Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

ఇంగ్లిష్‌లో పట్టు విజయానికి తొలిమెట్టు

meetingప్రస్తుత పరిస్థితుల్లో ఏ చిన్న ఉద్యోగానికి అప్లై చేసినా ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యం తప్పనిసరనే నిబంధన ఉంటోంది. గ్లోబలైజేషన్ వల్ల విదేశీ ఉద్యోగావకాశాలు పెరిగాయి. పెరిగిన ఉద్యోగ డిమాండ్‌కు తగ్గట్లుగా ఇక్కడి విద్యార్థులు చాలామంది విదేశాలకు వెళ్తున్నారు. అలా వెళ్లలేనివారు ఇక్కణ్నుంచే విదేశీ కంపెనీలకు సేవలందిస్తున్నారు. ఈ ఉద్యోగాల్లో రాణించాలంటే ఇంగ్లిష్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇంగ్లిష్ భాషపై హోల్డ్ ఉంటే ఎలాంటి ఉద్యోగాన్నైనా ఒడిసిపట్టొచ్చు కూడా. అలాగే వివిధ రంగాల్లో పనిచేస్తున్నవారికి, గృహిణులకు కూడా ఇంగ్లిష్ భాష నేర్చుకోవాల్సిన అవసరం పెరిగింది. ఎందుకంటే ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్న పిల్లలకు ఇంట్లో చదువు చెప్పాలంటే కాస్తో కూస్తో ఇంగ్లిష్ పరిఙ్ఞానం ఉండాల్సిందే మరి. నగరాల్లో ఇంగ్లిష్ మాట్లాడడం తప్పనిసరైంది. మాట్లాడే భాషలో గ్రామర్ మిస్టేక్స్ ఉండకూడదని, ఫ్లూయెంట్ ఇంగ్లిష్ మాట్లాడాలని అందరూ కోరుకుంటారు. సరైన శిక్షణ దొరికితే  ఫ్లూయెంట్ ఇంగ్లిష్ మాట్లాడటం అసాధ్యం కూడా కాదు. అందుకే మన తెలంగాణ పాఠకులు ఇల్లు కదలకుండా ఇంగ్లిష్ భాషను నేర్చుకునే ఏర్పాటు చేసింది. దీనికై ఇంగ్లిష్ ట్రైనింగ్‌లో 25 సంవత్సరాల అనుభవం కల్గిన చింతలూరి మంజుల గౌర్ అందిస్తోన్న స్పోకెన్ ఇంగ్లిష్ పాఠాలను మీ గడపలోకే తీసుకువస్తోంది…

