Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

జౌను..వీరింతే!

landఅడ్డుకున్నట్లే బిల్డప్, ఎక్కడా అడ్డుకున్న దాఖలాలుండవు
అడుగునా అక్రమ లేఅవుట్ల జాతర
మంత్రుల మాటలకు,అధికారుల చేతలకు పొంతన లేదు
హెచ్‌ఎండిఎ, పంచాయతీ అధికారుల అండదండలు?

అమాత్యుల మాటలకు అధికారుల చేతలకు పొంతన లేదు. అక్రమార్కులు ఎంతటి వారైనా కఠినంగా అణిచివేస్తామని మంత్రులు ప్రకటనలు చేస్తుంటే అందిన కాడికి దండుకుని కళ్లు మూసుకుంటామన్న విధంగా రంగారెడ్డి జిల్లా రెవెన్యూ, పంచాయతీ అధికారులు వ్యవహరిస్తున్నారు. మన తెలంగాణ, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : అమాత్యుల మాటలకు అధికారుల చేతలకు పొంతన లేదు. అక్రమార్కులు ఎంతటి వారైనా కఠినంగా అణిచివేస్తామని మంత్రులు ప్రకటనలు చేస్తుంటే అందిన కాడికి దండుకుని కళ్లు మూసుకుంటామన్న విధంగా రంగారెడ్డి జిల్లా రెవెన్యూ, పంచాయతీ అధికారులు వ్యవహరిస్తున్నారు. అక్రమ లేఅవుట్‌లు, నిర్మాణాలపై వికారాబాద్ జిల్లాలో అధికారులు ఉక్కుపాదం మోపుతుంటే రంగారెడ్డి జిల్లాలో అక్రమ లేఅవుట్‌లకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నారు. జంట జలాశయాల పరీవాహక ప్రాంతంలో అక్రమ లేఅవుట్‌లను అడ్డుకుంటామని, అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని అవసరమైన ఎస్టీపిలను నిర్మించి జంట జలాశయాలను పూర్తి స్థాయిలో రక్షిస్తామని రాష్ట్ర మంత్రి కెటిఆర్ శాసనసభలో ప్రకటిస్తున్నా ఆచరణలో మాత్రం రంగారెడ్డి జిల్లా యంత్రాంగం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది. హెచ్‌ఎండిఎ, పంచాయతీ అధికారుల కాసుల కక్కుర్తి పుణ్యమా జంట జలాశయాలకు గండం ముంచుకొస్తుంది. హెచ్‌ఎండిఎ, జిల్లా పంచాయతీ విభాగంలో కీలకమైన అధికారుల అండదండలతో జంట జలాశయాలకు ఆనుకొని యధేచ్ఛగా ఇష్టారాజ్యంగా అక్రమ లేఅవుట్‌లు ఏర్పాటు చేయడంతో పాటు యధేచ్ఛగా క్రయవిక్రయాలు నిర్వహిస్తున్నారు. గండిపేట్, హిమాయత్‌సాగర్ చెరువులకు ఆనుకొని ఉన్న అజీజ్‌నగర్, హిమాయత్‌నగర్, ఎన్కెపల్లి, చందానగర్, చిల్కూర్, చిన్నమంగళారం గ్రామాలతో పాటు పెద్ద మంగళారం, సురంగల్, కనకమామిడి, తదితర గ్రామాలలో పెద్ద ఎత్తున అక్రమ లేఅవుట్‌లు వెలుస్తున్నాయి. శంషాబాద్ మండల పరిధిలోని హిమాయత్‌సాగర్ చెరువుకు ఆనుకొని ఔటర్ పక్కనే అక్రమ లేఅవుట్‌ల జాతర నడుస్తుంది. శంకర్‌పల్లి, రాజేంద్రనగర్, చేవెళ్ళ, షాబాద్ మండలాల పరిధిలో సైతం అక్రమ లేఅవుట్‌లు వెలుస్తున్నా జిల్లా పంచాయతీ యంత్రాంగం, హెచ్‌ఎండిఎ అధికారులు తమకు కావలసిన నజరానాలు వస్తే చాలు ఎక్కడ లేఅవుట్‌లు వెలిస్తే మాకేంటి అన్న విధంగా వ్యవహరిస్తున్నారు.
