Search
Tuesday 19 June 2018
  • :
  • :

డ్యాన్స్ లో బెస్ట్ ఈ కామన్వెల్త్ జర్నలిస్ట్

ఆమె ఒక నాట్యకారిణి..కామన్‌వెల్త్ జర్నలిస్టు. సుందర్‌ల్యాండ్ యూనివర్శిటీ ట్యూటర్. ఆరితేరిన రైటర్..ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ట్రాన్స్‌పోర్ట్ అసోసేషియన్ సలహాదారు, రాయల్ సొసైటీ ఆఫ్ ఆర్ట్‌లో ఫెలో, బాధ్యతలెరిగిన తల్లి..ఇల్లు దిద్దుకునే ఇల్లాలు. లండన్‌లో ఇలా బహుపాత్రాభినయం చేస్తూ అనేక అవార్డులు రివార్డులేకాదు ప్రపంచ రికార్డును సైతం సొంతం చేసుకున్న తెలుగింటి ఆడపడుచు వింజమూరి రాగసుధ. టీచింగ్, ట్రైనింగ్, రచన, పుస్తక ప్రచురణ, పుస్తక ఆవిష్కరణల నిర్వహణ, వర్క్‌షాపుల ఏర్పాటువంటి పలు రకాల పనులతో నిరంతరం బిజీబిజీగా ఉండే రాగసుధ డాన్స్ చేసే అవకాశం ఎప్పుడొచ్చినా వదులుకోలేదు. ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చిన రాగసుధ మన తెలంగాణాతో తన మనసులో మాటలు పంచుకున్నారు.

                   Dance

ప్ర: డాన్స్ అంటే మీ కెందుకు అంత అభిమానం?

జ: ఇది మా నాన్నగారు నాకిచ్చిన వారసత్వ ఆస్తి. దాన్ని పెంచి పెద్దచేయడం, పది మందికీ అందించి ఆయన నాట్యవారసులను తయారుచేయడం నా విధి..పవిత్ర కర్తవ్యం. ఇతరత్రా పనులెన్ని ఉన్నా వీకెండ్స్ తప్పకుండా డాన్స్ కోచింగ్‌కే కేటాయిస్తున్నాను. 30 మంది పిల్లలకు నాట్యంలో తర్ఫీదు ఇస్తున్నాను.

ప్ర: మీ నాట్య గురువు ఎవరు?

జ: తొలి నాట్యగురువు మా నాన్నగారే అయినా ఊహ తెలిసింది మొదలు అంటే 8వ యేట నుంచి ప్రముఖ నాట్యగురువు ఉమారామారావు వద్ద హైదరాబాద్‌లో నాట్యం నేర్చుకున్నాను. వారి శిష్యరికంలో అనేక మెలకువలు నేర్చుకున్నాను. సంప్రదాయ నాట్యాన్ని ఎంత కష్టపడి నేర్చుకుని సాధన చేశానో అలాగే జానపద కళలలోనూ అభిరుచితో మెలకువలు నేర్చుకున్నాను.

ప్ర: ఇప్పటి వరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు?

జ: దాదాపు 2వందలకుపైగా నాట్యప్రదర్శనలిచ్చాను.

ప్ర: ఇంగ్లాండ్‌లో మీరు అనేక నాట్య ప్రదర్శనలిచ్చారు కదా..ఇక్కడి కళాభిమానాలు ఎలాంటి నాట్యాన్ని కోరుకుంటారు? వారికి ఏ రకం నాట్యాలు నచ్చుతాయి?

జ: ఇక్కడి కళాభిమానులు మంచి అభిరుచి, ఆదరణ ఉన్నవారు. ఏ రకం నాట్యాన్నయినా వారు మనసారా ఆస్వాదిస్తారు. కాకుంటే రిథమ్ అంటే మంచి దరువు ఉన్న పాటలను, నాట్యాలను ఎక్కువగా ఆనందిస్తారు. వారు కూడా పాదాలు కలుపుతూ చిందులేస్తారు. ఇక్కడ ప్రదర్శనలిచ్చినపుడు వీరికి నెమలి డాన్స్‌లు ఎలా నచ్చాయో అలాగే లంబాడా డాన్స్‌లు, గోండు డాన్స్‌లు కూడా ఎంతగానో మెచ్చుకున్నారు. తెలంగాణాకే ప్రత్యేకమైన ఈ నాట్యప్రక్రియలను ఇక్కడ ప్రదర్శించే అవకాశం నాకు రావడం అదృష్టం.

