Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

తెలంగాణభాష అస్తిత్వపుచర్చ

telugu

తెలంగాణ భాషను కేవలం తెలంగాణ ఉద్యమానికే పరిమితం చేసి..,మళ్లీ తెలుగును తెలంగాణ మస్తిష్కాల మీద రుద్దే ప్రయత్నాలు ఇటీవల ముమ్మరమయ్యాయి. సోషల్ మీడియాలో,బ్లాగుల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల పేరిట తెలుగు భాష ఉద్యమం పేరిట తెలుగు భాషను కాపాడే ప్రయత్నాల్లో తెలంగాణ భాషను కార్నర్ చేసే ప్రయత్నాలను ఖండించి తెలంగాణ భాష అస్తిత్వం కాపాడి ఆ భాషను సజీవం చేయడానికి తెలంగాణ కవి పండితులు మరొక్కసారి తమ కలాలను సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ భాష కేవలం ఉద్యమ భాష కాదు. ఈ భాష ఇక్కడి జనాల జీవభాష. తెలంగాణ భాష ఇక్కడి జనాల ప్రాణ భాష. ఈ భాష తెలంగాణ జనాల వ్యావహారిక వాక్‌ధార. 

అస్తిత్వం అంటే ఉనికి. అస్తిత్వోద్యమాలు అనగానే మనకు గుర్తొచ్చేవి…స్త్రీవాద, దళిత,మైనారిటీ,బీసీ అస్తిత్వవాదాలు మరియు ప్రాంతీయ అస్తిత్వ వాదాలు. కాని ఈ అన్నింటి కంటే భాషా అస్తిత్వం అత్యంత ముఖ్యమైన అంశం. ఎందుకంటే అస్తిత్వం ఏదైనా దాన్ని తెలియజేయాల్సింది వారివారి భాషలోనే. వారిది కాని భాషలో తెలియజేసిన ఏ స్పందనకైనా..,రాతలకైనా సజీవత్వం ఉండదు. తెలంగాణ భాషను ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా తీసుకోవాలి…తెలంగాణ ఉద్యమం చాలా మట్టుకు తెలంగాణ భాషలోనే సాగింది…ఆటపాటమాట అన్నీ నిండైన తెలంగాణ భాషలో పలికి ఉద్యమానికి జవం జీవం కలిగించాయి.
ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణ స్వరాష్ర్ట గడ్డపైన నిర్వహింపబడుతున్నవేళ తెలంగాణ భాష గురించి చర్చతెలంగాణ భాషావాదం చర్చకు వస్తున్నాయి. అయితే ప్రపంచ తెలుగు మహాసభలు కాకుండా తెలంగాణ మహాసభలు నిర్వహించాలని ఒక వాదన కూడా నడుస్తున్నది. మరొక విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే…కాళోజీ అన్నట్టు ‘బడిపలుకుల భాష కాదు…పలుకుబడుల భాష కావాలి’ అని. ఆయన మాటల ప్రకారం తీసుకున్నా, తెలంగాణాలో పలుకుబడుల భాష మాట్లాడేది దళిత బహుజనులే. తెలంగాణకు సంబంధించి పలుకుబడుల భాష ఎవరిదంటే దళిత బహుజనులది. కనుక తెలంగాణ భాష కాకుండా తెలుగు భాష అనడం అంటే మళ్లీ ఆధిపత్య భాష ఇక్కడి దళిత బహుజనులపై రుద్దడమే అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
