Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

ఇండిగో విమానయాన క్లేశం

sampadakeyam

అన్ని జనజీవన రంగాలతోనూ వికృత క్రీడ సాగిస్తున్న ప్రైవేటు కార్పొరేట్ వ్యాపార వ్యవస్థలు ఆకాశయానాన్నీ వదిలిపెట్టలేదు. సకల హంగులతో, సౌకర్యాలతో ప్రయాణీకులకు విశేష సేవలందించిన ప్రభుత్వరంగ విమానయాన సంస్థలను బలవంతంగా మూసివేయిస్తూ ప్రైవేటుకు అపరిమిత అవకాశం కల్పించి ఆ సంస్థలకు విశేషమైన మద్దతు ఇస్తున్న ప్రభుత్వాలు సభ్యసమాజం ముక్కున వేలేసుకునే రీతిలో అక్కడ పేట్రేగుతున్న దుర్లక్షణాలను ఎలా అరికట్టగలవన్నది గట్టి ప్రశ్న. ఎంపి స్థాయి బలవంతులైన రాజకీయ నాయకులు విమానాలలో సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడిన ఘటనలు ఇటీవల వెలుగుచూశాయి. ఆయా సందర్భాలలో బుద్ధి గడ్డితిని వ్యవహరించిన ఆ పెద్దలను కొంతకాలం పాటు అన్ని విమానయాన సంస్థలు బహిష్కరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సీన్ తిరగబడింది. అందుకు విరుద్ధంగా విమానసంస్థల సిబ్బందే ప్రయాణీకులపట్ల అవమానకరంగా ప్రవర్తిస్తున్నారు. దౌర్జన్యాలు సాగిస్తున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో మొన్న మంగళవారంనాడు సంభవించిన ఒక ఘటన ఇందుకు తాజాఉదాహరణ.
ఆ రోజు ఇండిగో విమానం దిగిన 50 ఏళ్ల వయసులోని ఒక ప్రయాణీకుడు ఆ సంస్థ బస్సు కోసం దాని నీడలోనే ఎదురు చూస్తుండగా ఆ సంస్థ ఉద్యోగి ఒకడు అతడిని వెకిలిగా చూస్తూ అక్కడినుంచి తప్పుకోమన్నాడు. నన్ను వెక్కిరించే బదులు మీ బస్సును తొందరగా రప్పించవచ్చు గదా అని ఆ ప్రయాణీకుడు ప్రశ్నించగా నేనేమి చేయాలో నువ్వు చెప్పనవసరం లేదని అతడు దురుసుగా బదులిచ్చాడు. అంతలోనే బస్సు రావడం అందులోని సిబ్బందికి ఈ విషయం తెలిసి ఆ ప్రయాణీకుడిని ఈడ్చికొట్టడం జరిగిపోయాయి. చేరువలోని భద్రతా సిబ్బంది కూడా ప్రేక్షకులైపోయారు. ఈ క్రమంలో ఆ ప్రయాణీకుడిని ఇండిగో సిబ్బంది కిందపడవేసి పీకనొక్కారు. ఈ దృశ్యం విడియో ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. వంగి నమస్కరిస్తూ సవినయంగా స్వాగతం పలికే మహారాజు బొమ్మతో ప్రయాణీకులను అలరించి, ఆహ్లాదపరచిన దేశంలోని విమానయాన రంగం ఇప్పుడు గూండాల రాజ్యం అయిపోయిందనే బాధ కలగడం సహజం. ప్రఖ్యాత టెన్నిస్ క్రీడాకారిణి పి.వి. సింధు కి కూడా ఇండిగోతో ఇటీవల చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. గత శనివారంనాడు ఇండిగో విమానంలో ప్రయాణం చేసినప్పుడు అందులో పనిచేస్తున్న అజితేష్ అనే ఉద్యోగి తన పట్ల దురుసుగా ప్రవర్తించాడని ఆమె ఫిర్యాదు చేశారు. ఆ దృశ్యాన్ని చూసిన అషిమా అనే ఎయిర్ హోస్టెస్ అతనిని వారించడానికి ప్రయత్నించగా ఆమెను కూడా దూషించాడని సింధు పేర్కొన్నారు. తనకు చాలా అగౌరవకరమైన అనుభవం ఎదురైందని ఆమె వెల్లడించారు. ఇటువంటి సిబ్బంది వల్ల ఇండిగో వంటి సంస్థల ప్రతిష్ఠ దెబ్బతింటుందని కూడా ఆమె వ్యాఖ్యానించారు. ఇందుకు ఆ సంస్థ మర్యాదపూర్వకంగా సమాధానం చెప్పి సింధును సంతృప్తిపరచకుండా ఆమె లగేజి పరిమితికి మించి ఉన్నదని ఎదురు ఆరోపణ చేసింది.
తగ్గింపు రేట్లతో ప్రయాణీకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే గతంలో కల్పించిన పలు సౌకర్యాలను ఉపసంహరించి లాభాలు చేసుకుంటున్న ప్రైవేటు విమానయాన సంస్థలు వారిపై ఈ విధంగా గూండాయిజాన్ని ప్రదర్శించటం ఎంతైనా ఆందోళనకరం. దేశంలో విమాన ప్రయాణీకుల సంఖ్య పెరుగుతున్నది. గత ఆరేళ్లలో ఇది దాదాపు రెట్టింపు అయింది. ఇందుకు మధ్య తరగతి ఆర్థికస్థితి పెరుగుతూ ఉండడం ఒక కారణం కాగా విమానయాన సంస్థలు పోటీపడి వివిధ ప్యాకేజీల ద్వారా టిక్కెట్ల ధరలు పెంచటం మరో హేతువు. ఇది ఎంతైనా హర్షించదగిన విషయం. తక్కువ రేట్లతో ప్రయాణీకులను గమ్యాలకు చేరుస్తున్న సంస్థగా పేరొందిన ఇండిగో దేశీయ విమానయాన మార్కెట్‌లో 40శాతాన్ని సొంతం చేసుకున్నది. ఇది ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్‌వేస్ సంస్థల ఉమ్మడి మార్కెట్‌తో సమానం. దేశంలో విమాన ప్రయాణీకులు ఎక్కువగా తక్కువ ధర టిక్కెట్లతో సేవలందిస్తున్న సంస్థలనే ఎంచుకుంటున్నారని నిపుణులు నిర్థారించారు. అంతవరకు బాగానే ఉంది. విమానయానాన్ని మధ్యతరగతికి మరింత అందుబాటులోకి తేవాలనే లక్షం మెచ్చుకోదగినదే. కానీ ఆ ప్రయాణం లారీలోనో, ప్రైవేటు బస్సులోనో వెళ్లినంత కష్టాలతో కూడినది కాకూడదు. ముఖ్యంగా ప్రయాణీకులను అవమానపరచి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే స్థాయి విమానయానం ఎంత చౌకగా వస్తేనేమి? రాశి పెరిగి వాసి తరగడం హర్షించదగిన అంశం ఎంతమాత్రం కాదు.

Comments

comments