ప్ర: మీరు సంప్రదాయ నాట్యం, జానపద నృత్యం ఇంతేనా? ఇంకేమైనా చేస్తారా?

జ: ఈ రెండూ భిన్న ప్రక్రియలు. రెండిటిలోనూ సమాన ప్రతిభా పాటవాలతో నర్తించి ప్రజలను మెప్పించడం కష్టమైన విషయమే! ఈ రెండిటిలోనూ నా నాట్యం ప్రజలకు నచ్చడం అదృష్టం. ఇంతేకాదు..ఇంతకన్నా కొత్తగా ఏదైనా చెప్పాలన్నది నా కోరిక.

                  Dancer

ప్ర: అలాంటి ప్రయత్నమేమైనా చేశారా?

జ: ఇంగ్లీషువారికి భారతీయ విద్యలలోని గొప్పదనం సులభంగా అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాను. ఆయుర్వేదం, అహింస వంటి అనేక అంశాలను వారికి చెప్పే ప్రయత్నం చేశాను. ముఖ్యంగా మ్యూజిక్ థెరపి విషయంలో నేను చెప్పిన అనేక అంశాలు వారిని ఆకట్టుకున్నాయి. మంచి సంగీతం వల్ల మనసుకు ఎలా ఊరట కలుగుతుందో విడమరచి చెప్పాను. తరతరాలుగా మహిళలలో వస్తున్న మార్పులను ప్రదర్శించి చూపాను. నీటిని సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని తెలియజెబుతూ అంతర్జాతీయ జలదినోత్సవం నాడు జలాంజలి కారక్రమాన్ని ప్రదర్శించాను. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం నాడు 30 మంది చిన్నారి శిష్యులతో చేసిన నాట్యాలు ఆహూతులను అమితంగా ఆకట్టుకున్నాయి.

ప్ర: ఇంగ్లీషు గడ్డమీద కళాభిమాని తీరు ఎలా ఉంటుంది? నాట్యకారులు చేసిన డాన్స్‌లు చూడడమా? మాకు ఇలాంటి డాన్స్‌లు కావాలని అడిగి చేయించుకుని వినోదించడమా?

జ: సాధారణంగా వీరు కళాకారుల ప్రదర్శనలను ఆస్వాదిస్తారు. మా కోసం ఇలాంటి డాన్స్ తయారుచేస్తారా? అని అడిగి చేయించుకున్న సందర్భాలున్నాయి.

ప్ర: అలాంటి అనుభవం మీకెదురైందా? వారి కోరికకు అనుగుణంగా డాన్స్ చేశారా?

జః ఈ మధ్యనే ఒక మంచి బీట్ ఉన్న ఇంగ్లీషుపాట ఇచ్చి దానికి సరిపోయేలా లంబాడి డాన్స్ చేయమని అడిగారు. ఎంత ఫ్రీస్టయిల్ మ్యూజిక్ అయినా వారి బీటు మన బీటు వేరుగా ఉంటుంది కదండీ..! అయినా సీరియస్‌గా ప్రాక్టీస్‌చేసి మా నాట్యబృందంతో కలిసి ఇంగ్లీషు పాటకి అనుకూలంగా లంబాడా డాన్స్ చేశాం. వాళ్ళ ఆనందానికి అవధులు లేవంటే నమ్మండి.

ప్ర: అక్కడ స్థిరపడిన మన భారతీయులేనా? ఇంగ్లీషువారు కూడా మన నాట్యాలను చూస్తుంటారా?

జ: ఇంగ్లీషువాళ్ళకి మ్యూజిక్ అంటే ఎంతో ఇష్టం. అది ఏ దేశపు సంగీతమైనా వారు ఆదరిస్తారు. అందుకే మన దేశ సంగీతం వారికి ఎంతగానో నచ్చింది. మన దేశ సంగీతంలోనూ దరువు ప్రధానంగా ఉండే పాటలు ఉండడం వల్ల కూడా వారికి మన సంగీతమన్నా నాట్యమన్నా వల్లమాలిన అభిమానం.

