Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

రాష్ట్ర వ్యాప్తంగా సిసిటివిలు

p2

నేరభీతి కల్పించడం ద్వారా శాంతి భద్రతల పరిరక్షణ
– కొత్త డిజిపి మహేందర్‌రెడ్డి

సిటీబ్యూరో:నేరం చేస్తే పట్టుబడడం ఖాయం..అనే భయాన్ని నేరస్తుల్లో కలిగేలా రాష్ట్ర వ్యాప్తంగా సిసిటివి ప్రాజెక్ట్‌ను యుద్ధప్రాతిపదికపై కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర నూతన డిజిపి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు స్థానికులతో పోలీసులు మమేకం కావాలని ఆయన సిబ్బందికి పిలుపునిచ్చారు. డిజిపిగా మహేందర్‌రెడ్డి ఆదివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. డిజిపి కార్యాలయంలో అనురాగ్‌శర్మ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన డిజిపికి అనురాగ్‌శర్మ శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన అనురాగ్ శర్మ వీడ్కోలు సభలో నూతన డిజిపి మహేందర్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ పోలీసును నెంబర్ వన్‌గా నిలబెట్టిన ఘనత డిజిపిగా అనురాగ్‌శర్మకు దక్కిందని మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సిఎం పోలీసులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించారన్నారు. కొత్త రాష్ట్రం లో అన్ని ఇబ్బందులను అధిగమించినట్లు చెప్పారు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదని తెలంగాణ పోలీసులు నిరూపించారని కొనియాడారు. హైదరాబాద్‌లో నేను సైతం ప్రాజెక్టు అద్భుత ఫలితాలను ఇచ్చిందని గుర్తు చేశారు. -నగరంలో సిసి కెమెరాలను భారీగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి గుర్తింపు ఇస్తామన్నారు. స్థానికులతో పోలీసులు మమేకం కావాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసుల సేవల్లో నాణ్యత పెంచుతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భరోసా సెంటర్లు, మహిళల భద్రత కోసం షీటీమ్స్‌ను విస్తరిస్తామని తెలిపారు. చిన్న పిల్లలపై లైంగిక దాడులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. హోంగార్డుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. సైబర్ క్రైమ్స్‌ను అరికట్టేందుకు జిల్లాల్లో ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పోలీసులు టెర్రరిజం, నక్సలిజం సమస్యలను ధీటుగా ఎదుర్కొంటున్నట్లు మహేందర్‌రెడ్డి చెప్పారు. ప్రజలకిచ్చే సేవల నాణ్యత, అన్ని పోలీసు కమిషనరేట్లలో ఒకేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఆదిలాబాద్ అయినా..హైదరాబాద్ అయినా ఒకే విధంగా వ్యవస్థ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
అధ్యయన శీలి.. అనుభవ శాలి..
డిజిపిగా నియమితులైన ఎం.మహేందర్‌రెడ్డి స్వస్థలం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురం. 1962 డిసెంబర్ 3న రైతు కుటుంబంలో జన్మించారు. వరంగల్ ఆర్‌ఇసి నుంచి బిటెక్ (సివిల్) పూర్తి చేశారు. ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్ చదువుతుండగానే 1986లో ఐపిఎస్‌కు ఎంపికయ్యారు. పలు జిల్లాలలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన.. సైబరాబాద్ కమిషనర్‌గా, ఇంటెలిజెన్స్ చీఫ్‌గా, గ్రేహ్యాండ్స్ ఐజిగా వ్యవహరించారు. 2014 జూన్ నుంచి హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా వ్యవహరిస్తున్న మహేందర్‌రెడ్డి.. సిటీ పోలీసును పీపుల్స్ ఫ్రెండ్లీ గా మార్చారన్న పేరు తెచ్చుకున్నారు. కరీంనగర్, గుం టూరు, ఆదిలాబాద్, నిజామాబాద్, కర్నూల్ జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఇండియన్ పోలీసు మెడల్, ప్రెసిడెంట్ పోలీసు మెడళ్లను అందుకున్నారు. నేషనల్ పోలీసు అకాడమీలో ఫ్యాకల్టీగా పనిచేశారు. యూఎస్, యూకే దేశాల్లో పోలీసు వ్యవస్థపై అధ్యయనం చేసి వచ్చారు. మహేందర్‌రెడ్డి సతీమణి అనిత గృహిణి.
హైదరాబాద్ ఇన్‌ఛార్జీ
పోలీసు కమిషనర్‌గా వివి శ్రీనివాస్‌రావు
నగర పోలీసు ఇన్‌ఛార్జి కమిషనర్‌గా వివి శ్రీనివాసరావు ఆదివారం బాధ్యతలు చేపట్టారు. డిజిపి అనురాగ్‌శర్మ ఉద్యోగ విరమణ చేయడం, నగర కమిషనర్‌గా ఉన్న మహేందర్‌రెడ్డి నూతన డిజిపిగా నియమించడంతో ఆ స్థానంలో శ్రీనివాసరావును ప్రభుత్వం నియమించింది.

Comments

comments