Search
Wednesday 22 November 2017
  • :
  • :

దూసుకుపోయిన బాణం

సింగరేణి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అనుబంధ టిబిజికెఎస్‌కు మెజారిటీ స్థానాలు

SCCLహైదరాబాద్ : హోరా హోరి గా సాగిన సింగరేణిలో గుర్తింపు కార్మిక సం ఘం ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్ అనుబంధ కార్మిక సంఘం  తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిబిజికెఎస్) విజయ దుందుబి మో గించింది. మొత్తం 11 డివిజన్లలో గురువారం జరిగిన ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను బాణం గుర్తు కైవసం చేసుకుంది. టిబిజికెఎస్‌ను ఢీకొనేందుకు ఈసారి ఎఐటియుసి, సిఐటియు, ఐఎన్‌టియుసితో పాటు మొత్తం 16 కార్మిక సంఘాలు ఏకమై రంగంలోకి దిగినా ఫలితం లేకపోయింది. ఈ ఎన్నికల్లో భారతీయ మజ్ధూర్ సంఘ్ (బిఎంఎస్) ఒంటరిగా బరిలో నిలిచినప్పటికీ ఏ మాత్రం కార్మికుల ఆదరణ పొందలేక పోయింది. ఓట్ల  లెక్కింపు లో టిబిజికెఎస్ అప్రతిహతంగా దూసుకు పోతుండటంతో సింగరేణి గనుల ప్రాంతమంతా గులాబీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయా యి. 2019 సాధారణ ఎన్నికలకు జరిగిన ఈ కార్మిక సంఘం ఎన్నికలను రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా యి. ఎన్నడూ లేని విధంగా దాదాపు అన్ని పార్టీల నేతలు దాదాపు పక్షం రోజులుగా సింగరేణి బొగ్గుగనుల ప్రాంతంలోనే మకాం వేసి ప్రచారాన్ని హోరెత్తించారు. ఒక దశలో రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలకు రిఫరండమని కూడా ప్రకటించి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాష్ట్ర ప్రజల దృష్టంతా సింగరేణి పరిసర ప్రాంతాల్లో జరిగిన ప్రచారంపైనే నిమగ్నమైంది. ఆరు జిల్లాలలో బొగ్గు గనులు విస్తరించి ఉండటంతో ఆయా జిల్లాలకు చెందిన ఎంపీలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, రాజకీయ నేతలకు తోడుగా మంత్రులందరూ ప్రచారంలో పాల్గొని కార్మికులను కదిలించారు. టిబిజికెఎస్ గెలుపు బాధ్యతను నిమాజాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత భుజానేసుకోవడం మరింత ప్రతిష్టాత్మకంగా మారింది. సింగరేణిలో మొత్తం 52,534 మంది కార్మికులు ఓటు హక్కు కలిగి ఉండగా గురువారం జరిగిన పోలింగ్‌లో 49, 873 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. నేతలు, కార్మిక సంఘాలు ప్రతి కార్మికుడిని కదలించడంతో గణనీయమైన సంఖ్యలో ఓటింగ్ నమోదైంది.

భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్ జిల్లాలలోని 11 ఏరియాలలోని 92 పోలింగ్ కేంద్రాలలో ఉదయం గం. 7 నుంచి సాయంత్రం గం. 5 వరకు జరిగిన పోలింగ్ 94.93 శాతంగా నమోదైందని అధికారులు తెలిపారు. అన్ని ఏరియాలలో కలిపి మొత్తం 52,534 ఓట్లుండగా 49,873 ఓట్లు పోలయ్యాయని పేర్కొన్నారు. కార్పొరేట్ డివిజన్‌లో మొత్తం 1,475 ఓట్లుండగా అందులో 95.93 శాతంతో 1,415 ఓట్లు పోలయ్యాయని తెలియజేశారు. ఈ సారి సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం కోసం జరిగిన ఎన్నికలను రాష్ట్రంలోని అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గతంలో సింగరేణి కార్మికులకు, కార్మిక సంఘాలకు మాత్రమే ఆసక్తికరమైన ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలు హోరాహోరిగా ప్రచారం నిర్వహించడంతో ఈ ఎన్నికల్లో విజేతలెవరనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో టిబిజికెఎస్ బోణీతో ప్రారంభమై మొత్తం డివిజన్లలో విజయంతో పూర్తయింది. కేంద్ర కార్యాలయంలో మొత్తం 86 ఓట్లుండగా అందులో 77 ఓట్లు టిబిజికెఎస్‌కు రాగా ఎఐటియుసి, సిఐటియులకు చెరో నాలుగు ఓట్లు బిఎంఎస్‌కు ఒక ఓట్లు వచ్చాయి. రాత్రి 11. 30 గంటల సమయానికల్లా అందిన సమాచారం మేరకు అందిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మణుగూరు డివిజన్‌లో 1621 ఓట్లతో టిబిజికెఎస్ విజయం సాధించగా, ఎఐటియుసి 992 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచింది. బెల్లంపల్లి డివిజన్‌లో 871 ఓట్లతో టిబిజికెఎస్ విజేతగా నిలువగా, 675 ఓట్లతో ఎఐటియుసి రెండవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కొత్తగూడెం కార్పొరేట్ డివిజన్‌లో 886 టిబిజికెఎస్ విజేతగా నిలువగా, ఎఐటియుసికి 322 ఓట్లు వచ్చాయి. ఇల్లందు డివిజన్‌లో టిబిజికెఎస్‌కు 617 ఓట్లతో విజయం వరించగా ఎఐటియుసికి 400 ఓట్లు వచ్చాయి. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం శ్రీరాంపూర్, భూపాలపల్లి డివిజన్‌లలో మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఎఐటియుసి ముందంజలో ఉంది. చాలా చోట్ల కౌంటింగ్ ఆలస్యంగా మొదలవడంతో ఫలితాల వెల్లడిలో జాప్యం ఏర్పడింది.

Comments

comments