ప్రాంతీయ అస్తిత్వోద్యమం అనగానే గుర్తొచ్చేది తెలంగాణ. దేశంలో ప్రాంతీయ అస్తిత్వోద్యమాల్లో తెలంగాణ పోరాటం ఒక బహుళ అస్తిత్వాల ప్రతిస్పందనల మేళవింపు. తెలంగాణ పోరాటం కేవలం భౌగోళిక అస్తిత్వ పోరాటం మాత్రమే కాదు…అది కేవలం నీళ్లు,నిధులు,నియామకాల పోరాటం మాత్రమే కాదు…అది ఒక బహుళ అస్తిత్వాల పోరాటాల భూమిక. ఆ బహుళ అస్తిత్వాల్లో అనేకాంశాలు ఒకదానికొకటి విడదీయరాని సంబంధాన్ని కలిగి ఉంటా యి…అయితే తెలంగాణాలో ఉన్న ఈ బహుళ అస్తిత్వ పోరాటాలన్నింటిలో ఒక అంతర్వాహినిగా ప్రవహించి ఆ పోరాటాలకు జవం, జీవం కలిగించేది మాత్రం తెలంగాణ భాష. తెలంగాణాలో జరిగిన వివిధ అస్తిత్వ పోరాటాల భావజాలం తెలంగాణ భాషలో ఆటై మాటై పాటై పలికి జనాలకు అత్యంత చేరువై వారి గుండె గుర్తుల్లో ఆ ఉద్యమాలు నేటికీ సజీవంగా నిలిచి ఉన్నాయి.
తెలంగాణ భాషను కేవలం తెలంగాణ ఉద్యమానికే పరిమితం చేసి..,మళ్లీ తెలుగును తెలంగాణ మస్తిష్కాల మీద రుద్దే ప్రయత్నాలు ఇటీవల ముమ్మరమయ్యాయి. సోషల్ మీడియాలో,బ్లాగుల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల పేరిట తెలుగు భాష ఉద్యమం పేరిట తెలుగు భాషను కాపాడే ప్రయత్నాల్లో తెలంగాణ భాషను కార్నర్ చేసే ప్రయత్నాలను ఖండించి తెలంగాణ భాష అస్తిత్వం కాపాడి ఆ భాషను సజీవం చేయడానికి తెలంగాణ కవి పండితులు మరొక్కసారి తమ కలాలను సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ భాష కేవలం ఉద్యమ భాష కాదు. ఈ భాష ఇక్కడి జనాల జీవభాష. తెలంగాణ భాష ఇక్కడి జనాల ప్రాణ భాష. ఈ భాష తెలంగాణ జనాల వ్యావహారిక వాక్‌ధార.
తెలంగాణ భాషకు సంబంధించి ఇప్పటికే రవ్వా శ్రీహరి ‘నల్లగొండ జిల్లా మాండలిక పదకోశం’,డా.నలిమెల భాస్కర్ తెలంగాణ పదకోశావళి’ ‘,కపిలవాయి లింగమూర్తి‘పామర సంస్కృతంపాలమూరు మాండలికంతెలంగాణ పదకోశం’, కాలువ మల్లయ్య‘గుమ్మితెలంగాణ నిఘంటువు’,భూతం ముత్యాలు ‘తెలంగాణ కులవృత్తి పదకోశం’ ప్రకటించగా..,’డా.మలయశ్రీగార్లు ‘మన మంచి తెలుగు’ మనముందుంచి మన భాషకు చక్కని దిశానిర్దేశం చేసారు. ఇటీవల తెలుగు యూనివర్సిటీ “బృహత్ తెలంగాణనిఘంటువు”ను మహాసంకలనంగా ఒక సంకల్పంగాతీసుకువస్తుండడం తెలంగాణ భాషకు అత్యంత శుభపరిణామం. అయితే తెలంగాణ కవులు,రచయితలు,భాషా పండితులు కూడా తమ వంతు బాధ్యతగా తెలంగాణ భాషను సజీవం చేసే కార్యక్రమం చేపట్టాలి. తెలంగాణ తెలుగు భాష అనడం కంటే కూడా ‘తెలంగాణ భాష’ అని గానీ కొందరి అభిప్రాయం మేరకు ‘తెలంగి’లాంటి పదాలను పరిశీలిస్తే బాగుంటుంది.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రెవెన్యూ శాఖల్లాంటి కొన్ని శాఖల్లో పక్కా తెలంగాణ భాషను ప్రవేశపెట్టి సత్పలితాలు పొందుతున్న విషయం తెలిసిందే.అదే విధంగా అన్ని శాఖల్లోనూ పక్కా తెలంగాణ భాషను ప్రవేశపెట్టి తెలంగాణ భాష అస్తిత్వాన్ని కాపాడాల్సి ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట పోరాటం యొక్క తొలి బీజాలు తెలంగాణ భాషకు జరుగుతున్న అవహేళనకు ప్రతిస్పందనే. తెలంగాణ భాషను రెండవ శ్రేణి భాషగా కారడ్డాల భాషగా కామెడీ భాషగా ఏండ్లకేండ్లుగా చిత్రీకరించిన తెలుగు సినిమావాళ్లు ఇప్పుడిప్పుడు ఒకటి రెండు సినిమాల్లో నాలుగైదు తెలంగాణ పదాలు వాడుతున్నది వారి మార్కెటు అవసరాల కోసమనే విషయాన్ని దృష్టియందుంచుకోవాలి.