ప్ర: సాధారణంగా పాలకులకు కళాభిమానం, అభిరుచి తక్కువగానే ఉంటాయి. మరి అక్కడి పరిస్థితేమిటి?

జ: అక్కడ పాలకులు కూడా మంచి కళాభిమానం ఉన్నవారు. దేశం ఏదైనా, సంప్రదాయం ఏదైనా వారు ప్రోత్సహిస్తుంటారు.

ప్ర: ఉన్నత స్థాయి పాలకుల ప్రశంసలు, ఆహ్వానాల వంటివేమైనా మీకు అందాయా?

జ: బ్రిటిష్ మహారాణి తరఫున ఆమె ప్రతినిధి చేతుల మీదుగా సన్మానం అందుకున్నాను. బ్రిటిష్ ప్రధాని కామెరూన్ అక్కడి దీపావళి వేడుకలలో నాట్యవినోదం కలిగించమని ఆహ్వానించారు. ఎంపి బాబ్ బ్లాక్ మాన్ ఇండియన్ కళాకారులకు, సాహిత్యకారులకు ఎనలేని చేయూతనందిస్తుంటారు. అక్కడి పార్లమెంట్ ఉభయ సభలలో మూడేళ్ళలో వరసగా 7సార్లు వివిధ నాట్యాంశాలను ప్రదర్శించే అవకాశం నాకు లభించింది. ఇదొక ప్రపంచ రికార్డు. ఇంతవరకు ఎవ్వరూ అక్కడి పార్లమెంటులో ఇలా వరస నాట్యాలు చేయలేదు.

ప్ర: బ్రిటన్‌లో ఆసియా దేశాలకు చెందిన మహిళా కళాకారులు ఎందరో ఉండగా ఏషియన్ ఉమన్ ఎచీవర్స్ మీకు లభించింది.
దీన్ని మీరెలా భావిస్తున్నారు?

జ: లండన్‌లోని కల్చర్ ఎక్సలెన్సీ కోసం ఏర్పాటైన సంస్కృతి సెంటర్ నుంచి అనేక అవార్డులు అందుకున్నాను. ఏషియన్ మీడియా హానరరీ అవార్డు, ప్రవాసీ స్త్రీశక్తి అవార్డు వంటివి కూడా లభించాయి. వాటన్నిటికీ భిన్నం ఈ ఎచీవర్స్ అవార్డు. ప్రోగ్రాంలు చేసుకుంటూ పోతున్న నన్ను ఈ సమాజం గుర్తించి గౌరవించింది. ఇది అనుకున్నదికాదు. ఆశించిందీకాదు. అయిదు దేశాల మహిళా కళాకారుల నడుమ నన్ను ఎంచుకోవడం ఆనందంగా అనిపించింది. ఎన్నికల తరహాలో జరిగే ఈ సెలక్షన్స్‌లో ఎంపికైనందుకు ఏదో సాధించానేమో అన్న తృప్తికలిగింది. దీనికి కారణమేమిటంటే వారి అభిమానమనే నమ్ముతాను.

ప్ర: ఇప్పటి వరకు ఎన్ని ప్రోగ్రాములు చేశారు?

జ: దాదాపు 200 పైచిలుకు ప్రోగ్రాములు చేశాను.

ప్ర: ఒక పుష్కరకాలంగా లండన్‌లో ఉంటున్నారు..అక్కడా సన్మానాలు, సత్కారాలు అందుకుంటున్నారు..వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది?
జ: దేశంకాని దేశంలో ఉన్నా భారతీయతను విస్తరించేందుకు నా వంతు కృషి చేస్తున్నాను. అందునా తెలుగుదనాన్ని కళ్ళకు కట్టే నాట్యాన్ని అనేక వేదికల మీద ప్రదర్శించగలుగుతున్నాను. ఇక్కడ ఉండి జన్మభూమి రుణం కొంత వరకైనా తీర్చుకుంటున్నానన్న తృప్తి ఉంది. ‘నాట్యనగజ’గా ఇక్కడి వాళ్ళు గుర్తించడం ఆనందం.

