Search
Saturday 24 March 2018
  • :
  • :

ఆగమేఘాలతో… బోరబండ మార్కెట్ కూల్చివేత

Market-image

రోడ్డునపడ్డ చిరు వ్యాపారులు జీవించేందుకు ప్రత్యామ్నాయం లేదు ఎంత కాలం ఈ బజారు బతుకులంటున్న వ్యాపారులు కూల్చివేసిన నిర్మాణాలకు నష్టపరిహారంపై ఊసెత్తని అధికారులుఎంత వ్యతిరేకించినా వినని ప్రజా ప్రతినిధులు, అధికారులు వ్యాపారులంతా సమ్మతమేనని బుకాయింపు భయంతో నోరెత్తని వ్యాపారులు

మన తెలంగాణ/జూబ్లీహిల్స్ : రెక్కాడితేగాని డొక్కాడని చిరు వ్యాపారుల గుండెలు ఒక్కసారిగా బరువెక్కాయి. నిర్ధాక్షిణ్యంగా భారీ ప్రొక్లైనర్లతో కూల్చివేయబడుతున్న తమ కూరగాయల కొట్లను చూస్తున్న వ్యాపారస్తుల కళ్లలో నీళ్లు నిండాయి. ఈ సమయంలో అందరి మనుసుల్లో తొలుస్తుంది ఒక్కటే, రేపటి నుంచి ఎలా బతకాలి అని. ఎవరిని కదిలించినా ఏం చెప్పాలో తోచని దీన పరిస్థితి. అమాయకంగా జీవంలేని చూపులే వారి సమాధానంగా కొట్టొచ్చినట్టు కనబడింది. బోరబండ కూరగాయల మార్కెట్ కూల్చివేతపై వ్యాపారుల్లో నెలకొన్న దుర్భర పరిస్థితిని తెలుసుకునేందుకు మంగళవారం ఉదయం ‘మనతెలంగాణ’ అక్కడికి వెళ్లి కలిసింది. అక్కడ జరిగిన వివరాలు చెప్పేందుకు వ్యాపారులు వణికి పోతున్నారు. తమ పేర్లుగాని, ఫోటోలుగాని బయటపెట్టవద్దని వేడుకున్నారు. అలాంటిదేమీ జరుగదని హామీ ఇచ్చిన అనంతరం చెప్పేందుకు ముందుకు వచ్చారు.

వ్యాపారుల మనోవేదనను కదిలిస్తే బయటపడిన వాస్తవాలకు, అక్కడ జరిగిన దానికి పొంతనలేదని తేలిపోయింది. ప్రజల ఇష్టా అయిష్టాలతో సంబంధం లేకుండా బలవంతంగా చేపట్టే అభివృద్ధిని ఎలాంటి అభివృద్ధి అంటారో ప్రభుత్వమే చెప్పాలని కొందరు విమర్శిస్తున్నారు. పైగా ప్రజల నోర్లు మూయించడం, తమ అభిప్రాయాలను ప్రజల అభిప్రాయాలుగా వారిపై బలవంతంగా రుద్ది అంతా సమ్మతమేనని   ప్రచారం చేయడం కూడా అధికార పార్టీ నాయకులకే చెల్లుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోరబండ ప్రాంతంలో అంతా ఒక్కటై తాను చెప్పిందే చెల్లుబాటు కావాలని, ఇతరుల అభిప్రాయాలు తనకవసరం లేదనే విర్రవీగుడు, అహంభావం వ్యక్తం అవుతుందని ఆరోపిస్తున్నారు. నివురుగప్పిన నిప్పులా రగిలిపోతున్న ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసే ప్రతిపక్ష నాయకులు లేరా అని మండిపడుతున్నారు. లేదంటే కూరగాయల మార్కెట్ కూల్చివేతలో వాపారస్తులు నష్టపోయినట్టుగానే ఈ ప్రాంతం మరెన్ని విధాలుగా నష్టపోతుందోననే ఆందోళన వ్యక్తం అవుతోంది.