తెలంగాణ భాషను ఒక మాండలిక భాషగా,ఒక యాసగా చిత్రీకరించి భాషా పండితులు కొందరు భాషా అధ్యయన శాస్త్రాల్లో, భాషా చరిత్రల్లో రెండు కోస్తా జిల్లాల భాషను ప్రామాణికం చేసారు. తెలంగాణ భాషను తెలుగు భాషలో ఒక సన్నని పాయగా ఒక మాండలిక భాషగా,యాసగా అట్లా ఆ తెలుగు పండితులు తెలంగాణ భాషను ఒక మూలకి నెట్టి వేసారు.తెలంగాణ ఉద్యమ ప్రభావంతో తెలంగాణ భాషను మాట్లాడడానికి ఇప్పుడు ఎవ్వరూ ఇబ్బంది పడట్లేదు.నామోషీ అవ్వట్లేదు. కనుక ఈ సందర్బంలో తెలంగాణ భాష కు జవజీవాలు కలిగించడం సులువు. తెలంగాణ యాసను మించి భాషకు ఉండవలసిన అన్ని లక్షణాలు..,ఏ భాషకు లేని ప్రత్యేకతలు తెలంగాణ భాషకున్న విషయాన్ని భాషా పండితులు ఏనాడో చెప్పడం జరిగింది.
అస్త్తిత్వ ఉద్యమాల్లో ఎవరి సాహిత్యం వారు రాసుకోవాలనుకున్నప్పుడు… ఎవరి భాషలో వారు రాసుకోవాలనుకోవడం కూడా సహజమే కదా. కనుక వస్తువు తెలంగాణాది భాష తెలుగుది అయితే భావం సరిగ్గా పలకదు కదా…అట్లాగని తెలుగు భాషను వాడకూడదు అనే మితిమీరిన నియమాలు ఇప్పటికిప్పుడు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ పునర్మిర్మాణం వేళ తెలంగాణ భాషను ప్రజల వాడుకలోకి..,ప్రజల వాడుక భాషను ప్రభుత్వ భాషగా చేయగలిగితే సంపద్వంతమైన దళిత బహుజనుల భాషాపదాలు,తెలంగాణ భాషా పదాలు,తెలంగాణ పల్లె పదాలు,తెలంగాణ శ్రామిక కులాల,ఉత్పత్తి కులాల,సంచార కులాల భాషా పదాలు సజీవంగా ఉండి తెలంగాణ భాష తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటుంది. దానికిదే మంచి సమయం. మరీ ముఖ్యంగా ఏ భాషకు జరిగిన అవమానాలకు తల్లడిల్లిపోయామో..,ఏ భాషను యాస అంటూ అవహేళన చేసారో..,ఏ భాషను ఒకానొక మాండలికానికి పరిమితం చేసి ద్వితీయ శ్రేణి భాషగా చూ సారో ఆ తెలంగాణ భాష తెలంగాణ పునర్నిర్మాణం సందర్భంగా వెలుగులు విరజిమ్ముతుందని అనుకున్నా మో ఆ భాష పేరుతో సభలు నిర్వహించడం మంచిది కాని మళ్లీ తెలు గు మహాసభలు పేరిట సభలు పెట్టడం ఎవరిమెప్పు పొందడాని కో అర్థం కాని పరిస్దితి. ఏండ్లకేండ్లుగా అధికార జులుంగా మనమీద పెత్తనం చెలాయించిన తెలుగు భాష పేరిట సభలు నిర్వహించడం తెలంగాణవాదులకు సమ్మతం అవుతుందా లేదా అనేది పునరాలోచించాలి. తెలుగు మీద దురుద్దేశ్యం కాదుకాని నాన్‌లోకల్ నన్నయ్యలను ఏండ్లకేండ్లుగా మోసిన తెలంగాణ మస్తిష్కాలు ఇంకా తెలుగును మోయగలవా లేదా ఒకసారి పునశ్చరణ చేసుకుంటే మంచిది.

Comments

comments