నగరంలో పుట్టి పెరిగిన మంజుల ఎనిమిదో తరగతిలో స్కూల్ డ్రాపవుట్‌గా ఇంటికే పరిమితమైంది. తన తండ్రి చేస్తున్న బిజినెస్‌లో నష్టం రావడంతో ఆర్థిక పరిస్థితులు సహకరించక స్కూల్ మానేసింది. ఆ సమయంలో వారింటిపక్కనే ఉన్న స్కూల్ టీచర్ ఆర్థిక సహకారం అందించడంతో తిరిగి చదువు కొనసాగించింది. స్కాలర్‌షిప్ పొందుతూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివారు. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో బిఎస్‌సి బిజెడ్‌సి, ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్‌ఎ ఇంగ్లిష్ లిటరేచర్, లండన్ ట్రినిటి కాలేజీ అందించే ట్రినిటి గ్రేడ్ ఎగ్జామినేషన్ ఇన్ స్పోకెన్ ఇంగ్లిష్ లో తొమ్మిది గ్రేడ్లు పూర్తిచేశారు. పిజి డిప్లొమా ఇన్ విమెన్ ఎడ్యుకేషన్, స్పెషల్ బిఇడి కూడా పూర్తి చేశారు. ఆర్థిక పరిస్థితులు సహకరించకున్నా చదువంటే ఉన్న ఆసక్తితో ట్యూషన్లు చెప్పి చదువును కొనసాగించారు మంజుల.
అంచెలంచెలుగా ఎదుగుతూ : వెంగళరావు నగర్‌లోని ప్రైవేట్ పాఠశాలలో అసిస్టెంట్ టీచర్‌గా వృత్తిని మొదలుపెట్టారు. లాంగ్వేజ్ సపోర్ట్ ఫెసిలిటేటర్‌గా, ఇంగ్లిష్ లాంగ్వేజ్ ల్యాబ్ ఇన్‌ఛార్జ్, స్పెషలిస్ట్‌గా, డిసిప్లిన్ కమిటి మెంబర్‌గా వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. డిఆర్‌ఎస్ స్కూల్‌లో పనిచేస్తూ తన ప్రపంచాన్ని విస్తృతపర్చుకున్నారు. డిస్లెక్సియా(నెమ్మదిగా నేర్చుకునే డిసార్డర్) స్టూడెంట్లకు ప్రత్యేకమైన గ్రామర్ వర్క్‌బుక్ డిజైన్ చేశారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్‌లో డిగ్రీ విద్యార్థులకు కౌన్సిలర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇవి కాకుండా ట్రినిటి జిఇఎస్‌ఇ ఓరియెంట్ బ్లాక్‌స్వాన్ కు ట్రెయినింగ్ సెషన్స్ కండక్ట్ చేశారు. పలు ఇంజినీరింగ్, ఎమ్‌బిఏ కాలేజీల్లో విద్యార్థులకు ఇంగ్లిష్‌లో శిక్షణ అందించారు.
ఉచిత శిక్షణ : ఎడ్యు అర్జ్(WWW.EDUURGE.COM) అనే సంస్థను స్థాపించారు. ధన్వంతరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ ప్రోగ్రాం రూపొందించి, గ్రామాల నుంచి వచ్చి బిటెక్ చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లిష్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తున్నారు. స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌తో కలిసి రెండు గ్రామాలను(చోడవరం, వడ్డాది) దత్తత తీసుకున్నారు. మన రాష్ట్రంలో ఐటి మంత్రి కెటిఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలోని నాలుగు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఇక్కడ టీచర్లకు, విద్యార్థులకు రోబోటిక్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం అందించారు. ఈ కార్యక్రమాలకైన ఖర్చులన్నీ సొంతంగా భరించారు మంజుల.
సామాజిక సేవ : నవజ్యోతి మహిళా మండలి జనరల్ సెక్రటరీగా, హైదరాబాద్ జిల్లా మహిళా మండలుల సమాఖ్య ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా, జనజాగృతి సేవాసమితి ట్రెజరర్‌గా పనిచేస్తున్నారు. రోడ్ క్రాఫ్ట్, ప్రొటెక్షన్ ఫర్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లాంటి స్వచ్ఛంద సంస్థల్లో సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. మానసిక వికలాంగులకు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లో డెంటల్, హెల్త్ క్యాంపులను ఏర్పాటుచేసి సేవలందిస్తున్నారు.
వయసు పైబడిన తల్లిదండ్రులను పిల్లలు వదిలేసి వెళ్తున్నారీ రోజుల్లో, వారిని చేరదీసేందుకై అస్థిత్వం(మన ఉనికిని చాటుదాం) అనే సంస్థను స్థాపించారు. మహిళా మండళ్ల సమాఖ్య తరపున మహిళల్లో చైతన్యం తీసుకువచ్చే కార్యక్రమాలను చేపడుతున్నారు. అస్థిత్వం ఎంతోమంది వృద్ధులకు నీడనిస్తోంది నేడు. ఇది స్థాపించి మూడు సంవత్సరాలవుతూండగా, ప్రతి నెలా ఏదో ఒక కార్యక్రమం చేపడుతున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన జనార్ధన్ అనే డిగ్రీ చదివే అబ్బాయికి ఆర్థిక సహకారం సొంతంగా అందిస్తున్నారు మంజుల. అవసరార్థులకోసం ఐ క్యాంప్ నిర్వహించి అవసరమైతే సర్జరీ చేయించాలని వచ్చేనెల కోసం ప్రణాళిక తయారు చేస్తున్నారు మంజుల. 

                                                                                                                                                                           అనిత యెలిశెట్టి 

Comments

comments