మార్కెట్ వివరాల్లోకి వెళ్లితే బోరబండ ప్రధాన చౌరస్తాకు సమీపంలో పాత పోలీస్ ఔట్‌పోస్టుకు దగ్గర సర్వే నెంబర్ 127లో  ఎస్‌ఆర్‌టి నగర్ బస్తీ ఉంది. మార్కెట్‌కు ముందు రోజుల్లో బస్తీకి చెందిన విశాలమైన ఈ స్థలంలో యువకులు, విద్యార్థులు వాలీబాల్, కబడ్డీ ఆటలు ఆడుకునేది. దీని విస్తీర్ణం సుమారు 800 గజాలు. అంతకు ముందు రోడ్డుకు ఇరువైపుల తోపుడు బళ్లతో కూరగాయలు అమ్ముకుంటున్న వ్యాపారులకు ప్రతిరోజూ ట్రాఫిక్‌తో ఇబ్బందులు తలెత్తడంతో ఈ ఖాళీ స్థలంలో ఇరవై ఏళ్ల క్రితం నుంచి కూరగాయలు అమ్ముకోవడం ప్రారంభించారు. క్రమ క్రమంగా ఇది కూరగాయల మార్కెట్‌గా రూపాంతరం చెందింది. నేలపైనే వ్యాపారం నిర్వహించుకోవడంవల్ల అంతా చిత్తడిగా ఉండేది. అపరిశుభ్రత తాండవించేది. ఇలాంటి సమయంలో గత తొమ్మిదేళ్ల క్రితం ఈ మార్కెట్ అగ్ని ప్రమాదానికి గురైంది. మొత్తం మార్కెట్ కాలి బూడిదైంది. సంఘటన స్థలాన్ని సందర్శించిన నాటి డిప్యుటీ కలెక్టర్ నష్టపరిహారం కింద వ్యాపారస్తుల కోసం 120 షెడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఈ మార్కెట్ చుట్టుపక్కల పదుల సంఖ్యలో ఉన్న బస్తీల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. కాబట్టే ఈ ప్రాంతంలో బడా మార్కెట్‌గా పేరొంది ఎర్రగడ్డ రైతు బజారును తలపించేట్టుగా నిత్యం కిక్కిరిసిన జనంతో మార్కెట్  కళకళలాడుతూ ఉంటుంది.

ఈ మార్కెట్ ఆధారంగా ఎంతలేదన్నా సుమారు రెండు లేదా మూడు వందల మంది చిరు వ్యాపారుల కుటుంబాలు బతుకులు వెళ్లదీస్తుంటాయి. ఈ మార్కెట్‌కు రాజకీయ గ్రహణం పట్టింది. చక్కగా సాగుతున్న మార్కెట్‌ను కొంతమంది కుట్రపన్ని ‘కుక్కను చంపే ముందు పిచ్చికుక్క’గా ముద్రవేసినట్లు ఈ స్థలం సంక్షేమ భవనానికి చెందిందని,  వ్యాపారుల వద్ద దళారులు ప్రతి రోజు మామూళ్లు దండుకుంటున్నారని, అక్రమంగా ఆక్రమించి మార్కెట్‌ను నిర్వహిస్తున్నారని ఆరోపించడం ప్రారంభించారు. అందులో భాగంగానే సోమవారం అధికారులు బలవంతంగా మార్కెట్‌ను కూల్చివేశారు. సరే కూల్చివేశారు. వారు చెప్పేది బాగానే ఉందనుకున్నా. రెండు, మూడు చదరపు కిలో మీటర్ల వైశాల్యంలో ఉన్న విశాలమైన ఈ బోరబండ ప్రాంతంలో ఎక్కడైనా ఏ బస్తీలోనైనా సంక్షేమ భవనానికి 800 గజాల స్థలం ఉందా అనేది ఒక ప్రశ్న. అదీగాక దశాబ్దాల తరబడి ఈ స్థలం జిహెచ్‌ఎంసి కమ్యూనిటీహాల్‌కు చెందిందని ఏలాంటి బోర్డు కూడా పెట్టలేదు సరికదా కేవలం 48 గంటల సమయమిచ్చి నోటీసులు అందజేయడం, ఆ వెంటనే ఆగ మేఘాల మీద పోలీసు బందోబస్తుతో వచ్చి కూల్చివేయడం వ్యాపారుల జీవితాలతో చెలగాటమాడడం కాదా అనేది రెండో ప్రశ్న. ఈ రెండు ప్రశ్నలకు జవాబు కావాలంటున్నారు చిరు వ్యాపారులు.