ప్ర: ఒక్క ఇంగ్లాండ్‌లోనేనా..ఇంకెక్కడైనా ప్రోగ్రాంలు చేశారా?

జ: బ్రిటన్‌లోనే కాక స్విట్జర్లాండ్‌లోనూ నాట్యప్రదర్శనలిచ్చాను.ఇండియాకు వచ్చిన ప్రతిసారి ఇక్కడ కూడా ప్రదర్శనలిస్తూనే ఉన్నాను. ఆ మధ్య తిరుపతిలో తెలుగు ప్రపంచ మహాసభలు జరిగితే అక్కడ కూడా ఒక ప్రోగ్రాం చేశాను.

ప్ర: మీలో ఉన్న రచయిత్రి మాటేమిటి?

జ: పుస్తకాలు చదవడం నా హాబీ! చిన్నప్పటి నుంచి అనేక పుస్తకాలు చదివాను. అందులో ఎక్కువగా తెలుగు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలే ఉన్నాయి. ఆ విధంగా నాకు తెలియకుండానే సాహిత్యంపట్ల ఒక అభిమానం ఏర్పడింది. దాని ఫలితంగా నాలో ఒక రచయిత్రి కూడా రూపు దిద్దుకుంది. అడపాదడపా రాసిన తెలుగు కవితలను ఒక పుస్తకంగా వెలువరించాను. రాడ్య సహస్రాబ్ధి సందర్భంగా రామానుజ విన్నపములు అనే గ్రంథాన్ని ఆం గ్లంలోకి అనువదించి ఇటీవలే విడుదల చేశాను. ఈ గ్రంథానికి మూలమైన గ్రం థం ఇక్కడి లైబ్రరీలోనే లభించిం ది.
ప్ర: మన దేశం నుంచి అనేక వస్తువులు ఇక్కడికి తరలించారు కదా..అలా మన తెలుగును కూడా వీళ్ళేమన్నా పట్టుకొచ్చారా?
జ: తెచ్చారండీ..ఇంగ్లీషువారే సేకరించిన తెలుగు ఉంది. 1845నాటి తెలుగు ఉంది. ఇక్కడికి వచ్చేసిన తెలుగువారి కోసం వీరు తెలుగును పట్టుకొచ్చారు. ఇవి చాలా వరకు తాటాకు గ్రంథాల రూపంలో ఉన్నాయి. వాటిని సవరించి సంస్కరించి ఒక పరిశోధనగ్రంథాన్ని తయారుచేశాను. ఇక్కడి యూనివర్శిటీలలో తెలుగు విభాగాలున్నాయి. వీరు సేకరించిన 300 తాటాకు గ్రంథాలు ఇక్కడ లైబ్రరీలో భద్రంగా ఉన్నాయి. వీటిలో కనీసం 70 తెలుగు తాటాకు గ్రంథాలున్నాయి. ఇండియాలో మనం తయారుచేసుకున్న తెలుగు సాహిత్య చరిత్రలో ఈ పుస్తకాల జాడే కనబడదు. మారిషస్, బర్మా, యుకె లలో వలస వచ్చిన తెలుగువారు ఉన్నారు. వారు ఎలా తెలుగు కాపాడుకుంటున్నారో కూడా గమనించాను.

ప్ర: మీరు ట్యూటర్ కదా..ఏం చెబుతుంటారు? ఎవరికి చెబుతుంటారు?

జ: ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్‌లో డబల్ పిజి చేశాను. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ట్రాన్స్‌పోర్ట్ అసోసేషియన్ (ఐఎటిఎ)కు కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాను. కుయోని అకాడమీ ఆఫ్ ట్రావెల్‌కు ప్రిన్సిపాల్‌గా ఉన్నాను. జెట్ ఎయిర్‌వేస్, ఎయిర్ సహారా సిబ్బందికి అంతర్జాతీయ విధానాలలో శిక్షణ ఇచ్చే విషయంలో ముఖ్యభూమిక పోషించాను.
డాక్టర్‌॥ వంగల రామకృష్ణ

Comments

comments