Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

నటనంటే ప్రాణం

RJ-Venu-sravan

చక్కని రూపంతోపాటు వినయం, అణకువ, బాధల్లో ఉన్నవారిని ఆదుకోవడం అతని నైజం. ఆకాశవాణి రెయిన్‌బో ఎఫ్‌ఎమ్ కేంద్రంలో ఆర్‌జెగా గలగలా మాట్లాడుతూ శ్రోతల్నిఆకట్టుకోవడం…వారిని ఆనందింపజేయడం అతని వృత్తి…అటు సినిమాల్లోనూ, ఇటు టీవీ రంగంలోనూ రాణిస్తూ అందరి మన్నలను అభిమానాన్ని అందుకుంటున్నాడు ఖమ్మంజిల్లా బ్రాహ్మణపల్లికి చెందిన వేణుశ్రవణ్‌ను మన తెలంగాణ పలకరించింది.

మా అమ్మే నా తొలి గురువు. అమ్మ ప్రమీలకు మాటలు రావు. ఆమెతో సైగలు చేసి మాట్లాడటం వల్ల తెలియకుండానే నాకు యాక్టింగ్ వచ్చింది. ఆ దేవుడు అమ్మకు మాట ఇవ్వకపోయినా ఆమెకు బదులు గలగలా మాట్లాడే అవకాశం నాకు ఇచ్చాడనిపిస్తోంది. చిన్నప్పుటి నుంచి సినిమాలంటే పిచ్చి. ఎలాగైనా సినిమాల్లో నటించాలనుకునేవాడిని. కానీ ఇంట్లో ఎవ్వరూ సినిమాకు సంబంధించిన వారు కారు. ఏం చేయాలో అర్థం కాలేదు. పల్లెటూరి నుంచి నగరానికి వచ్చిన నా జీవితం వడ్డించిన విస్తరి కాదు. గ్లామర్ రంగంలో ఎవరి అండదండలు లేని నేను ఏకలవ్యునిలాగా నాకు నేనుగా అన్నీ నేర్చుకున్నాడు.

చిన్నప్పుటి నుంచే ఆసక్తి: మూడో క్లాసులో ఉన్నప్పుడు మా ఇంట్లో టీవీ లేదు. అర కిలోమీటర్ వెళ్లి టివి చూసి వచ్చేవాడిని. నేనూ టీవీలో అలా ఎదగాలని అప్పుడే మనసులో బలంగా నాటుకుంది. చిన్నప్పటి నుంచి ఏదైనా ఒకసారి చూస్తే నేర్చేసుకోవడం అలవాటు. చూడగానే ఏదైనా ఇట్టే పట్టేస్తాను. స్కూల్, కాలేజీల్లో కల్చరల్ ప్రోగ్రాలలో పాల్గొనేవాడిని. బహుమతులు గెలుచుకున్నాను. కానీ ఇవన్నీ నాన్నకు ఇష్టం లేదు. నాన్న రావుల లకా్ష్మరెడ్డి పోస్టమాస్టర్ చాలా స్టిక్ట్‌గా ఉండేవారు. పగటివేషాలు మనకొద్దు అనేవారు. బాగా చదువుకోమని కోప్పడేవారు.

టీవీ సీరియళ్లలో అవకాశాలు: హ్థూగీ వరకు చదివి, హీరో కావాలనే ఆశతో ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ వచ్చాను. నగరానికి వచ్చిన కొత్తలో బస్సులో పరిచయమైన కండెక్టర్ పాపిరెడ్డి స్టేజ్ ప్రోగ్రాంలు ఇప్పించాడు. అతడిని ఎప్పటికీ మర్చిపోను. ఈటీవీలో విధి, పద్మవ్యూహం, అలౌకిక, కురుక్షేత్రం, శ్రీవేంకటేశ్వర మహత్మం, దూరదర్శన్‌లో శిశిర వసంతం, బొమ్మరిల్లు, జెమినీ చానల్‌లో చక్రవాకం, మాటివి, జీ తెలుగు, సితార చానళ్లలోని సీరియళ్లలో నటించాను. ఈటీవీలో ముంబయి నిర్మాతగా నిర్మించిన మినీ మూవీ ఎవరికి వారేలో హీరోగా చేశాను. నలుగురి ఉద్యోగం- ఇద్దరి పెళ్లి అనే సినిమాలో నటించా. ఆ సినిమాపూర్తయింది కానీ కాకినాడలో మాత్రమే రిలీజైంది. మాటీవీలో రాధ మధు డైలీ సీరియల్‌లో మంచి గుర్తింపు వచ్చింది. జెమినీలో ఆమె డైలీ సీరియల్‌లో హీరోగా , శుభలగ్నంలో సెకండ్ హీరోగా చేసి అభిమానులను సంపాదించుకున్నాను. దూరదర్శన్‌లో ఇలా ఎందరి టెలిఫిల్మ్, భలే తండ్రి కొడుకు టెలిఫిల్మ్‌ల్లో హీరోగా చేశాను. నాకు నటనలో తృప్తినిచ్చిన టెలీఫిల్మ్ ఈటీవీలో చేసిన ‘ఎవరికి వారే’.

