులు సోయా విత్తన పంటను సాగు చేస్తున్నారు. గత ఏడాది ఇదే సమయానికి భారీ వర్షాలతో ఏకంగా 2.50 లక్షల ఎకరాల్లో విత్తన పంట నీటి పాలైంది. రైతులకూ నష్టాలు మిగిలాయి. ఈసారి వానలతో అదే జరుగుతుందేమోనని అధికార యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
అధిక పంట నష్టం వాటిల్లిన జిల్లాలు
జిల్లా గ్రామాలు పంట విస్తీర్ణం (ఎకరాల్లో)
కరీంనగర్ 128 వరి 9891
మహబూబ్‌నగర్ 195 పత్తి 46381
నాగర్‌కర్నూల్ 106 పత్తి 81008
కామారెడ్డి 10 వరి 4153
ఇతర జిల్లాలతో కలిపి మొత్తం నష్టం 1.63 లక్షల ఎకరాలు

Comments

comments