ప్రజా ప్రతినిధుల, అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల మార్కెట్ కూల్చివేతతో వందల మంది వ్యాపారులు రోడ్డున పడ్డారు. రేపటి సంగతి దేవుడెరుగు కాని ఇపుడైతే పొట్టమీద దెబ్బ పడిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే చనిపోయిన ప్రాణం తిరిగి వస్తుందా అని ప్రశ్నించినట్టే కదా? నూటికి తొంబై మంది వ్యాపారులు వ్యతిరేకిస్తున్నపుడు కూల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీస్తున్నారు. తమ మంచి కోరే వారే అయితే భవిష్యత్ పరిణామాలపై స్పష్టత ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు.కూల్చివేసిన స్టాళ్లకు నష్ట పరిహారం ఇవ్వాలి, ప్రత్యామ్నాయం చూపాలి. వేళ్లమీద లెక్కపెట్టే కొందరి బాగు కోసమే మార్కెట్‌ను కూల్చివేశారనే ఆరోపణలు బలంగా వినబడుతున్నాయి. మార్కెట్‌ను ఆధునీకరించి, సంక్షేమ భవనం నిర్మించడాన్ని స్వాగతిస్తున్నామని, కానీ మంచి చేస్తున్నామనే పేరుతో చెడు చేయడాన్ని సహించబోమని అంటున్నారు. కూల్చివేసిన షెడ్లకు నష్టపరిహారం ఇచ్చే విషయాన్ని దాటవేస్తున్నారని, నిర్మాణం పూర్తయ్యేంత వరకు ఎన్ని నెలలు పడుతుందో అన్ని నెలలు ప్రత్యామ్నాయం చూపకపోవడం అభివృద్ధి ఎలా అవుతుందని వారంటున్నారు. ఇక ఇపుడున్న స్టాళ్లు రేపు నిర్మాణం పూర్తైన తర్వాత తమకే దక్కుతాయని గ్యారెంటీ ఏమిటి? అవినీతి జరిగి స్టాళ్లను లక్షల్లో అమ్ముకోరనే గ్యారెంటీ ఏముంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రస్తుతం స్టాలు ఉన్న కొందరికి స్టాలు దక్కలేదని, అధికారులు తమ పేర్లు రాసుకోలేదని వాపోతున్నారు. ఇకనైనా మున్సిపల్ అధికారులు తమ ఆవేదనను అర్థం చేసుకొని ప్రస్తుతం కూల్చివేసిన స్టాళ్లకు ఒక్కొక్కరికి సుమారు రూ. 30 నుంచి 40 వేల వరకు నష్టపరిహారం చెల్లించాలని, నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, చెల్లా చెదురైన వ్యాపారం కుదురుకునే వరకు కొంత నష్టపరిహారం ఇవ్వాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.  వ్యాపారుల క్షేమం కోరేవారే అయితే పైన చెప్పినవన్నీ పూర్తి చేసి కూల్చివేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో ప్రజా ప్రతినిధులుగాని, మున్సిపల్ అధికారులుగా వ్యాపారులకు రాతపూర్వకంగా హామీ ఎందుకివ్వడం లేదని నిలదీస్తున్నారు. కూరగాయల మార్కెట్ కూల్చివేత, చిరు వ్యాపారుల అభిప్రాయాల విషయమై వివరణ కోరేందుకు మన తెలంగాణ ప్రతినిధి మున్సిపల్ అధికారి డిసి రమేష్, ఎంఎల్‌ఎ గోపీనాధ్, డిప్యూటి మేయర్ బాబా ఫసియొద్దీన్‌లను సంప్రదించగా ఏ ఒక్కరూ కూడా అందుబాటులోకి రాలేదు. బాబా ఫసియొద్దీన్ ఫోన్ ఎత్తిన వ్యక్తి మాత్రం తాను కమర్‌ను మాట్లాడుతున్నానని, కొంత సమయం తర్వాత డిప్యూటీ మేయర్‌తో మాట్లాడిస్తానని చెప్పాడు కాని ఆచరణ రూపం దాల్చలేదు.

Comments

comments