మాటల మాంత్రికుడిగా :హైదరాబాద్ ఆకాశవాణి రెయిన్‌బో ఎఫ్. ఎం 101.9లో రేడియో జాకీగా 2007లో నవంబరు 21న మొదటసారిగా శ్రోతలు నా గొంతు విన్నారు. ‘రెయిన్‌బోలో ఫ్లూట్ వేణు రావుల ఈ అబ్బాయి చాలా మంచోడు’ అనే ట్యాగ్‌లైన్‌తో అభిమానులకు దగ్గరయ్యాను. వాళ్లింట్లో మనిషిలా, పక్కింటి అబ్బాయిలా, అన్నలా, తమ్ముడిలా, కొడుకులా,ఆత్మీయునిలా మాట్లాడుతుంటే ఎన్నో అనుబంధాలు ఏర్పడ్డాయి. తెలుగును చక్కగా ఉచ్ఛరించడంలో ఆనందాన్ని పొందుతున్నాను. నా మాట ఓ జీవితాన్ని కాపాడింది ఒక్క క్షణం. ..ఒకే ఒక్క క్షణం ఆలోచించండి. క్షణికావేశంలో జీవితాలు పాడుచేసుకోవద్దు అన్న మాటలు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో ఉన్న ఓ అమ్మాయి విని, ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. రెండు రోజుల తర్వాత నాతో ఎఫ్. ఎంలో మాట్లాడింది. మీ మాటలు నా జీవితాన్ని కాపాడింది నేస్తం అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె మాటల్ని శ్రోతలంతా విన్నారు. ఆనందించారు. నన్ను అభినందించారు. ఈ సంఘటన జీవితంలో మరపురానిది.

సామాజిక సేవలో ముందుంటా: వృద్ధాశ్రమాలకు వెళ్లి బామ్మలను, తాతయ్యలను పలకరిస్తుంటాను. వాళ్ల వాళ్లు ఎవరు రాకపోయినా నేను వెళ్లి పలకరించేసరికి వాళ్లంతా ఎంతో ఆనందిస్తుంటారు. చర్లపల్లి జైల్లో ఖైదీలను పలకరిస్తుంటాను. నా మాటలతో వారిని ఎంటర్‌టైన్ చేస్తుంటాను. సంపాదించిన దాంట్లో కొంత అవసరం ఉన్నవారికి సాయం చేయడంలో ఉపయోగిస్తుంటాను. ఉస్మానియా యూనివర్సిటీ సాంస్కృతిక విభాగం ‘ఉత్తమ యువ కళాకారుడు’ అవార్డుతో సత్కరించింది. లివర్ బాధిత బాలుడి తరఫున ఓ ప్రైవేట్ చానల్‌లో ప్రత్యేకంగా ఓ లైఫ్‌షో చేయించాను. దానికి 18 లక్షల విరాళాలు పోగయ్యాయి. అతని ప్రాణాలు దక్కాయి. క్యాన్సర్ రోగుల కోసం లైవ్ షోలు, భోజనాలు పెట్టడం అంధ విద్యార్థులతో ఆడిపాడి ఆర్థిక సాయం చేయడం నాకు ఇష్టమైన పనులు.
అవార్డులు: 2016లో మహానటి సావిత్రి కళా రత్న అవార్డు. 2017లో రేడియో జాకీ అవార్డ్, స్వర్ణ భారతి కళా పురస్కారం, పద్మశాలి రత్న పురస్కారం.

Comments

comments