Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

పో వాన.. నిన్నేం అననులే..

                        Toddy-Tree

మధ్యాహానం. ముందంతా చిన్న యెండ. వెనక్కి తిరిగి చూస్తే కాస్త దూరంగా నల్లని మేఘాలు. వాన వచ్చేస్తోంది. ఆదివారం అయినప్పటికీ రోడ్స్ అన్నీ పూర్తిగా వాహనాలతో నిండి వున్నాయి. యింక దారులన్నీ నీళ్ళే… కాలవలే… ట్రాఫిక్ లో యీ కారుతో స్పీడ్ బోట్ యెఫెక్ట్ లో వెళ్ళాల్సిందే యీ రోజు కూడా అనుకుంటుండగానే వాన పెద్ద పెద్ద శబ్ధాలతో.

రుతువులు గాడి తప్పటం అంటే యేమిటో మనం మన కళ్ళతోనే చూస్తున్నాం. యెలా వుండాలి యీ కాలం… పగలంతా లేత యెండా. మునిమాపు వేళ యెర్రని సూర్యబింబం సోమరిగా కొండల్లోకి జారుకొనే వేళ నిద్ర మబ్బు తొలగించుకొని చలి వొళ్ళు విరుచుకొంటుంటే వెలిగే నక్షత్ర దీపాల వెలుగులో బంతిపూలు చామంతులు మరింత మునగ దీసుకొంటుంటే యెన్నెన్ని మోహపూరిత స్వప్నాలో విరగకాసేకాలం కదా. మరి యీ ఆదుర్దా వానలేమిటి.

‘పెరట్లో విరగ కాసిన గుమ్మడి పూలు రాలి పోతున్నాయి’ అని మొన్నో మిత్రుడు వాపోయారు. రాలిపోవా… ఎం యెందుకంటే పగలంతా యెండకి కాగిన తెల్లని గుమ్మడి పూలు రాత్రంతా మంచుని మేసి పెరట్లో పింద్లై మెల్లగా బూడిద రంగు నిండు కాయలవుతాయి. రాలిపోవా వాటికి మంచు కావాలాయే.

మంచు యెండా వూసే లేని యీ కుంభవృష్టి వెనక ప్రపంచ వ్యాప్తంగా జరిగిన మానవ నిర్లక్ష్యం వుంది. ప్రకృతి పట్ల గౌరవం లేదు. సముద్ర తీరాన్ని, అడవులని, చెరువుల్ని అన్నింటిని మింగేస్తాం. భలే ఆకలి మనకి. గుప్పెడు అన్నంతో తీరే ఆకలి కాదు.
వొక చెరువుని లేదా నాలాని ఆక్రమించి కట్టడాలు కడతారు. వాటికి పర్మిషన్ యిచ్చేది యెవరు. అన్నీ పర్మిషన్స్ యిచ్చేసాక అందులో మనుషులు నివసించటం మొదలు పెట్టాక వాన వచ్చాక నీళ్ళు వెళ్ళడానికి లేదు ఆక్రమణలూ ఆక్రమణలూ అని గగ్గోలు పెడుతూ వాటిని తొలగిస్తాం అంటే అందులోని వాళ్ళు యెక్కడికి వెళతారు.

యేది సక్రమం చేసే పరిస్థితి యీ నగరానికే కాదు యీ దేశంలో యే నగరానికి లేనట్టే వుంది. అయితే మనకి మిగిలిన వాళ్ళకి తేడా యేమిటంటే మనకి చాల చెరువులని కప్పి కట్టటం. నీటి ప్రవాహానికి దారీ లేకపోవటం. మొన్నటికి మొన్న యీ వానల్లోన్నే మెయిన్ రోడ్ దాటి కాస్త ముందుకు వస్తే వొక బస్తీ. ఆ బస్తీ లోంచి మరో మెయిన్ రోడ్ కి వెళ్ళొచ్చు. అక్కడ వో చిన్న సంత జరుగుతోంది. బస్తీ పల్లంలో వుంది. యెత్తు నుంచి వుధృతంగా వాన నీరు. వాళ్ళు ఆ చిన్ని సంతలో పేర్చిన కూరగాయలు, చిన్ని చిన్ని వస్తువులు తీద్దాం అని వారు అనుకునేలోగానే ఆ మొత్తం సంత కొట్టుకుపోయింది. యిస్త్రీ చేసే వాళ్ళు, బళ్లమీద చాయ్ అమ్ముకొనేవాళ్ళు యిలా యీ వానల్లో యిలాంటి నష్టాలు యెన్నెన్నో యెదురు కొంటున్న వాళ్ళు యెందరో.

