Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

మరో ఘోరాయణం

plsనారాయణ జూనియర్ కాలేజీలో చదువుల వేధింపు తాళలేక మరొక విద్యార్థి లేఖ, అదృశ్యం 

సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన హైదరాబాద్ చంపాపేట్ కళాశాల ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి సాయికిరణ్ రెడ్డి 

 హైదరాబాద్ సిటీబ్యూరో: నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం (ఎంపిసి) విద్యార్థి ఒకరు అక్కడి తీరికలేని చదువులకు, ఉదయం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్విరామంగా క్లాసులు నిర్వహించి ఒత్తిడికి గురి చేస్తున్నందుకు నిరసనగా పోలీసులకు ఫిర్యాదు చేసి అదృశ్యమైన తాజా ఉదంతం వెలుగులోకి వచ్చింది. చంపాపేట్ నారాయణ జూనియర్ కాలేజీలో చదువుతున్న సాయికిరణ్ రెడ్డి (16) అనే ఈ విద్యార్థి అక్కడి మితిమీరిన చదువుల షెడ్యూల్‌పై జూనియర్ లెక్చర్ జిఎల్ భాస్కర్‌కు ఫిర్యాదు చేయగా, దానిని ధిక్కారంగా భావించి అతడిని పనిష్మెంట్ సెక్షన్‌కు మార్చారు. దాంతో అతడు మనస్తాపంతో శనివారం రాత్రి 8 గంటలకు ఆత్మహత్య చేసుకోవడానికి బయటకు వెళ్లిపోయాడు. ఇది గమనించిన తోటివారు అతడిని వెతికి సైదాబాద్ ప్రాంతంలో పట్టుకున్నారు. వారు బిసి నాయకుడు నరేష్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి ఆ రాత్రే సాయికిరణ్‌రెడ్డితో పాటు సైదాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లా రు. అక్కడ సాయికిరణ్ పోలీసులకు రాసిన ఫిర్యా దు లేఖలో కళాశాల వారు వేధిస్తున్నారని, హింసకు గురి చేస్తున్నారని తెలియజేశాడు. పోలీసులు సాయికిరణ్ రెడ్డికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం అదే రాత్రి అతడిని బడంగ్‌పేటలోని ఇంటికి పం పించారు. ఇంటికి వెళ్లిన గంట తరువాత సాయికిరణ్ రెడ్డి అక్కడి నుంచి కూడా వెళ్లిపోయాడు. ఆదివారం రాత్రి వరకు అతని ఆచూకీ లభించలేదు. అయితే సాయికిరణ్ రెడ్డి ఫిర్యాదు చేసిన మరుసటి రోజే వెనక్కి తీసుకున్నాడని పోలీసులు చెప్పారు. “ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు తప్పనిసరిగా చదవాలని ఇటు కళాశాల యాజమాన్యం, అటు తల్లిదండ్రులు వేధిస్తున్నారు. నాకు ఆత్మహత్యే శరణ్యం” అని ఫిర్యాదులో సాయికిరణ్‌రెడ్డి పేర్కొన్నాడు. అంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ ‘మా కళాశాలలో చదువు..చదవమని కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారని ప్రశ్నిస్తే, మా తల్లిదండ్రులకు ఫోన్‌లు చేసి..మీ పిల్లవాడు చదవడం లేదు..ఇక్కడి నుంచి తీసుకెళ్లండి అంటున్నారు’ అని అన్నారు.

Comments

comments