రెవెన్యూ, ఎంపిడిఓ కార్యాలయం ముందే….
మారుమూల ప్రాంతంలో అక్రమ లేఅవుట్‌లు వెలిస్తే తమ దృష్టికి రాలేదని అధికారులు చెప్పడం ఉన్నతాధికారులు వినడం పరిపాటి సహజం. కానీ మండల తహసీల్దార్, మండల పరిషత్ అభివృద్ది కార్యాలయం, పోలీస్‌స్టేషన్‌ల ముందు అక్రమ లేఅవుట్ వెలుస్తున్నా కనీసం పట్టించుకోకపోవడం వెనక మతలబు ఏమిటో జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా కలెక్టర్‌లకే తెలియాలి. హైద్రాబాద్ బీజాపూర్ రహదారిలో ప్రధాన రహదారిపై ప్రతి నిత్యం మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్‌లు, ఇతర ఉన్నతాధికారులు రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డుకు ఇరువైపులా కనీస అనుమతులు లేకుండా సర్కార్ ఖజానాకు టోకరా పెట్టి వెలుస్తున్న లేఅవుట్‌లు, అక్రమ నిర్మాణాలు వారికి కనిపించడం లేదా…కనిపించినా తమకు కావలసిన వాటాలు వచ్చినందుకు మౌనంగా ఉంటున్నారా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హెచ్‌యండిఎ పరిధిలో లేఅవుట్‌లకు అనుమతులు ఇవ్వడానికి సర్పంచ్‌లకు ఎలాంటి అధికారం లేకపోయినా ఇక్కడ అంతా మామూళ్ల రాజ్యంగానే సాగుతుంది.
అధికారులకు కాసుల పంట….
అక్రమ లేఅవుట్‌లు హెచ్‌యండిఎ, పంచాయతీ, రెవెన్యూ యంత్రాంగంకు కాసుల పంట పండిస్తున్నాయి. మొయినాబాద్, శంషాబాద్, రాజేంద్రనగర్, షాబాద్, చేవెళ్ళ, కొత్తూర్ మండలాల పరిధిలో వెలుస్తున్న లేఅవుట్‌లలో గ్రామ స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు కల్పతరువుగా మారినట్లు ప్రచారం జరుగుతుంది. ఒక్కో గ్రామంలో పదుల సంఖ్యలో అక్రమ లేఅవుట్‌లు వెలుస్తున్నా మండల పంచాయతీ అధికారి, గ్రామ అధికారులు ఏమి చేస్తున్నారో కలెక్టర్‌కు, డిపిఓలకు తెలియాలి. రియల్టర్ ఎకరంలో లేఅవుట్ చేస్తే స్థానికంగా ఉన్న భూమివిలువను బట్టి దాదాపు అయిదు నుంచి పది లక్షల వరకు అధికారులకు చెల్లింపులు చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. లేఅవుట్ ప్రారంభించిన సమయంలో రియల్టర్‌లు తమ వద్దకు రాకపోతే మొదటి నోటీసు జారీచేసి తమ దారికి తెచ్చుకుంటున్నట్లు తర్వాత సైతం సమయానికి రావలసినవి రాకపోతే మరో నోటీసు జారీచేస్తున్నట్లు సమాచారం. నోటీసులు జారీచేయడం తప్ప అక్రమాలను అడ్డుకోవాలన్న చిత్తశుద్ది హెచ్‌యండిఎ, పంచాయతీ అధికారులకు ఎంత మాత్రం లేకపోవడం మూలంగా రియల్టర్‌లు, అధికారులు కలసి దందా చేసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్, కలెక్టర్ ఒక్కసారి కూడా ఇటువైపు కన్నెత్తికూడా చూడకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

Comments

comments