Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

భారత్ వృద్ధి రేటు తగ్గింపు….

2017లో జిడిపి అంచనా 6.7 శాతానికి కోత, మధ్యకాలికంగా పురోగతి ఉండనుంది, నివేదికలో ఐఎంఫ్ వెల్లడి

IMFవాషింగ్టన్ : భారత్ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి రేటులో ఐఎంఎఫ్(అంతర్జాతీయ ద్రవ్య నిధి) కోత విధించింది. 201718 ఆర్థిక సంవత్సరానికి గాను వృద్ధి రేటును 6.7 శాతంగా అంచనా వేసింది. ఈమేరకు వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్ నివేదికలో పేర్కొంది. అయితే ఏప్రిల్ జులైలో ఇదే ఐఎంఎఫ్ భారత్ వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంటుందని అంచనా వేసిన విషయం తెలిసిందే. అంటే రెండో త్రైమాసికంలో భారత్ వృద్ధి రేటు అంచనాలో 0.5 శాతం కోత విధించింది. 201819 ఆర్థిక సంవత్సరంలోనూ భారత్ జిడిపి 7.7 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గనుందని అంచనాలో పేర్కొంది. భారత్ వృద్ధి రేటు మందగించడానికి కారణం డీమానిటైజేషన్(నోట్ల రద్దు), జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) అమలేనని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. ఈ సంస్కరణల అమలుతో భారత్ వృద్ధి రేటుపై గణనీయమైన ప్రభావం పడిందని అక్టోబర్ నివేదికలో సంస్థ వెల్లడించింది. 2017 తొలి త్రైమాసికం(ఏప్రిల్ జులై)లో భారత్ వృద్ధి రేటు 5.7 శాతానికి అంటే మూడేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన విషయం తెలిసిందే. అదే సమయంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ట్యాగ్‌ను భారత్ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అయితే చైనా మాత్రం 2017లో 6.8 శాతంతో జిడిపి వృద్ధి రేటును స్వల్పంగా మెరుగుపర్చుకుంది. అయితే మధ్యకాలికంగా చూస్తే పరోక్ష పన్ను వ్యవస్థలో భారత్  వృద్ధి రేటులో గణనీయమైన మెరుగుదల కనిపించనుందని ఐఎంఎఫ్ ఆశాభావం వ్యక్తం చేసింది. దేశీయ ప్రభుత్వ గణాంకాలు కూడా జిడిపి అంచనాల్లో కోత విధించాయి. ఇప్పుడు అంతర్జాతీయ సంస్థ ఐఎంఎఫ్ కూడా భారత్ వృద్ధి రేటులో కోత విధించడం, దీనికి జిఎస్‌టి, నోట్ల రద్దు ముఖ్య కారణాలని చెప్పడం ప్రభుత్వానికి మింగుడుపడని విషయమని చెప్పాలి. ప్రస్తుత జిడిపి గణాంకాలు చూస్తే భారత్ ఇప్పటికీ చైనా వెనుకే ఉంది.  2016 నవంబర్ 9న మోడీ ప్రభుత్వం పెద్ద నోట్ల ను రద్దు చేయడం వల్ల నగదు కొరత పెరగ్గా, ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రభావంతో దేశీయ ఆర్థిక వృద్ధి రేటును కృంగదీసిందని నిపుణులు భావిస్తున్నారు.

Comments

comments