Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

యుపిలో అసమ్మతిపై ఉక్కుపాదం

;akno

ఫెస్టివల్‌లో జరపవలసిన సాహిత్య పండగను అకస్మాత్తుగా ముగించవలసి వచ్చింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సర్కారుకు నచ్చలేదు కాబట్టి వెఅది వెంటనే రద్దయింది. భావప్రకటనా స్వేచ్ఛను ఏ మాత్రం అంగీకరించలేని ప్రభుత్వ నియంతృత్వ ధోరణి మరోసారి బట్టబయలైంది. లక్నోలో లిటరరీ ఫెస్టివల్ జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇది ఐదవ ఫెస్టివల్. జిల్లా యంత్రాగం మొదట అనుమతి ఇచ్చింది. మూడురోజులు కొనసాగే సాహితీ పండగ ఇది. కాని మొదటిరోజు ముగియగానే నిర్వాహకులు బిత్తరపోయేలా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అనుమతి రద్దు చేసింది. ఈ కార్యక్రమానికి జవహర్‌లాల్ విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్ వచ్చిన కొద్ది సమయంలోనే అనుమతులు నిరాకరించే నిర్ణయం జరిగింది. కన్నయ్య కుమార్ రాసిన బీహార్ టు తీహార్ పుస్తకంపై చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన వచ్చాడు.
శుక్రవారం రోజున ఈ ఫెస్టివల్ ప్రారంభమైంది. శనివారం, ఆదివారం ఇలా మూడు రోజుల పాటు అనేక సాహితీ కార్యక్రమాలు, చర్చాగోష్టులు జరగవలసి ఉంది. కాని లక్నో జిల్లా మెజిస్ట్రేట్ కౌశల్ రాజ్ శర్మ శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత మేల్కొని ఈ కార్యక్రమాలకు అనుమతిని రద్దు చేశారు. ఈ కార్యక్రమం కోసం ధరఖాస్తు చేసుకున్నప్పుడు నిర్వాహకులు ఇచ్చిన షెడ్యూల్‌లో కన్నయ్య కుమార్, బిజెపి నాయకుడు శతృఘ్న సిన్హా, వరుణ్ గాంధీ, ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీల పేర్లు చెప్పలేదని అందువల్ల అనుమతి రద్దు చేస్తున్నామని చెప్పారు.
స్థానికసంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చుననే అభిప్రాయంతో అనుమతి రద్దు చేస్తున్నామని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. మొదటి రోజున ఆహ్వానించిన వారిలో కన్నయ్యకుమార్ కూడా ఉన్నారు. ఆయన పుస్తకం బీహార్ టు తీహార్ ఆవిష్కరణ అక్కడ ఉంది. యాసిడ్ దాడుల బాధితులు నిర్వహించే షీ రోజ్ కేఫ్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయంత్రం 7గంటలకు కన్నయ్యకుమార్ ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి కారు దిగిన వెంటనే ఎబివిపి కార్యకర్తలు నినాదాలు చేస్తూ చుట్టుముట్టారు. కార్యక్రమ నిర్వాహకులు లక్నో విశ్వవిద్యాలయ విద్యార్థులు, సమాజవాది పార్టీ కార్యకర్తలు కన్నయ్యకుమార్‌కు రక్షణ వలయంగా ఏర్పడి వేదికవద్దకు తీసుకువెళ్లారు. ఎబివిపి తదితర హిందూత్వ సంస్థల కార్యకర్తలు భారతమాతాకి జై, వందేమాతరం, జై శ్రీరామ్ నినాదాలతో కార్యక్రమం జరగనీయలేదు. ఎబివిపి, లక్నో యూనివర్శిటీ విద్యార్థుల మధ్య ఘర్షణ పరిస్థితి చూసి ఈ కెఫె నడుపుతున్న యాసిడ్ దాడుల బాధితులు ముందుకు వచ్చి ప్రశాంతంగా ఉండాలని ఎంత విజ్ఞప్తి చేసినా లాభం లేకుండా పోయింది. కన్నయ్యకుమార్ ప్రసంగం వినడానికి వచ్చిన దాదాపు 300మంది ఈ పరిస్థితి చూసి నిర్ఘాంతపోయారు. అదుపు చేయడానికి అక్కడ ఒక్క పోలీసు కూడా లేకపోవడం యోగీ ప్రభుత్వ ప్రత్యేకత. ఈ పరిస్థితి గురించి వార్త పోలీసులకు చేరవేసిన తర్వాత వారు తాపీగా వచ్చారు. కొంత ఘర్షణ అనంతరం పోలీసులు నిరసనకారులను బయటకు పంపేయగలిగారు. కన్నయ్యకుమార్ మాట్లాడుతూ తన భావాలతో ఏకీభవించని వారు తనతో చర్చలకు ముందుకు వస్తే చాలా బాగుండేదని, అదే ప్రజాస్వామిక వైఖరని అన్నారు. కాస్త నవ్వండి మీరంతా రామరాజ్యంలో ఉన్నారంటూ యోగీ పరిపాలనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సత్యయుగంలో శ్రీరామచంద్రుడు రాజ్యాన్ని వదిలి వనవాసానికి వెళ్ళాడు. కలియుగంలో యోగీ వనవాసం నుంచి రాజ్యపాలనకు వచ్చాడని అన్నారు. కేరళలో బాంబులు తయారుచేస్తూ ప్రమాదవశాత్తు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు మరణించిన వార్తలను ప్రస్తావిస్తూ తాను విచారం తెలియజేస్తున్నానని వ్యంగ్యంగా అన్నారు. అలాగే గోరఖ్‌పూర్‌లో మరణించిన పసిపిల్లల గురించి కూడా ప్రస్తావించారు.
