Search
Tuesday 19 June 2018
  • :
  • :

కొలువులపై ఇంత ‘కొట్లాట’ అవసరమా?

                 TELANGANA-MAP2


మూడు సంవత్సరాల తమ ‘ముచ్చటైన’ పాలనపై ఎవరైనా మాట్లాడితే వారి నాలుకలు తెగ్గోస్తామనే వైఖరి టిఆర్‌ఎస్ శ్రేణుల్లో కన్పిస్తోంది. తామున్నది ప్రజాస్వామ్య దేశంలోనని, ప్రజలు గెలిపిస్తే అధికారంలోకి వచ్చామనే వాస్తవాన్ని వారు విస్మరిస్తున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఆందోళనలు చేసుకునే హక్కు కూడ లేకుండా చేసిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదే.గత మూడేళ్లుగా మాటలు తప్ప చేతలు ఎక్కడా కన్పించడం లేదని తెలంగాణ తొలిప్రభుత్వంపై అనేక వర్గాల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇందులో ప్రధానంగా ప్రత్యేక రాష్ట్ర సాధనకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టిన విద్యార్థి లోకం ముందు వరుస లో ఉంది. తెలంగాణ రాష్ట్రం వస్తే పెద్ద నియామకాలు జరిగి తమ బతుకులు బాగుపడతాయనే ఆశతో ఆ రోజు ఉద్యమానికి ఊపిరిలిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కీలక నేతలుగా ఉన్న విద్యార్థి నాయకులు కొందరు ప్రభుత్వంలో వివిధ హోదాల్లో కొనసాగుతున్నారు.
ప్రభుత్వం వచ్చిన వెంటనే తమకు తీపి వార్త అందిస్తారనే ఆశతో వేలాదిమంది ఎదురుచూశారు. ప్రభుత్వం కూడ తెలంగాణకు ప్రత్యేక సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసి పోస్టులను ప్రకటించింది. కాని ప్రకటనలు చేయడం తప్పిస్తే నియామకాల ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. కోర్టులనుంచి వచ్చే స్టేల పేరుతో, సాంకేతిక కారణాల సాకుతో నియామకాలను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తున్నారు. ఉద్యోగాలు వస్తాయో లేవో అన్న ఆందోళనలో ఉన్న నిరుద్యోగులు ప్రభుత్వం చెబుతున్న కుంటి సాకులపై విసుగెత్తి పోయారు. ఉద్యమ కాలంలో విద్యార్థులతో హారతులు పట్టించుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్, విద్యార్థి నేతలు ఇప్పుడు ఉస్మానియా క్యాంపస్‌లోకి వెళ్లలేకపోతున్నారు. ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా ఉత్సవాలకి వెళ్లి కూడా ముఖ్యమంత్రి మాట్లాడకుండా వచ్చారంటే ప్రభుత్వంపై విద్యార్థుల్లో ఎంత ఆగ్రహం ఉందో అర్థం చేసుకోవచ్చు. నియామకాల ప్రక్రియ ఆలస్యం కావడానికి ప్రభుత్వం చెబుతున్న కారణాలు ఎంతమాత్రం సమంజసంగా లేవు. కోర్టులు తప్పు పట్టే విధంగా
ర్ణయాలు ఉంటే తప్పిదం ఎవరిదో ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలి.
ఉద్యోగ నియామకాలపైనే కాదు తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మంది కూడా ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణలో తాత్కాలిక ఉద్యోగులే ఉండరని బీరాలు పలికిన వారు ఇప్పుడు మాట మార్చారు. కంటి తుడుపుగా కొన్ని శాఖల్లో తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరించారు.
వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే కొలువులు లేక నిరాశ నిస్పృహల్లో ఉన్న నిరుద్యోగ యువతకు అండగా నిలిచిన తెలంగాణ జెఎసిపై నిప్పులు కక్కడం విడ్డూరంగా ఉంది. అత్త తిట్టినందుకు కాదు తోటికోడలు నవ్వినందుకు అన్న చందాన ‘కొలువులపై కొట్లాట’ పేరిట తలపెట్టిన బహిరంగ సభకు అడుగడుగునా అడ్డు తగిలింది. చివరకు హైకోర్టు జోక్యం చేసుకుని చెంప దెబ్బ కొట్టినా దొడ్డిదారి ప్రయత్నాలు ఆపడం లేదు. ప్రభుత్వానికి
నిజాయితీ ఉంటే నియామకాలపై రగులుతున్న విద్యార్థి లోకాన్ని శాంతింపచేసేందుకు కార్యాచరణ ప్రకటించాలి. దాన్ని పక్కన పెట్టి అసలు ఆందోళనలే చేయకూడదనే ధోరణి ప్రభుత్వ పెద్దల్లో ఉన్న ‘దొరతనాన్ని’ బయటపెడుతోంది.
తెలంగాణ ఉద్యమంలో జెఎసి, దాని కన్వీనర్ కోదండరామ్ నిర్వహించిన పాత్రపై ఎవరో కాదు. ముఖ్యమంత్రే ఎన్నోసార్లు ప్రశంసలు కురిపించారు. అటువంటి జెఎసిని దాని నేతను పదే పదే అరెస్టులు చేస్తూ తెలంగాణ గౌరవాన్ని మంట గలుపుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం లేకుండా పోలీసులు ఇటువంటి చర్యలకు పాల్పడే సాహసం మాత్రం చేయరు. అర్ధరాత్రి ఇంటిమీద దాడి చేసి తలుపులు పగులగొట్టడం, జిల్లాలకు వెళుతుంటే ఊరి పొలిమేరల్లో అడ్డుకుని దౌర్జన్యాలు చేయడం ఎంతమాత్రం సబబు కాదు. చివరకు తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచి ఇప్పుడు మంత్రి పదవులు వెలగబెడుతున్న వారితో తిట్టించడం ఎంతమాత్రం సంస్కారం కాదు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కులను కూడా తుంగలో తొక్కి ధర్నా చౌక్‌నే లేపేసిన ప్రభుత్వాన్ని కూడ మనం దేశంలో ఎక్కడా కనివినీ ఎరుగం. అద్దాల బంగళాలో కూర్చుని అంతా నా ఇష్టం అనుకోవడం ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదు.

Comments

comments