Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

సుట్టపోల్లు వస్తుండ్రంటేనే పాణాపాణ సంబురం

Bus-stand

ఎన్కటికాలంల సుట్టాలు వస్తుండ్రంటే పెద్దోల్లకు పోరగండ్లకు మస్తు సంబురం అయ్యేది. సుట్టాలంటే అక్కలు, బావలు, మ్యానత్తాలు, మామలు, మ్యానమామలు, అత్తలు, తాతలు, బావలు , బామ్మర్థులు ఇయ్యపురండ్లు, ఇయ్యాంపులు ఇంకా దూరపు దగ్గరి సుట్టాలు ఎంతమందో ఉండేది. వాల్లు వీలు రాకడలు, పోకడలు మస్తుండేది. ఇప్పడు గివన్ని లేవు. ఇట్ల వచ్చి పెండ్లి కారెట ఇచ్చి బండి మీద బుర్రున ఊరుకుడే. ఎన్కటికాలం సుట్టాలు వస్తే రెండు మూడు రోజులు ఇంట్లనే ఉండేవాల్లు. సుట్టాలు రాంగనే వాకిట్లకే పోయి వాల్ల చెయ్యి సంచి తీసికొని లోపలికి తీసిక వచ్చేది ఇంకా ఎనుకటనైతె అక్క చెల్లెండ్లు వచ్చిండ్రింటే ఎదురంగపోయి కాగలిచ్చుకొని దమ్ము తీర ఏడుస్తురు. ఏడ్శి ఏడ్శి దుక్కం తూడుసుకొని కాల్సెక్కలు కడుక్కొమని గోలెం కాడికి తీసికపోయి కడ్కుకొని ఇంట్లకు వస్తుంటిరి.

ఇంట్లకు వచ్చినంక చెయ్యి సంచిల కెల్లి అరటిపండ్లు తీసి సంటి పిలగాండ్లకు ఇచ్చుడు. పండ్లు లేకపోతె తొవ్వొంటి ఏదన్న ఫలా రం తెస్తుంటిరి. ఆ ముచ్చట ఈ ముచ్చట మాట్లాడుకుందురు. వల్ల ఎవుసాలు ఎట్ల నడుస్తన్నయి. కష్టాలు సుఖాలు వాల్ల బిడ్డలు అల్లుండ్లు మంచిచెడ్డలు వీల్ల బిడ్డలు అల్లుండ్ల మంచి చెడ్డలు విచారించుకంటరు. మగోల్లు ఈ ఇంటాయనతో బాయి కాడిక పోయి ఎవుసం చూసి వస్తుంటిరి. కల్లు అలువాటున్నొల్లకు కల్లుమండవలకు పోయి బింకి కల్లు తాపిస్తురు. ఇంట్లకు సుత రెండు కల్లు బింకులు పంపిస్తురు. తెల్లారి ఎగిలివారంనే రాత్రి కమ్మిన కోల్లను ఇడువకముందే అండ్లకెల్లి ఓ పుంజును ఆగబట్టి తెల్లారి కోసుకుంటరు. కల్లు గూడాలు కోడికూర తోని సుట్టాలను మంచిగ అరుసుకుందురు. ఏ ఊరికన్న సుట్టం వస్తే ఆ ఊరి అంతటికి తెలుస్తుండే ఎందుకంటే అందరి సుట్టాలు అమ్మగార్లు అత్తగార్లు వాడకట్టోల్కు ఒగలికొకలు ఎరికే. ఇగ కొత్తగ ఎవలు ఊల్లెకు బస్సు దిగి నడిచివస్తుంటే ఎవలింటికిపోవాలె పెద్దయ్యా అని అడుగుదురు. తెల్సికుందురు.

ఇదొక రివాజు గనే ఉండేది. అట్లగాకున్న కోడికూర కోస్తాంటే బూరు పెంట మీద పీకులాంటే తెలుస్తుండే. ఆఖరుకు కోడికూర గిన్నెల వండుతె ఆ వాడకట్టకు మొత్తం వాసన వస్తుండే. ఇప్పుడు బాయిలర్ చికెన్ వాసనలు వస్తలేవు. కోడి రుచే ఉంట లేదు, అది వేరే సంగతి. సుట్టాలు ఇంటికి వచ్చినంక రెండుమూడు రోజులు ఇక్కన్నే ఉందురు. వీల్ల పనులల్ల వాల్లు కల్సి చేస్తుంటిరి. అసలు ఎనుకట ఏదన్న ముచ్చట్లు తెల్వన్నాల్నంటే ఒగలింటికి ఒగలు పోవుడు వచ్చుడు లేదా సదువుకున్నోల్లు అయితె కారెట్లు రాసుకునుడు గంతే సంగతి. సదువు శాత్రం లేనోల్లు మతులావులు చెప్పి పంపుడు ఉంటుండే. ఈ ఊరికి అల్లం ఎల్లిగడ్డ ఎండు మిర్చి అమ్మేటాయన వస్తే ఆయనతో వాల్ల అవ్వగరింటికి మతులావు చెప్పి పంపేది. లేదా అక్కడ ఇక్కడ కల్సి సుట్టాలున్న ఒగొలకు ఒగలకు మనుషులతోనే విషయాలు తెల్సుకునేది.

ఇంటికి వచ్చిన సుట్టాలు ఆడోల్లు అయితె ఎగిలివారంగనే లేచి అంటే 4, 5 గంటలకే నన్నట్టు లేచి ఎంటికలకు నూనె రాసుకుంట పాత ముచ్చట్లు అన్ని పెట్టుకుందురు. ఈ పెద్దవ్వ ముచ్చట ఆ ఆడిబిడ్డ ముచ్చట అత్తలు పెట్టే అగచాట్ల ముచ్చట్లు పెట్టుకుందురు. కోడండ్లకు జరిగే వేదింపులు తల్లి తరుపువాల్లు ఎప్పుడైన వస్తే బాయికాడికి పోయినకాడే చెప్పుకుందురు. ఇట్లనే ఎవుసం పనులు లేనప్పుడు ఎండాకాలంల ఒగల ఇండ్లల్లకు ఒగలు పోవుడు ఉండేది. ఇంకా పాతకాలంలనైతె ఎండ్లబండ్లు కట్టుకోని పోయి వచ్చేవాల్లు జాతరలకు తీర్థాలకు పోయినప్పుడు అక్కడ సుట్టాలు ఒకలిని ఒకలు కల్సుకునేవాల్లు. సుట్టాలను సాగనంప్పుడు కూడా దుక్క వాతావరణం నెలకొంటది. బస్‌స్టాండ్ దాక పోయి పొంటెసేపు బస్సు ఎక్కిచ్చి వచ్చేది. ఎక్కిచ్చిరంగ కూడా తల్లి బిడ్డలు అక్కాచెల్లెండ్లు ఒగల్ని ఒగలు విడిచిపోతున్న సందర్భంలో దుక్కంలో ఎడుస్తున్న దృశ్యాలు కూడా ఊరూరికి ఉంటాయి. ఆ కాలంలో ప్రేమలు ఒగలంటే ఒగలకు అహంకారం లేకుండా మనవాల్లు అనే గౌరవతో ఉండేది. ఈ రోజుల్ల గివన్ని ఎక్కడియి సెల్‌ఫోన్ మెసేజ్‌లు వాట్సాప్ మెసెజ్‌లే తప్ప హృదయపూర్వక ఆలింగనాలు అనుబంధాలు లేవు.

-అన్నవరం దేవేందర్, 9440763479

Comments

comments