ఈ లిటరరీ ఫెస్టివల్‌లో బాలీవుడ్‌లో ప్రముఖనటుడు, బిజెపి నాయకుడు శత్రుఘ్నసిన్హా కూడా ప్రసంగించవలసి ఉంది. ఆయన జీవిత చరిత్ర ‘ఎనీథింగ్ బట్ ఖామోషీ’ భారతీ ప్రధాన్ రాశారు. ఈ పుస్తకంపై కూడా చర్చా కార్యక్రమం ఉంది. బిజెపిని ఈ పుస్తకంలో సిన్హా తీవ్రంగా విమర్శించారు. ప్రధాని నరేంద్రమోడీని విమర్శించడానికి కూడా సిన్హా సంకోచించలేదు.
బిజెపిని తూర్పారబట్టే మరో రాజకీయ నాయకుడు మజ్లిస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ. ఆయన కూడా శనివారం రోజున లిటరరీ ఫెస్టివల్ లో పాల్గొనవలసి ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సంజయ్ సింగ్, అశుతోష్‌లు ఆదివారం నాడు పాల్గొనవలసి వుంది.
కాని శుక్రవారం సాయంత్రం కన్నయ్యకుమార్ వేదికవద్దకు రాగానే హిందూత్వ శక్తులు గగ్గోలు చేయడం ప్రారంభించాయి. అక్కడకు వచ్చిన పోలీసులు కూడా ప్రారంభంలో అల్లరి శక్తులను తరిమేయడం కన్నా కన్నయ్యకుమార్ ను అక్కడి నుంచి పంపేయడానికే ఎక్కువ ఆసక్తి చూపించారు. జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్ రాజ్ శర్మ ఇచ్చిన అనుమతిని ఫెస్టివల్ నిర్వాహకుడు షమీమ్ ఆర్జూ పోలీసులకు చూపించిన తర్వాత కూడా పోలీసుల వైఖరి మారలేదు. మీరు నియమాలు ఉల్లంఘించారని ఒక సీనియర్ పోలీసు అధికారి అన్నాడట. ఉల్లంఘించిన నియమాలేమిటో ఆయన చెప్పలేదు. నియమాలు ఉల్లంఘించారు కాబట్టి అనుమతి రద్దు చేస్తున్నామని ప్రకటించారు.
ప్రతి కార్యక్రమంలోను పాల్గొనే వారి పేర్లు అధికారులకు తెలియజేయడం అవసరమని, నిర్వాహకులు అలా చేయలేదు కాబట్టి అనుమతి రద్దు చేస్తున్నామని అన్నారు. జిల్లా మేజిస్ట్రేటు పై అధికారులతో ఈ విషయమై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అనుమతి రద్దు చేస్తున్నట్లు వెంటనే ప్రకటించారు. ఇంతకీ చెప్పిన కారణమేమంటే, స్థానికసంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి, నియమావళి అమలులో ఉంది కాబట్టి, రాజకీయ నాయకులు, సినిమా నటులు కార్యక్రమానికి వస్తున్న విషయం తమకు తెలియనందువల్ల అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయలేదు కాబట్టి అనుమతి రద్దు చేశామని వివరణలు
ఇచ్చుకున్నారు.
ఈ కార్యక్రమానికి కన్నయ్యకుమార్ రావడం ఒక్కటే కాదు, యోగీ భరించలేని విషయం మరొకటుంది. శత్రుఘ్న సిన్హా నోరుమూసుకుని మౌనంగా ఉండేది లేదని ఎప్పుడో ప్రకటించిన బిజెపి నాయకుడు. తన పార్టీ నాయకత్వం ఆలోచనా సరళికి మోడీ ఆలోచనా సరళికి సంబంధమే లేదని, వేలెత్తి చూపిన నాయకుడు సిన్హా. ఇంటర్ పాసయిన వారిని దేశంలో మానవవనరుల శాఖకు మంత్రిగా నియమించవచ్చని వాళ్ళనుకుంటున్నారు. అప్రతిష్ఠపాలైన లాయరును దేశానికి ఆర్ధికమంత్రిగా నియమించవచ్చనుకుటున్నారు. ఇది వారి ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోంది అంటూ సిన్హా ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాడు. అంతేకాదు, నోట్లరద్దు, జియస్‌టి విప్లవాత్మక నిర్ణయాలని వాళ్ళనుకుంటున్నారు, దేశప్రజలను కష్టాలపాలు చేసిన నిర్ణయాలని నేనంటున్నాను అని కూడా చెప్పారు. ఆయన బిజెపిలోనే ఉండి దానాయకుల వైఖరిని తూర్పారబట్టారు. సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీని పార్టీలో పక్కన పెట్టడాన్నీ ఆయన తప్పుబట్టారు. పార్టీని నిర్మించిన వారి పట్ల ఇప్పుడు ఈ నాయకుల వైఖరి వారి మనస్తత్వానికి నిదర్శనమని చెప్పారు.
ఏది ఏమైనా అసమ్మతి స్వరాలు, విమర్శలు బలంగా వినిపించే అవకాశం ఉంది కాబట్టే యోగీ ప్రభుత్వం ఈ లిటరరీ ఫెస్టివల్‌కి అనుమతి నిరాకరించింది. బిజెపి పాలనలో భావప్రకటనా స్వేచ్ఛకు అవకాశం లేదన్న సంగతి మరోసారి రుజువయ్యింది.

Comments

comments