Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

ప్రజా వ్యతిరేక విధానలపై విపక్షాల పోరుబాట

POLICE

* సమస్యల జెండానే ఎజెండా 8 పత్తి కొనుగోలు వైఫల్యమే అస్త్రంగా పోరు

వివిధ పంటల కొనుగోలు వ్యవహారంలో కొనసాగుతున్న యంత్రాంగం వైఫల్యాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న పలు ప్రజా వ్యతిరేక విధానాలను లక్షంగా చేసుకొని ప్రతిపక్షాలు ఎదురుదాడికి సన్నద్ధం అవుతున్నాయి. కాంగ్రెస్, బిజెపిలు వేర్వేరు ఎజెండాలతో పోరుబాటకు నడుం బిగిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లా అంతటా వివాదాస్పదంగా మారుతున్న పత్తి కొనుగోలు వ్యవహారాన్ని అస్త్రంగా మలుచుకుంటూ ఉద్యమంలో రైతులను భాగస్వామ్యులను చేసేందుకు ప్రతిపక్షాలు వ్యూహరచన చేపట్టాయి. ఆదిలాబాద్, భైంసా, ఇచ్చోడ, గుడిహాత్నూర్, బోథ్, ఇంద్రవెల్లి, నేరడిగొండ తదితర ప్రాంతాలలో ప్రస్తుతం పత్తి కొనుగోలు వ్యవహారం వివాదాస్పదంగా మారుతుంది. తేమ విషయంలో అధికారులు మెలికలు సృష్టిస్తూ వ్యాపారులకు మేలు చేకూర్చే విధంగా వ్యవహరించడం రైతుల ఆగ్రహానికి కారణమవుతున్న సంగతి తెలిసిందే. గత మూడు రోజుల నుంచి సీసీఐ అధికారుల నిర్వాకం కారణంగా జిల్లా అంతటా రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని యంత్రాంగం తగిన
చర్యలు చేపట్టకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి మాదిరిగానే సీసీఐ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై సిండికేట్ రూపంలో రైతును మోసం చేసే వ్యూహానికి పదును పెడుతున్నారు. దీనిపై రైతులు మండిపడుతూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశాలను కాంగ్రెస్, బిజెపిలు అస్త్రంగా మలుచుకుంటూ అధికార పార్టీని చులకన చేసేందుకు ఎత్తుగడలు సిద్దం చేస్తున్నాయి. ఇప్పటికే ఆదిలాబాద్ మార్కెట్‌లో కాంగ్రెస్ రైతుల ఆందోళనకు మద్దతు తెలపడమే కాకుండా అధికారుల తీరు మారే వరకు పోరుబాట చేపట్టేందుకు నిర్ణయించింది. అలాగే బిజెపి కూడా ఇదే బాటను అనుసరిస్తూ రైతుల పక్షాన నిలబడి ఆందోళనలకు రూపకల్పన చేస్తుంది. పత్తి కొనుగోలు వైఫల్యాన్ని ఎజెండాగా చేసుకొని కాంగ్రెస్, బిజెపిలు చేస్తున్న వేర్వేరు ఆందోళనలకు రైతుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. చిలికిచిలికి గాలివానలాగా ఈ ఆందోళనలు అధికార టీఆర్‌ఎస్ పార్టీ మెడకు చుట్టుకోబోతున్నాయని అంటున్నారు. ఇప్పటికే మినుము పంట కొనుగోలు విషయంలో మార్క్‌ఫెడ్ వైఫల్యాల కారణంగా ప్రభుత్వ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఆ వైఫల్యాలను కప్పి పుచ్చుకొనే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే మళ్లీ పత్తి కొనుగోళ్ల వ్యవహారం అధికార టీఆర్‌ఎస్ పార్టీని ఆత్మరక్షణలో పడేసిందని అంటున్నారు. మరికొద్ది రోజులలోనే వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఐకేపీ కొనుగోలు కేంద్రాలపై విమర్శలు వెల్లువెత్తడమే కాకుండా చాలా చోట్ల ఆర్థిక పరమైన ఆరోపణలు వస్తున్నాయి.
దీనికి తోడుగా కోట్లాది రూపాయలతో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలను కూడా ప్రతిపక్షాలు అస్త్రాలుగా మలుచుకోవాలని భావిస్తున్నాయి. అలాగే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం టీఆర్‌టీ ప్రకటన స్థానికత అంశంతో, ఖాళీల వ్యవహారాన్ని కూడా లక్షంగా చేసుకొని నిరుద్యోగుల మద్దతు కూడగట్టాలని కాంగ్రెస్, బీజేపీలు వేర్వేరుగా వ్యూహరచన సాగిస్తున్నాయి. మొత్తానికి అధికార టీఆర్‌ఎస్ పార్టీని లక్షంగా చేసుకొని ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపిలు ఇలా పోరుబాట ఉధృతం చేసే యోచనలో ఉన్నాయని అంటున్నారు.

Comments

comments