Search
Tuesday 19 June 2018
  • :
  • :

బేకార్ మెసేజ్‌లతో దిమాక్ ఖరాబ్

                Message

స్మార్ట్‌ఫోన్‌లకు ఈ మధ్య కాలంలో డిమాండ్ విపరీతమైపోయింది. వాట్సాప్‌లు, ఎసెమ్మెస్‌లు, ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇమైల్‌లు, జిమైల్‌లు ఇలా రకరకాల సోర్సెస్ నుంచి మెసేజ్‌లు వచ్చిపడుతుంటాయి. కొన్ని మంచి మెసేజ్‌లే ఉన్నా చాలా వరకు సుత్తికొట్టడమే కార్యక్రమంగా వస్తుంటాయి. దిమాక్ ఖరాబ్ చేసేవి, టార్చర్‌పెట్టేవి, విసిగించేవి, విరక్తిపుట్టించేవి, బిపి తెప్పించేవి, భయపెట్టేవి, బద్నాంచేసేవి ఇలా నానారకాలుగా వస్తుంటాయి. వద్దంటే వచ్చిపడుతున్న మెసేజ్‌లువాటి ప్రభావాల గురించి యుకెలో నొట్టింగం ట్రెంట్ యూనివర్శిటీలో ఒక అధ్యయనం జరిగింది. తెల్లారిలేస్తే వేలకొద్దీ డిజిటల్ అలర్ట్ వచ్చిపడే వారిని 50 మందిని ఎంచుకున్నారు.

5 వారాలపాటు వారి మూడ్స్‌ను పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ 5 వారాలలో వారికి కనీసం 5 లక్షలకు పైగా మెసేజ్‌లు వచ్చాయి. వాటిలో 32% మెసేజ్‌లు అందుకున్న వారిని చిరాకెత్తించాయి. విరగబడ్డవాళ్ళు, విరుచుకుపడ్డవాళ్ళు, విసిగిపోయి నానాబూతులు తిట్టినవాళ్ళు వాళ్ళలో కనిపించారు. గతంలో మెసేజ్‌లు కురుస్తుంటే ఒళ్ళుమంట పట్టలేక నోటిఫికేషన్‌లు రాకుండా స్విచ్‌ఆఫ్ చేసేవారు. అందువల్ల చాలా మందిలో స్ట్రెస్ తక్కువ స్థాయిలో ఉండేదని అప్పట్లో నిర్వహించిన ఒక సర్వే స్పష్టం చేసింది. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ పక్కన ఉన్నా బుర్ర స్విచాఫ్ అయిపోతోందని వాపోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఏదో అర్జెంట్ పనేదో మునిగిపోతున్నట్టు మెసేజ్ రావడం, అది వచ్చిందన్నట్టు చెప్పడానికి ఒక మ్యూజికో, బెల్ సౌండ్ రావడం ఏం ముఖ్యమైన అంశమో తెలియక ఫోన్ తీయడం తీరా చూస్తే ఫలానా కంపెనీ సామాన్లు కొనుక్కోండి..

మీ సర్వీస్ ప్రొవైడర్ కొత్త స్కీమేదో తెస్తున్నాడు..అని, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది..మీరు ఫోన్ చేసిన ఫలానా నెంబర్ ఇప్పుడు పలకడానికి సిద్ధంగా ఉంది లాంటి పనికిమాలిన మెసేజ్‌లు వచ్చి చేస్తున్న పనిని చెడగొడతాయి. హాయిగా సినిమా చూడడానికో, స్నేహితులతో మాట్లాడుకోడానికో లేక విసిగించి చంపేస్తుంటాయి. మంచి చిరాకు మీద ఉన్నప్పుడు ఆఫీసు నుంచో, కావాల్సిన వాళ్ళ నుంచో అర్జెంట్ మెసేజ్ వచ్చినా పట్టించుకోలేని పరిస్థితి. ఇలా మానవ సంబంధాలను కూడా చెడగొట్టేస్తున్నాయి చెత్త మెసేజ్‌లు. పొద్దునే గుడ్‌మార్నింగ్ చెప్పడానికో, రాత్రి గుడ్‌నైట్ చెప్పడానికో వచ్చే మెసేజ్‌లకైతే అంతే ఉండదు.

ఈ మధ్యలో నానారకాల అంశాల మీద సంబంధం ఉన్నా సంబంధంలేని పిచ్చిపిచ్చి మెసేజ్‌లు స్పామ్‌లో రావడం వాటిని అందరికీ షేర్ చేయడం పెద్ద న్యూసెన్స్‌గా మారింది. షేర్‌లు, లైక్‌లు బుర్రను నమిలేస్తున్నాయి. అయిన దానికి కాని దానికి ఆహా ఓహో గాళ్ళు పెరిగిపోయారు. ఆసం, సూపర్ అంటూ పెట్టే మెసేజ్‌లు చెత్తబుట్టలో వచ్చిపడ్డట్టుగా ఫోన్‌లోకి వచ్చిపడుతుంటాయి. ఇవి ఏ రకంగానూ ఉపయోగపడకపోగా ఫోన్ మెమొరీని మింగేస్తాయి. వీటిని డెలిట్ చేయడం అంతకన్నా పెద్ద టైమ్ వేస్ట్! వెంటనే కిల్ చేయకపోతే ఫోన్‌లో చోటు హరాయించుకుపోతుంది. కిల్‌చేస్తూ కూచుంటే మన వాల్యుబుల్ టైమ్ కిల్ అయిపోతుంది.

ఎక్కడెక్కడి వాళ్ళు ఫోన్ ద్వారా కనెక్ట్ అయి రోజూ కలుసుకోవడం బాగానే ఉంది కానీ ప్రతీరోజూ మాట్లాడుకోడానికి ఏమీలేనట్టు చెత్తాచెదారం పోగేయడం, షేరింగ్ మెసేజ్‌లు బోరింగ్‌గా ఉన్నా పంపి ఆ రోజుకు కోటా పూర్తయిందన్నట్టుగా వ్యవహరించడం బాధాకరం. ఇవికాక కమర్షియల్ మెసేజ్‌లు, ఎవ్వరో ముక్కూముఖం తెలియని వారు, కాంటాక్ట్‌లో లేకపోయినా జొరబడిపోయి పంపే మెసేజ్‌లు సహనాన్ని నమిలేస్తుంటాయి. డిజిటల్ అలర్ట్ మెసేజ్‌లు పనిగట్టుకుని మన పనులు చెడగొడుతుంటే కడుపుమండిపోతుంటుంది. కానీ ఏమీ చేయలేం..సమాచారం కోసం పంపే కొన్ని రకాల మెసేజ్‌లు ఎంతో ఉపయోగంగా ఉంటాయి. మార్కెట్ నాలెడ్జిని పెంచుకోడానికి కూడా దోహదం చేస్తాయి. కాలేజీలు, యూనివర్శిటీలలో అడ్మిషన్‌లు, ఉద్యోగ నోటిఫికేషన్లు, మునిపల్ బిల్లు, కరెంట్ బిల్లు రిమైండర్‌లు ఇలాంటివేవి వచ్చినా హర్షించేందుకు, తగువిధంగా ప్రిపేరయ్యేందుకు జనం సిద్ధపడతారు. అలాకాక పోసుకోలు మెసేజ్‌ల వల్లే ఎక్కడలేని తలనొప్పి వచ్చి దిమాక్ ఖరాబ్ అయితుంటది.

Comments

comments