Search
Wednesday 22 November 2017
  • :
  • :

ఆర్డర్లీ వ్యవస్థకు చెక్

plsh

కఠినంగా వ్యవహరించాలని డిజిపి మహేందర్‌రెడ్డి నిర్ణయం 

 హైదరాబాద్: పోలీసు శాఖను పట్టి పీడిస్తోన్న ఆర్డర్లీ వ్యవస్థపై కఠినంగా వ్యవహరించాలని డిజిపి ఎం. మహేందర్‌రెడ్డి నిర్ణయించారు. మంగళవారం తన కార్యాలయంలో పోలీసు శాఖలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులు, జిల్లాల ఎస్‌పిలు, డిఐజి, ఐజి, అదనపు డిజి స్థాయి అధికారులతో భేటీ అయి పలు అంశాల పై చర్చించారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై జిల్లాల వారీగా తెలుసుకున్న డిజిపి తర్వాత శాంతి భద్రతలను కాపాడే విషయంలో  ఏ మాత్రం రాజీ పడొద్దని ఆదేశించారు. ఆర్డర్లీ వ్యవస్థతో పోలీసు శాఖ ప్రతిష్ట మంటగలుస్తోందని, ఇటీవల వెలుగులోకి వచ్చిన రెండు సంఘటనలను డిజిపి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అధికారులు ఒకప్పుడు కింది స్థాయి నుంచి వచ్చిన వారే అన్న విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తిస్తే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవని చెప్పారు. ఆర్డర్లీ వ్యవస్థను ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించేది లేదని, దీన్ని ఎవరు ప్రోత్సహించినా వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేసే విషయాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర సరిహద్దులలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, వరంగల్, భూపాలపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర జిల్లాలలో మావోయిస్టుల కదలికలపై నిఘాను మరింతగా పెంచాలని ఆదేశించారు. గ్రేహాండ్స్ బలగాల కూంబింగ్ కొనసాగించాలని, ఎట్టి పరిస్థితులలో మావోయిస్టుల ఉనికి రాష్ట్రంలో కనిపించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విఐపిల పర్యటన సందర్భంగా వీలైనన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని, ఇదే సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. కింది స్థాయి సిబ్బందితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ వారికి ఎదురవుతున్న సమస్యలపై కూడా దృష్టి కేంద్రీకరించాలన్నారు. ప్రదర్శనలు, ఊరేగింపులు, రాస్తారోకోల సందర్భంగా వీలైనంత వరపకు సహనంతో వ్యవహరించాలని ఆదేశించారు. ఇదే సమయంలో శాంతికి విఘాతం కలిగించే విధంగా వ్యవహరించే వారి పట్ల కఠినంగా ఉండాలని సూచించారు. ఏ అధికారి అయినా ఎప్పుడైనా తనను సంప్రదించవచ్చని, వీలైనంత మేర ప్రజలతో మమేకమై ఉండాలని సూచించారు. సుమారు రెండున్నర గంటల పాటు జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఉద్దేశ్యాలు, లక్ష్యాలను డిజిపి వివరించినట్లు సమాచారం. ఇదే సమయంలో జిల్లాల వారిగా పోలీసుస్టేషన్లు, డివిజన్‌లలో ఉన్న సమస్యలు, సంఘ విద్రోహకర శక్తులెవరనే విషయాలపై కూడా ప్రత్యేకంగా చర్చించారు

Comments

comments