Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

సింగరేణి వాణి నేడే

 7 గం॥కే యూనియన్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం; ఓటు హక్కు గల కార్మికులు 52,534 మంది

SCCL

హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని తలపించిన సింగరేణి కాలరీస్ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఉదయం 7 గంటలకు  ప్రారంభమయ్యే పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఆరు జిల్లాల్లో పదకొండు డివిజన్‌లుగా విస్తరించిన సింగరేణి కాలరీస్‌లో 52,534 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకు  సింగరేణివ్యాప్తంగా 92 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీగా పోలీసులను మోహరించారు. పోలింగ్ ముగిసిన తరువాత సాయంత్రం ఏడు గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాత్రి పదిగంటలకు తొలి ఫలితాలు , అర్థరాత్రి కల్లా పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. గుర్తింపు సంఘం ఎన్నికలో 15 సంఘాలు బరిలో నిలిచాయి. ప్రధాన పోటీ మాత్రం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిబిజికెఎస్), ఎఐటియుసి అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్‌ల మధ్యే ప్రధాన పోటీ కేంద్రీకృతమైంది.

నక్షత్రం గుర్తుపై పోటీ చేస్తున్న సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్‌కు ఐఎన్‌టియుసి, టిఎన్‌టియుసిలు మద్దతు ప్రకటించగా, బాణం గుర్తుపై పోటీ చేస్తున్న టిబిజికెఎస్  విజయం కోసం అధికార టిఆర్‌ఎస్ పార్టీ సర్వ శక్తులను ప్రయోగించింది. అయితే ఎఐటియుసికి అనుకూలంగా సిపిఐ, టిడిపి, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రచారం చేశాయి. టిజిబికెఎస్ విజయం కోసం అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.  పదకొండు డివిజన్‌లలో స్థానిక గుర్తింపుతో పాటు సింగరేణి మొత్తంగా గుర్తింపు కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండింటికీ ఒకే ఓటు ఉంటుంది. డివిజన్‌ల వారీగా మెజారిటీ పొందే సంఘాలకు స్థానిక గుర్తింపు, మొత్తం ఓట్లలో ఎక్కువ వచ్చిన సంఘానికి పూర్తిస్థాయి గుర్తింపు లభిస్తుంది. అత్యధికంగా బెల్లంపల్లి రీజియన్‌లోని శ్రీరాంపూర్‌లో 11,930 మంది ఓటర్లు, అతి తక్కువగా ఇల్లెందు డివిజన్‌లో 1191 మంది ఓటర్లున్నారు. గెలుపోటముల్లో శ్రీరాంపూర్ ఏరియా  కీలకం కానుంది. దీంతో ప్రధాన పక్షాలు ఎక్కువగా ఇక్కడే మోహరించి ప్రచా రం చేశాయి. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరగాల్సి ఉండగా ఈసారి మాత్రం నాలుగవ సంవత్సరం ఎన్నికలు నిర్వహిస్తున్నా రు. ప్రస్తుతం టిబిజికెఎస్ గుర్తిపు కార్మిక సంఘంగా ఉంది. సిఎం కెసిఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ఈ సంఘానికి గౌరవాధ్యక్షురాలిగా ఉన్నారు.సింగరేణి ఎన్నికలకు కేంద్ర కార్మిక శాఖ కు చెందిన  డిప్యూటీ ఛీఫ్ లేబర్ కమిషనర్ డాక్టర్ హెచ్‌హెచ్‌ఎం శ్యాం  రిటర్నింగ్  అధికారిగా వ్యవహరిస్తున్నారు. పోలింగ్ కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బుధవారం సాయంత్రానికల్లా పదకొండు డివిజన్‌లకు అ ధికారులు బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్స్‌లతో పోలింగ్ కేంద్రాలకు చే రుకున్నారు.  కాగా ప్రచారంలో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు  కొత్తగూడెంలో వెండిగ్లాసులు, ఇతర ప్రాంతాల్లో  కోల్‌మైన్ వర్కర్లకు ఐ దారు వేల రూపాయల చొప్పున పంపిణీ చేసినట్టు వార్తలు వెలువడ్డాయి.

Comments

comments