Search
Monday 11 December 2017
  • :
  • :

ఎస్ జిటి పోస్టులు నిల్

post

ఆరు జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితం
చదివిన జిల్లాను బట్టే స్థానికత

మన తెలంగాణ/హైదరాబాద్ : ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టిఎస్‌పిఎస్‌సి జారీ చేసిన నోటిఫికేషన్లలో కొన్ని జిల్లాల్లో అధిక పోస్టులు ఉంటే, కొన్ని జిల్లాల్లో సింగిల్ డిజిట్‌లో పోస్టులు ఉండటం టీచర్ అభ్యర్థులను నిరాశకు గురి చేస్తోంది. వరంగల్ అర్బన్, ఖమ్మం జిల్లాల్లో సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌జిటి) పోస్టులే లేవు. అలాగే పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ రూరల్, జనగాం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో సింగిల్ డిజిట్‌లో ఎస్‌జిటి పోస్టులు ఉన్నాయి. అత్యధికంగా కొమురంభీం అసిఫాబాద్ జిల్లాలో 776 ఎస్‌జిటి పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులలో హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 156 పోస్టులు ఉండగా, అతి తక్కువగా వరంగల్ అర్బన్ జిల్లాలో 8 పోస్టులు ఉన్నాయి. అయితే ఈ సారి పోస్టులు తక్కువగా ఉన్న జిల్లాలకు అభ్యర్థులు ఇతర జిల్లా ఒపెన్ కోటాకు ఆప్షన్ ఇచ్చుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. టిఆర్‌టి పరీక్ష ముగిసిన తర్వాత జిల్లాల ప్రాధాన్యత ఆప్షన్ ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించి, అన్ని జిల్లాల అభ్యర్థులను ప్రతిభ ఆధారంగా ఎక్కవ ఖాళీ ఉంటే అక్కడ ఎంపిక చేసే అవకాశం ఉంది.
చదివిన జిల్లాను బట్టే స్థానికత : రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల నియామకాలలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే అభ్యర్థి స్థానికత నిర్ణయించనున్నారు. అంటే అభ్యర్థి 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువును పరిగణలోకి తీసుకుంటారు. ఇందులో నాలుగేళ్లు ఎక్కడ చదివితే ఆ జిల్లా స్థానికత వర్తిస్తుంది. జిల్లాల పునర్విభజన మేరకు ఆ ప్రాంతం ఏ జిల్లా పరిధిలోకి వస్తుందో, ఆ జిల్లాను అభ్యర్థి స్థానిక జిల్లాగా పరిగణిస్తారు. ఒకవేల ఏడేళ్లలో ఒక సంవత్సరం ఒక జిల్లాలో మిగిలిన ఆరు సంవత్సరాలు రెండు జిల్లాల్లో సమానంగా చదివితే, చివరి తరగతులను పరిగణలోకి తీసుకుంటారు. టిఎస్‌పిఎస్‌సి ద్వారా తొలిసారిగా 31 జిల్లాల ప్రకారం టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అయితే వివిధ కారణాల వల్ల సొంత జిల్లాలో కాకుండా ఇతర జిల్లా పాఠశాలల్లో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివితే ఆ జిల్లానే అభ్యర్థి స్థానిక జిల్లాగా పరిగణిస్తారు. గురుకుల పాఠశాలల్లో 4 నుంచి 10వ తరగతి వరకు చదివిన విద్యార్థులకు ఏ జిల్లాలో గురుకుల పాఠశాల ఉంటే ఆ జిల్లానే స్థానిక జిల్లాగా పరిగణించనున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది అభ్యర్థులకు సొంత జిల్లా కాకుండా వారు చదివిన జిల్లానే స్థానిక జిల్లాగా మారనుంది.
టిఆర్‌టికి 3.5 లక్షల మంది హాజరయ్య అవకాశం
ఉపాధ్యాయ నియామక పరీక్ష(టిఆర్‌టి)కి సుమారు 3.5 లక్షల మంది నిరుద్యోగులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. టీచర్ అభ్యర్థులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌కు పెద్దసంఖ్యలో దరఖాస్తులు రావచ్చని భావిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 3.5 లక్షల మంది టెట్ ఉత్తీర్ణత సాధించగా, వీరందరూ టిఆర్‌టి పరీక్షకు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

Comments

comments