నదులకి వరదలూ వస్తాయి. ఆ వరద హెచ్చరిక రాగానే వరద వచ్చే ప్రాంతాల వాళ్ళు సామాను మూటలు కట్టి అటక యెక్కించేస్తారు. యెత్తులో వూరికో గుడి వుంటుంది. అందులోకి వెళ్లి పోతారు. అందుకేనేమో యింటి కంటే గుడి పదిలం అనేవారు. ఆయా అధికార్లు ప్రతి చోట తిరిగి తీసుకోవలసిన జాగ్రత్తలు అన్నీ తీసుకొంటారు. అలానే స్కూల్స్ లోనో యేదో వొక భవనంలో వరద బాధితుల శిబిరాలు వుంటాయి. అంతా వొక చోట వుంటారు. ఆ కలిసి వుండటం అన్నది గొప్ప ధైర్యాన్ని యిస్తుంది. కలిసి కట్టుగా వొక కష్టాన్ని యెదురుకోవటంలో ఆత్మ విశ్వాసం వస్తుంది మనసుకి.

నగరాల్లో అలా కాదు. మనకి మన ప్రాంతపు అధికారులు యెవరో తెలీదు. మన పక్క వాళ్ళు యెదుటి వాళ్ళు తెలీదు. పండుగలకి, కిట్టీ పార్టీలకి అపార్ట్మెంట్స్ లో లాబీ లో కలిసే పార్కింగ్ లో కలిసే మనుష్యులు యీ వాన సమస్యలప్పుడు కనీసం పలకరించుకోరు. కింద నీళ్ళు వస్తే పై ఫ్లోర్ కి వెళ్లి వుండటం వీలుకాదు. రమ్మని పిలవరు. కాస్త చొరవ తీసుకొని పలకరిద్దామన్నా అనుమానాస్పదంగా చూస్తారేమోనని లేదా మేనర్స్ తెలీదనుకుంటారని భయం. సిటీలో నలుగురిలో యేకాకితనం వుంటుంది.

సిటీలో యెలాంటి వేళ అయినా 100 కి కాల్ చేస్తే ఖచ్చితంగా పలుకుతారు. అదొక్కటే పెద్ద భరోసా. ప్రతి యేరియాలో వున్న ప్రజలకి ఆయా ప్రాంతాల అధికారులకి మధ్య తెలియనితనం చాలా వుంది. ప్రజలు వాన కస్టాలు చెప్పగలరు. కానీ సంఘటితంగా యెదుర్కొనే పరిస్థితి లేదు. యీ పరిస్థితుల్లో మార్పు రావాలంటే వ్యవస్థే పనిచెయ్యాలి. యీ వ్యవస్థని మార్చినా మార్చక పోయినా నీటి ప్రవాహానికి దారి కల్పించినా కల్పించక పోయినా మ్యాన్ హోల్స్ పై మూతలు వున్నా లేకపోయినా రోడ్స్ యెలా వున్నా యెవరి అధికారానికి వచ్చే నష్టం యేమి లేదు. యెవరు యే పీఠంపై వున్నా పరిస్థితులు యింతే అని ప్రజలకి తెలుసు. యీ కష్టాలకి చికాకులకి యిబ్బందులకి అలవాటై పోవటం తప్పా చెయ్యగలిగేది పెద్దగా యేమి లేదని స్పష్టంగా తెలిసి పోయాక అలవాటై పోవటం తప్పా మరో దారి లేదు వానకి మనుష్యులకి కూడా…

యిలా సాగుతున్నాయి ఆలోచనలు కొన్ని సార్లు పొంతనగా కొన్నిసార్లు పొంతన లేకుండా… మెల్లగా పెరుగుతోన్న నీరు… సరే చూద్దాం…. దిగడానికి కూడా చోటు లేదు… బయట అటూ యిటూ వెళుతోన్న వాళ్ళ మోకాలి లోతు దాటి నీరు… సడన్ గా ఆగిన వాన…. అయినా నమ్మకం లేదు… మళ్ళీ దడదడలాడించదని… సందులు తిరిగి వస్తుంటే కళ్ళకి వొక్కసారిగా తెరిపి.

పున్నాగ చెట్ల గుబురుల్లో పూలని తడిపేసిన వాన. ముక్కా చెక్కల సిమ్మెంట్ రోడ్ రోడ్డంతా పూలే. ఆగిపోయా… యీ పూల మోహపూరిత సౌగంధానికి మనసంతా వొక్కసారిగా ప్రేమపలుకుల దారుల తలుపుల్ని తెరిచేసింది… మనసుకిప్పుడు వో మంచు కురిసే కాలాన్ని వాగ్దానం చేస్తున్నట్టు ఆ పున్నాగలు యేరులై ప్రవహిస్తుంటే అనిపించింది యెంత అందమైన ప్రవాహం… పో వాన… యీ సౌందర్యం క్షణాలని యిచ్చినందుకు యింకేం అననులే నిన్ను…

కుప్పిలి పద్మ

Comments

comments